ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఏపీ నుంచి చేరికలు

AP Leaders Joining BRS Party Today
x

ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఏపీ నుంచి చేరికలు

Highlights

*కేసీఆర్ సమక్షంలో నేడు భారీగా చేరికలు

Telangana: కొత్త ఏడాదిలో BRS పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలో కార్యకలాపాలు మొదటు పెట్టాలని గులాబీ బాస్ యోచిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో BRS పార్టీ విస్తరణకు వేగంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా నేడు ఏపీకి చెందిన పలువురు కీలక నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇందులో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, రిటైర్డ్ IAS తోట చంద్రశేఖర్, మాజీ IRS పార్థసారధి ఉన్నారు. వీరంతా ఇవాళ సాయంత్రం కేసీఆర్ సమక్షంలో BRS తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో తెలంగాణ రాజకీయాలు ముడిపడి ఉండటంతో ఇప్పుడు ఏపీకి చెందిన కొందరు నేతలు కేసీఆర్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇందుకు వైకుంఠ ఏకాదశి మంచి రోజు కావడంతో గులాబీ పార్టీలో చేరాలని నిర్ణయించారు. ఇక ఆ నేతల చేరిక తర్వత ఏపీలో కేసీఆర్ పర్యటనకు ముహూర్తం ఖరారుకానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చేరికల ద్వారా ఏపీలో కేసీఆర్ టార్గెట్ ఏంటనేది త్వరలోనే స్పష్టత రానుంది.

మాజీ IAS అధికారి అయిన తోట చంద్రశేఖర్ గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయన సుమారు 28 వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. జనసేన పార్టీలో రాజకీయ వ్యవహార కమిటీ సభ్యుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక స్థానంలో పనిచేశారు.

మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు కూడా BRSలో చేరనున్నారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రావెల.. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. 2017లో మంత్రివర్గ విస్తరణలో పదవి పోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. కొద్ది నెలల క్రితం ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం కేసీఆర్ నాయకత్వంలోని BRSలో ఏపీలో బాధ్యతల స్వీకరణకు సిద్దమయ్యారు.

ఇక మాజీ IRS అధికారి పార్థసారథి BRS కండువా కప్పుకోనున్నారు. పార్థసారథి గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వీరితో పాటుగా మరో ముగ్గురు గతంలో జనసేనలో పని చేసిన వారు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. వీరి అనుచర వర్గం కూడా పార్టీలో చేరేందుకు సిద్ధమైంది. ఈ పరిణామాలను చూస్తుంటే టీడీపీ, జనసేన మాజీ నేతలపైన BRS గురి పెట్టినట్లు స్పష్టం అవుతోంది. అయితే, రాయలసీమకు చెందిన ఒక కీలక నేత కుటుంబం కూడా కేసీఆర్‌‌తో టచ్‌లోకి వెళ్లినట్లు చర్చ జరుగుతోంది.

మొత్తానికి BRS ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎవరవుతారనే అంశంపై కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏపీకి చెందిన మరికొందరి చేరికలు ఉంటాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. BRS పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారనే విషయంలో రకరకాల సమీకరణలు వినిపించాయి. ముఖ్యంగా ఇందులో కులాల లెక్కలూ ప్రధానం అంటున్నారు. అయితే, ఏపీలో ఒక అధిక సంఖ్యాక వర్గాన్ని ఆకర్షించాలనే లక్ష్యంతో BRS ఉందని.. అందుకే ఆ వర్గం నేతకే పార్టీ అధ్యక్ష బాధ్యతలు కేటాయించాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో BRS ఏపీ అధ్యక్షుడిని కేసీఆర్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories