వరదల్లో గల్లంతైన కారు..ఐదు రోజుల తరువాత బయటికి

వరదల్లో గల్లంతైన కారు..ఐదు రోజుల తరువాత బయటికి
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల క్రితంవరకు అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎన్నడూ లేనంతగా...

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల క్రితంవరకు అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురిసాయి. దీంతో నగరమంతా సముద్రాన్ని తలపిస్తుంది. అంతే కాక కొంత మంది ప్రజలు వరద నీటిలో కొట్టుకుపోయారు. ఇదే క్రమంలో సంగారెడ్డి జిల్లాలోనూ 5 రోజుల క్రితం వరద నీటిలో కారుతో సహా ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. కాగా అతని మృతదేహం ఈ రోజు లభ్యమైంది. కాగా కారులో కొట్టుకుపోయిన వ్యక్తిని పోలీసులు ఆనంద్ గా (30) గుర్తించారు. ఈ నెల 13వ తేదీన అమీన్‌పూర్ కాజ్ వే మీదుగా ఇంటికి వెళ్తున్న ఆనంద్ వరద తాకిడిలో చిక్కుకుపోయారు. వరద తాకిడి ఎక్కువ కావడంతో కారుతో పాటు అతను కూడా కొట్టుకుపోయాడు. వరదలో చిక్కుకుపోవడానికి ముందే ఆనంద్ తన సోదరుడికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అంతేకాకుండా తాను ఉన్న ప్రాంతాన్ని ఫోన్ ద్వారా లోకేషన్‌ను సైతం షేర్ చేశాడు.

ఈ విషయాన్ని ఆనంద్ సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ బృందాలు ఈ నెల 14వ తేదీ నుంచి ఆనంద్ కోసం విడివిడిగా గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా నాలుగు రోజుల తరువాత ఆనంద్ కారు అమీన్‌పూర్ ఇసుకబావి మురుగు కాలువలో ఉండిపోయినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం కొట్టుకుపోయిన కారును ఆదివారం నాడు కాజ్ వే వరద నీటి నుంచి రెస్క్యూ బృందం క్రేన్లతో బయటికి తీసింది. ఆనంద్ ఆచూకీ కోసం ఐదు రోజులుగా కాజ్ వే వద్దే నిరీక్షించిన అతని కుటుంబ సభ్యులు కారును చూడగానే కన్నీరు మున్నీరుగా విలపించారు. కారులో ఉన్న మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోధించారు. ఈ నెల 16వ తేదీన ఆనంద్ కుమార్తె పుట్టిన రోజు. అంతేకాక, అతని భార్య ఐదు నెలల గర్భిణి. మృతదేహంతో పాటు కారును వాగులో దిగి వెలికితీసేందుకు కాకినాడ నుంచి ఓ బృందం ప్రత్యేకంగా వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories