తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు..?

BJP High Command Focus On New Telangana President Selection
x

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు..?

Highlights

కేంద్రంలో కొత్త ప్రభుత్వం సెలవుతీరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు పార్టీ బలోపేతంపై కూడా బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

BJP President: లోక్ సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిపై ఊహాగానాలు మొదలయ్యాయి. కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి దక్కడంతో బీజేపీ క్యాడర్ లో చర్చ ఊపందుకుంది.

కేంద్రంలో కొత్త ప్రభుత్వం సెలవుతీరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు పార్టీ బలోపేతంపై కూడా బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో బీజేపీ కాస్త బలహీన పడటంతో పార్టీని మళ్ళీ గాడిలో పెట్టాలని కమలం పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులను మార్చాలనే ఉద్దేశంతో జాతీయ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి మరోసారి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో, ఇక తెలంగాణలో కూడా నూతన అధ్యక్షుడు రాబోతున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఒక నేతకు ఒకటే పదవి అనే నినాదం బీజేపీలో ఎప్పటి నుండో ఉంది. అయినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం నియమించింది‌. సుమారు ఏడాది కాలంగా కేంద్రమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి రెండు పదవుల్లో కొనసాగుతున్నారు. కిషన్ రెడ్డి మరోసారి కేంద్రమంత్రి కావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు అనివార్యమైందని సమాచారం. అధ్యక్షమార్పు ఉంటుందని కొత్త అధ్యక్షుడు వస్తాడని, స్వయంగా బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేయడంతో అధ్యక్ష పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.

అధ్యక్ష పదవికోసం ప్రధానంగా ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు పోటీ పడుతున్నట్లు కాషాయ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. బీసీ నేత కావడంతో ఈటలకు బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయనే చర్చ పార్టీలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా గెలవడం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేయడం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం పార్టీలకతీతంగా విస్తృత పరిచయాలు ఉండడం జాతీయ నాయకత్వంతో, ముఖ్యంగా అమిత్ షా అండదండలు కూడా ఈటల రాజేందర్‌కు కలిసివచ్చే అంశాలని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా అధ్యక్ష రేస్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈటలకు కాకుండా బీసీ సామాజిక వర్గంలో మరో నేతకు ఇవ్వాలనుకుంటే ధర్మపురి అరవింద్‌కు అధ్యక్ష బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

డీకే అరుణ సైతం బీజేపీ అధ్యక్షరాలు రేసులో ఉన్నారనే చర్చ నడుస్తుంది. తాజాగా మహబూబ్‌నగర్ ఎంపీగా డీకే అరుణ ఘన విజయం సాధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో డీకే అరుణ విజయం సాధించటంతో ఆమెకు కేంద్రమంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ కేంద్ర మంత్రివర్గంలో ఆమెకు స్థానం కల్పించలేదు. దీంతో మహిళా కోట కింద ఆమె అధ్యక్ష రేస్‌లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయనే ప్రచారం జరగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో రఘనందనరావు బీజేపీ హైకమాండ్ దృష్టిలో పడ్డారు. తాజాగా మెదక్ నుంచి రఘనందనరావు ఎంపీగా గెలుపొందారు‌. ఈనేపధ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఆయన పేరును కూడా పరిశీలించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

ప్రధానంగా బీజేపీ అధ్యక్ష రేస్‌లో ఈటల రాజేందర్, డీకే అరుణ నిలిచే అవకాశాలు ఎక్కవగా కనిపిస్తున్నాయని కాషాయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ ఇద్దరు నేతలు గతంలో రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండడం కేంద్ర మంత్రివర్గంలో ఈ నేతలకు స్థానం దక్కకపోవడంతో ఇద్దరు నేతల్లో ఒకరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని బలంగా వినిపిస్తోంది. మరి కొత్త అధ్యక్షులుగా డీకే అరుణ కాబోతుందా..? ఈటెల రాజేందర్ అవుతారా వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories