కాంగ్రెస్‌లో కాక రేపుతున్న 10 మంది ఎమ్మెల్యేల భేటీ

కాంగ్రెస్‌లో కాక రేపుతున్న 10 మంది ఎమ్మెల్యేల భేటీ
x
Highlights

Telangana Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ కలకలం రేపుతోంది. విషయం తెలిసిన వెంటనే హస్తం పార్టీ అలర్ట్ అయింది. దీనిపై...

Telangana Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ కలకలం రేపుతోంది. విషయం తెలిసిన వెంటనే హస్తం పార్టీ అలర్ట్ అయింది. దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని దీపాదాస్ మున్షి ఎమ్మెల్యేలను కోరారు. మరో వైపు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ పది మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేశారు. ఎమ్మెల్యేల భేటీపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా మంత్రులతో చర్చించారు. అసలు ఎమ్మెల్యేలు రహస్యంగా ఎందుకు భేటీ అయ్యారు? దీని వెనుక ఎజెండా ఏంటి? మంత్రులపై అసంతృప్తా? హస్తం పార్టీ అధిష్టానం ఈ భేటీని ఎలా చూస్తోంది? నష్టనివారణకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందనేది ఈ ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.

అసలు ఏం జరిగింది?

హైదరాబాద్ లోని ఓ హోటల్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారనే ప్రచారం సాగుతోంది. ఈ సమావేశంలో వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారని చెబుతున్నారు. నాయిని రాజేందర్ రెడ్డి, భూపతి రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మురళీ నాయక్, కూచకుళ్ల రాజేశ్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, లక్ష్మీకాంతారావు, దొంతి మాధవ రెడ్డి, బీర్ల అయిలయ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారని ప్రచారం సాగింది.

అయితే ఈ ప్రచారాన్ని కొందరు ఎమ్మెల్యేలు ఖండించారు. సమావేశంలో పాల్గొనాలని తమకు సమాచారం వచ్చిందని వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చెప్పారు. తాను ఈ సమావేశంలో పాల్గొనలేదని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మీడియాకు తెలిపారు. సమావేశంలో పాల్గొనకున్నా తన పేరును రాయడంపై ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతా రావు కూడా ఈ సమావేశంలో పాల్గొనలేదని వివరణ ఇచ్చారు.

తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ది పనులు జరగడం లేదని... మంత్రుల నియోజకవర్గాల్లోనే పనులు అవుతున్నాయనేది ఎమ్మెల్యేల ఆరోపణ. తమ నియోజకవర్గాల్లో పనులు మంజూరు చేయాలని సీఎంతో పాటు మంత్రులపై ఒత్తిడి చేయాలనేది ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు.

ప్రధానంగా రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఈ సమావేశం జరిగిందనే ప్రచారం కూడా ఉంది. పొంగులేటితో పాటు ఇతర మంత్రులు కూడా ఇదే రకమైన వైఖరిని అవలంబిస్తున్నారని ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అభిప్రాయంతో ఉన్నారని చెబుతున్నారు. కొందరు బీఆర్ఎస్ నాయకులకు పనులు అవుతున్నాయి. కానీ, తమకు మాత్రం పనులు కావడం లేదని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.

ఆ మీటింగ్ కు అటెండైంది ఎనిమిది మందే...

ఎమ్మెల్యేల సమావేశంతో కాంగ్రెస్ పార్టీ అలెర్ట్ అయింది. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారనే దానిపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆరా తీసింది. ఈ మీటింగ్ పై నాగర్ కర్నూల్ ఎంపీ ఫిబ్రవరి 1న దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఒక ఎమ్మెల్యే విందు ఇస్తే మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ మీటింగ్ ను సీఎంకు వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా జరిగిన భేటీగా బీఆర్ఎస్ చిత్రీకరించే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఏమన్నారంటే?

ఎమ్మెల్యేల సమావేశం కరెక్టేనని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పారు. తమ మీటింగ్ రహస్యం కాదన్నారు. నియోజకవర్గాల్లో డెవలప్‌మెంట్ కోసం మాట్లాడుకోవద్దా? అని ఆయన ప్రశ్నించారు. తాను రెవిన్యూ మంత్రి వద్దకు ఏ ఫైల్ ను తీసుకెళ్లలేదని అనిరుధ్ రెడ్డి వివరణ ఇచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పరోక్షంగా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిపై విమర్శలు చేశారు. తన క్యారెక్టర్ ను తప్పుగా చూపిస్తే ఊరుకొనేది లేదన్నారు. ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డితోనే అన్ని విషయాలను చెబుతామన్నారు.

మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ

హైదరాబాద్ హోటల్ లో ఎమ్మెల్యేల భేటీపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే యాక్షన్ లోకి దిగారు. ఫిబ్రవరి 1న కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో సమావేశమయ్యారు. ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో మంత్రులకు గ్యాప్ ఉన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ గ్యాప్ ను పూడ్చుకోవాలని రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. జిల్లాల్లో పర్యటనల సమయంలో ఎమ్మెల్యేలు, ప్రజా సమస్యలపై ఫోకస్ చేయాలని సీఎం ఆదేశించారు.

ఎమ్మెల్యేల మీటింగ్ పై దీపాదాస్ మున్షి ఆరా

ఎమ్మెల్యేల భేటీపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షి ఆరా తీశారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డితో ఆమె ఫోన్ లో వివరాలు తెలుసుకున్నారు. దీపాదాస్ మున్షి సూచనతో సమావేశమైన ఎమ్మెల్యేలతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫోన్ చేశారు. మీ సమస్యలు పరిష్కరిస్తామని మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి లేదా సీఎం దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి దీపాదాస్ మున్షి ఫోన్ చేశారు. ఎమ్మెల్యేల సమావేశం గురించి మీడియాతో మాట్లాడవద్దని కోరారు. ఫిబ్రవరి 5న తాను హైదరాబాద్ కు వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుదామని ఆమె కోరారు.

దీపాదాస్ మున్షి ముందే తమ డిమాండ్లను వినిపించేందుకు అసంతృప్త ఎమ్మెల్యేలు సిద్దమౌతున్నారు. సమావేశం ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది, ఒకరిద్దరు మంత్రుల వ్యవహారశైలి ఎలా ఉందో ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వివరించనున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలను పార్టీ నాయకత్వం ఎలా సంతృప్తి పరుస్తుందో వెయిట్ అండ్ సీ...

Show Full Article
Print Article
Next Story
More Stories