నీళ్లు, నిధులు.. కేసీఆర్ బాటలో రాయలసీమలో కొత్త ఉద్యమం?

నీళ్లు, నిధులు.. కేసీఆర్ బాటలో రాయలసీమలో కొత్త ఉద్యమం?
x
Highlights

నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇదే నినాదంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర కలను నిజం చేసుకున్నారు. ఇప్పుడు ఇదే నినాదంతో రాయలసీమలో ఉద్యమం రాబోతోందా.. ? నీళ్లు,...

నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇదే నినాదంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర కలను నిజం చేసుకున్నారు. ఇప్పుడు ఇదే నినాదంతో రాయలసీమలో ఉద్యమం రాబోతోందా.. ? నీళ్లు, నిధులు అంటూ కొత్త వాదన తెరపైకి వచ్చిందా.? అవును బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇదే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. నీళ్లు, నిధుల కోసం పోరాటం తప్పదంటూ చేసిన హెచ్చరికలు ఉద్యమం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నాయి.

ఏపీలో బీజేపీ నేతలు కొత్త వాదనను తెరమీదకు తెస్తున్నారు. కేసీఆర్ తరహాలో ప్రత్యేక వాదనను వినిపిస్తున్నారు. నిధుల విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటున్నారు. తిరుమల రాయలసీమలో ఉంది కాబట్టి టీటీడీకి వచ్చే డబ్బు మొత్తాన్ని రాయలసీమ అభివృద్ధికే ఖర్చు చేయాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ కొత్త డిమాండ్‌ను తీసుకొచ్చారు. విజయవాడ దుర్గగుడి, సింహాచలం ఆలయాల డబ్బులు ఆ ప్రాంతాలకే ఖర్చు పెడుతున్నారని అలాగే రాయలసీమకు టీటీడీ డబ్బును ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.

టీటీడీ నిధులు మాత్రమే కాదు రాయలసీమ నీళ్లు ఇతర ప్రాంతాలకు తరలించకూడదంటూ టీజీ వెంకటేశ్ కొత్త వాదనను తీసుకొచ్చారు. గోదావరి, నీళ్లు కృష్ణా ప్రాంతానికే ఇచ్చి రాయలసీమ నీళ్లు సీమకే వాడుకునేలా చేస్తామని వైఎస్ గతంలో చెప్పారని కానీ ఆ దిశగా అడుగులు పడలేదన్నారు. రాయలసీమ విషయంలో భవిష్యత్‌లో అలజడి జరిగే అవకాశాలున్నాయని ఆయన హెచ్చరించారు. తన డిమాండ్స్ అయిన అమరావతి ఫ్రీ జోన్, రాయలసీమకు నీళ్లు, నిధుల విషయంలో వెనకడుగు వేయనన్నారు. ఏపీకి రెండు రాజధానులు ఉండాలంటూ రాయలసీమలో ఓ రాజధాని కచ్చితంగా ఏర్పాటు చేయాలంటూ టీజీ వెంకటేష్ వాదన వినిపిస్తున్నారు.

తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇదే వాదనలు వినిపించారు. రాయలసీమ వెనుకబాటుతనంపై పలు వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, రాయలసీమ జిల్లాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీసం జగన్ ప్రభుత్వమైనా కేంద్రానికి సహకరించాలన్నారు. కేంద్రానికి సహకరించడం ద్వారా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు.

బీజేపీ నేతలు తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇదంతా చూస్తుంటే సీమలో మరో ఉద్యమం మొదలవుతోందా..? ఈ ఉద్యమాన్ని బీజేపీ తెర వెనక నుంచి ఎగదోస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ నేతల వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories