బాసర ట్రిపుల్ ఐటీ ఆందోళనలతో రాజకీయ వేడి

Basara IIIT Issue Latest Update
x

బాసర ట్రిపుల్ ఐటీ ఆందోళనలతో రాజకీయ వేడి

Highlights

Basara IIIT: విపక్షాలకు అస్త్రంగా మారిన నిరసనలు, సర్కార్ లైట్‌గా తీసుకోవడంతో ఉద్రిక్తత

Basara IIIT: బాసరలోని ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న ఆందోళనలు రాజకీయ రంగును పులుముకుంటున్నాయా...? విపక్షాలకు ఈ ఇష్యూ ఒక అస్త్రంగా మారనుందా...? యూనివర్శిటీ ఇమేజ్ కాస్తా డ్యామేజ్ అవుతుందా... ? ఈ వ్యవహారాన్ని లైట్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడిందా అంటే అవుననే సమాధానం వస్తోంది.

తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా చెప్పుకునే ట్రిపుల్ ఐటీ యునివర్సిటీలో చదువుకునే పేద, మధ్య తరగతి పిల్లలపై సర్కారు నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. చదువుల తల్లి కొలువుదీరిన బాసరలో ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీకి న్యాక్ ఇటీవల 'సీ' గ్రేడు ఇవ్వడం ఇక్కడి నాణ్యతా ప్రమాణాల స్థాయిని ఎత్తి చూపుతోంది. స్వరాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా ఎదురుచూపులే మిగలగా తాజాగా విద్యార్థుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. క్యాంపస్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఇక్కడి విద్యార్థులు అయిదు రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతుండగా సర్కార్ లైట్ గా తీసుకోవడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సిన విద్యాశాఖ మంత్రి సబిత సిల్లీ డిమాండ్లు అంటూ హేళన చేయటం విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సీఎం కేసీఆర్ అసలేం పట్టనట్లు వ్యవహరించటంతో విపక్షాలకు ఇది ఒక అస్త్రంగా మారింది. సంస్థ, సర్కారుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా డ్యామేజీ కాగా.. పరిష్కారంపై కాకుండా పోలీసు పహారా పెంచి అణగదొక్కాలని చూస్తోందని విమర్శలూ వినిపిస్తున్నాయి.

ఐదు రోజులుగా విద్యార్థులు శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేస్తుండగా అన్ని రాజకీయ పార్టీలు వారికి మద్దతుగా నిలిచాయి. సర్కారు స్పందించకపోవటంతో విపక్షాలకు అస్త్రంగా మారింది. ట్రిపుల్ ఐటీ విషయంలో సర్కారు తీరును ఎండగట్టి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడంలో సక్సెస్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వస్తుండగా మధ్యలో అరెస్టు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఐటీ చేరాక అరెస్టు చేశారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా బీజేపీ, కాంగ్రెస్ కీలక నేతలు, నాయకులు, కార్యకర్తలు ముట్టడి చేసే ప్రయత్నం చేయగా అరెస్టు చేశారు.

ఇప్పటికే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బాసరకు రాగా అరెస్టు చేశారు. బాసర విద్యార్థులకు ట్విట్టర్ ద్వారా రాహుల్ గాంధీ మద్దతు తెలుపగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. గవర్నర్ తమిళిసై విద్యార్థుల సమస్యలను సర్కారుకు పంపిస్తామని ట్విట్టర్లో పేర్కొన్నారు. బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని అయిదు రోజులుగా నిరసన చేస్తుండగా సీఎం కేసీఆర్ రావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేయటం, విపక్షాల మద్దతు లభించటం, విద్యార్థి సంఘాల ఆందోళనతో సర్కారుతో పాటు సంస్థ ఇమేజీకి భారీగా డ్యామేజీ జరుగుతోందనే టాక్ నడుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories