Tsrtc Strike : జేఏసీ పిలుపు.. రాష్ట్ర వ్యాప్తంగా బైక్‌ ర్యాలీలు

Tsrtc Strike : జేఏసీ పిలుపు.. రాష్ట్ర వ్యాప్తంగా  బైక్‌ ర్యాలీలు
x
Highlights

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 42వ రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుండి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు...

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 42వ రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుండి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ప్రజలకు కలిగే ఇబ్బందులను వివరించనున్నారు. రేపటి నుండి ఇందిరా పార్క్‌ దగ్గర జేఏసీ నేతలు నిరాహారదీక్షకు దిగనున్నారు. దీనికి సంబంధించి అనుమతిని కూడా కోరినట్లు వారు తెలిపారు. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయంలో దీక్ష చేస్తామని తెలిపారు. ఈనెల19 న హైదరాబాద్ నుంచి కోదాడ వరకు సడక్ బంద్‌ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అయితే ఈ సాయంత్రం ఆర్టీసీ జేఏసీ నేతలు గవర్నర్‌ కలవనున్నట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ జేఏసీ ఒకమెట్టు దిగి.. ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టింది. ఇక మిగిలిన డిమాండ్లపైన చర్చలు జరపాలని కోరుతున్నారు. జేఏసీ, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ విలీనం ఇప్పట్లో సాధ్యం కాదన్న ఒకేఒక్క కారణాన్ని చూపి.. సమ్మె చేయడమే తప్పు అన్నట్లుగా కోర్టును, ప్రజలను... సర్కార్‌ తప్పుదోవ పట్టిస్తోందని అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. విలీన అంశాన్ని సాకుగా చూపి.. కార్మికుల డిమాండ్లు పరిష్కార సాధ్యం కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

అయితే కార్మికుల ఆత్మహత్యలు జేఏసీని బాధిస్తున్నాయని చెప్పారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి. కనీసం మిగతా డిమాండ్లనైనా పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో విలీనాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టామని, దీనికి కార్మికులు అధైర్యపడవద్దని తెలిపారు. మున్ముందు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయనున్నామని, దీనికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇవాళ్టి నుండి ఈనెల 19 వరకు జేఏసీ చేపట్టే నిరసన కార్యక్రమాలను ప్రకటించామని, దీనికి కార్మికులందరూ కదిలి రావాలని కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories