టీ-కాంగ్రెస్‌ నేతలపై కన్నేసిన కమలం పార్టీ

BJP Focus on T Congress Leaders
x

టీ-కాంగ్రెస్‌ నేతలపై కన్నేసిన కమలం పార్టీ 

Highlights

*అసంతృప్త నేతలకు గాలం వేస్తున్న బీజేపీ పెద్దలు

BJP: తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి పంచాయితీని కమలం పార్టీ క్యాష్ చేసుకుంటోంది. హస్తం పార్టీలోని అంతర్గత పోరును తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఢిల్లీలో ఉన్న బీజేపీ అగ్ర నాయకత్వం ఆదేశాల మేరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ వంటి సీనియర్లు రంగంలోకి దిగి ఆపరేషన్ ఆకర్ష్‌కు పదునుపెడుతున్నారు. కాంగ్రెస్‌లో రేవంత్‌ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారిపైనే బీజేపీ ప్రధానంగా ఫోకస్ పెడుతూ వారిని పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అలా అసంతృప్తితో రగిలిపోతున్న ఓ ఐదుగురు నేతలతో బీజేపీ మంతనాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నగర శివార్లలో రహస్య ప్రదేశాల్లో వారితో ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ సీనియర్ సీనియర్ నేతలు ఢంకా భజాయించి మరీ చెప్తున్నారు. రాష్ట్రంలోనే కాదు ఢిల్లీలోనూ కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని అందుకే పార్టీలోకి రావాలని కాంగ్రెస్ సీనియర్లకు వివరిస్తూ వారిని పార్టీలో చేరేలా కీలక చర్చలు జరుపుతున్నారు. బీజేపీలోకి వస్తే మంచి భవిష్యత్ ఉంటుందని వారికి రాష్ట్ర పార్టీ చీఫ్ బండి సంజయ్ వివరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరడంతో ఆపార్టీ తరపున ఎవరు నిలబడి గెలిచినా తిరిగి బీఆర్ఎస్‌లో చేరతారన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయిందని బీజేపీ నేతలు చెప్తున్నారు. డీకే అరుణ కూడా ఇద్దరు కాంగ్రెస్ సీనియర్లతో చర్చలు జరిపినట్లు తెర వెనుక ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒకరు దక్షిణ తెలంగాణకు చెందిన వారుకాగా మరొకరు ఉత్తర తెలంగాణకు చెందిన నేతని చెబుతున్నారు. అయితే బీజేపీ ప్రతిపాదనలపై ఆలోచించుకొని చెప్తామని కాంగ్రెస్‌లో ఉన్న అసంతృప్త నేతలు చెప్పినట్లు సమాచారం.

తెలంగాణలో ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా గెలుపు గుర్రాలను సిద్ధంచేసే పనిలో కమలనాథులు ఉన్నారు. బలమైన నేతలు పార్టీలో చేరితే ఎమ్మెల్యేలుగా పోటీచేసే అభ్యర్థులను గుర్తించడం సులభంగా ఉంటుందని ఆ మేరకు కసరత్తును వేగవంతం చేయాలని ఢిల్లీ పెద్దలు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేలుగా గెలిచే సత్తా ఉన్న నేతలనే పార్టీలోకి తీసుకోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో అలాంటి వారిపైనే బీజేపీ ఫోకస్ పెట్టింది. పీసీసీ చీఫ్ రేవంత్‌పై ధ్వజమెత్తిన సీనియర్లలో కొందరిని బీజేపీలో చేర్చుకోవాలన్న పట్టుదలతో రాష్ట్ర నాయకత్వం స్కెచ్‌లు వేస్తోంది. అయితే కొంతమంది లీడర్లు బీఆర్ఎస్‌లో చేరతారన్న విషయం తెలిసి వారిని బీజేపీలో చేర్చుకునేందుకు బండి సంజయ్ పావులు కదుపుతున్నారట. ఇదే విషయాన్ని ఢిల్లీకి వెళ్లి కూడా పార్టీ పెద్దలకు వివరించేందుకు బండి సంజయ్ సిద్ధమైనట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories