అందుకే బండి కోపంతో ఊగిపోతున్నారా?

Bandi Sanjay Question is Why Senior‌ Leaders are Not Responding | TS News
x

కమలం నేతల వైఖరిని సంజయ్‌ తప్పుపట్టారా?

Highlights

*కౌంటర్లు ఇచ్చే కమలం నేతలే లేరా అంటూ సంజయ్‌ అసహనం

Telangana BJP: ఎప్పుడు కూల్‌గా కనిపించే బీజేపీ సారథికి కోపమొచ్చిందట. అధికార పార్టీపై చిర్రుబుర్రులాడే ఆయన సొంత పార్టీ నేతలపై ఊగిపోతున్నారట. కేసీఆర్‌ సర్కార్‌ వైఖరిపై తానొక్కడినే పోరాడుతుంటే, కౌంటర్లు ఇవ్వడానికైనా కనీసం ముందుకు రావడం లేదని కమలనాథులపై కన్నెర్ర చేస్తున్నారట. ఎందుకు? బండికి ఏమైంది? ఎందుకు కోపంగా ఉన్నారు? ఎవరిపై కన్నెర్ర చేస్తున్నారు?

తెలంగాణలో ఆరేడు నెలల నుంచి కమలం, కారు పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షుడుగా, సీఎం కేసీఆర్‌ కుటుంబాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. ఏకిపారేస్తుంటే, గులాబీ నేతలు గుంపుగా వచ్చి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆధారాలుంటే చూపించండంటూ బండికి సవాల్‌ విసురుతున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒక్కో రోజు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగట్టి బండిపై ఎదురు దాడి చేస్తున్నారు. కానీ కమలం క్యాంప్‌ నుంచి ఆ స్థాయిలో రియాక్షన్ రావడం లేదట. అందుకే బండికి పిచ్చ కోపం వచ్చిందట. ఇంత జరుగుతుంటే, పార్టీ, పార్టీ పెద్దలను టార్గెట్‌ చేస్తూ గులాబీ టీమ్‌ రెచ్చిపోతుంటే ఎందుకు మౌనంగా ఉండటం సరికాదంటూ సదరు నేతల వైఖరిని సంజయ్ తప్పుబట్టారట.

తాజాగా, ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో సీఎం కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ ఆరోపణలు గుప్పించారు. దీంతో వెంటనే గులాబీ క్యాంప్‌ అలెర్ట్‌ అయింది. ప్రధాని హైదరాబాద్‌ నుంచి వెళ్లకముందే మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అదేరోజు రాత్రి వరకు మంత్రి హరీష్‌రావు కూడా స్పందించారు. మరుసటి రోజు దాదాపు మంత్రులందరూ స్పందించారు. ప్రధాని మోడీని, అదే సమయంలో బీజేపీని తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టారు. ఇంతజరిగినా కమలం క్యాంప్‌ నుంచి రెండు రోజులు వరకు టీఆర్ఎస్ ఆరోపణలకు కౌంటర్ రాలేదు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముందుకొచ్చి మాట్లాడే వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా కమలం నేతలు కౌంటర్ ఇవ్వలేకపోయారు. దీన్నే బండి సంజయ్ జీర్ణించుకోలేకపోతున్నారట.

కమలం పార్టీలో చాలా మంది మంచి మాటకారులే ఉన్నారు. రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్న వారూ ఉన్నారు. అయినా ఎందుకు స్పందించలేదని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కరీంనగర్‌ ఏక్తా యాత్ర సందర్బంగా చేసిన కామెంట్స్‌కు గులాబీ క్యాంప్‌ గట్టి కౌంటర్లే వచ్చినా కమలం నేతల నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడం సంజయ్‌కి కోపం తెచ్చిందట. పార్టీలో అధికార ప్రతినిధులు సీనియర్లు స్పందించకుంటే కేవలం తాను, కిషన్‌రెడ్డి, అర్వింద్‌లే స్పందించాలా.? అంటూ సంజయ్ నేతలను ప్రశ్నించినట్టు తెలిసింది. తనపై వచ్చిన కాంమెట్స్‌కు రియాక్షన్ ఇవ్వకున్నా పర్వాలేదు కానీ దేశ ప్రధానిపై అంతటి ఆరోపణలు చేస్తే స్పందించుకుంటే ఎలా అంటూ గట్టిగానే మందలించారట. ఇలా అయితే, తెలంగాణ పార్టీలో ఉందా? లేదా? అన్న ప్రశ్న వస్తుందని, క్యాడర్‌కు, ప్రజలకు మనమేం సమాధానం చెబుతామని బండి అడిగినట్టు సమాచారం.

అయితే, సీనియర్‌ నాయకులు కూడా సైలెంట్‌గా ఉండటం వెనుక రీజన్‌ వేరే ఉందన్న టాక్‌ ఉందట. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కానీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నుంచి గానీ ఏదో ఒక రియాక్షన్‌ వచ్చే వరకూ ఎవరూ మాట్లాడొద్దని పార్టీలో ఎప్పడు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ లీడర్లకు డైరెక్షన్‌ ఇచ్చే ఓ నేత వల్లే ఎవ్వరూ ముందుకు రాలేదన్న చర్చ జరుగుతోంది. అలాంటప్పుడు ఆ నేతకు క్లాస్‌ తీసుకోవడం మానేసి సంబంధం లేని తమను టార్గెట్‌ చేస్తూ మాట్లాడటంపై మిగిలిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారట. అధికార ప్రతినిధుల మౌనంగా కూడా ఇదే కారణమన్న టాక్‌ వినిపిస్తోంది. మరి, సారథి సంజయ్‌ ఇకనైనా ఈ అంశాన్ని గుర్తించి సదరు నేతకు క్లాస్ తీసుకుంటారో లేదో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories