
Anthropic AI Agent: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోటలు బద్ధలవ్వబోతున్నాయ్... జర భద్రం
Anthropic AI Agent: ప్రస్తుతం ప్రపంచ ఐటీ రంగంలో ఒకటే చర్చ... ఒకటే వణుకు. అదే ఆంథ్రోపిక్ (Anthropic).
ప్రస్తుతం ప్రపంచ ఐటీ రంగంలో ఒకటే చర్చ... ఒకటే వణుకు. అదే ఆంథ్రోపిక్ (Anthropic). నిన్నటి వరకు చాట్‌బాట్‌లు కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవి, కానీ నేడు ఆంథ్రోపిక్ విడుదల చేసిన 'AI ఏజెంట్' ఏకంగా మనిషి చేసే పనిని లాగేసుకుంటోంది. ఒక స్టార్టప్ కంపెనీ సృష్టించిన ప్రకంపనలకు ఇండియాలోని టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీల షేర్లు కుప్పకూలుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
2021లో డారియో అమోడీ, డానియెలా అమోడీ అనే సోదరులు స్థాపించిన ఈ కంపెనీ విలువ ఇప్పుడు అక్షరాలా 3.3 లక్షల కోట్ల రూపాయలు. గతంలో వీరు OpenAIలో కీలక బాధ్యతలు నిర్వహించి, బయటకు వచ్చి ఈ సంచలనానికి తెరలేపారు. గూగుల్, అమెజాన్ వంటి టెక్ జెయింట్స్ ఇందులో వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కారణం... దీని వెనుక ఉన్న అపారమైన సాంకేతిక శక్తి. నిజానికి ఇది కేవలం ఒక కంపెనీ కాదు, ఐటీ సామ్రాజ్యాన్ని శాసించే ఒక కొత్త శక్తి. అందుకే నిపుణులు దీన్ని టాప్-10 ఐటీ కంపెనీలతో సమానమని పిలుస్తున్నారు.
ఆంథ్రోపిక్ తాజాగా విడుదల చేసిన Claude 4.5 (AI Agent) సాధారణ సాంకేతికత కాదు. ఇది మనిషి లాగే కంప్యూటర్‌ను ఆపరేట్ చేయగలదు. వెబ్ బ్రౌజింగ్ చేయడం నుండి ఫైల్స్ మేనేజ్ చేయడం వరకు మనిషి ప్రమేయం లేకుండానే చేస్తుంది.ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేయమని చెబితే, అది ప్లాన్ గీస్తుంది, కోడ్ రాస్తుంది, బగ్స్ ఫిక్స్ చేస్తుంది, చివరకు డిప్లాయ్ (విడుదల) కూడా చేస్తుంది. గతంలో పది మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు చేసే పనిని ఇప్పుడు ఈ ఒక్క ఏజెంట్ చిటికెలో పూర్తి చేస్తోంది.
జనవరి 2026లో దావోస్ వేదికగా ఆంథ్రోపిక్ CEO డారియో చేసిన వ్యాఖ్యలు ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రాబోయే 6 నుంచి 12 నెలల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు చేసే ప్రతి పనిని AI చేయగలుగుతుంది. మా కంపెనీలోనే ఇంజనీర్లు కోడ్ రాయడం మానేశారు. AI రాసిన కోడ్‌ను వారు కేవలం ఎడిట్ చేస్తున్నారు అని ఆయన కుండబద్దలు కొట్టారు. దీని అర్థం ఏమిటంటే... భవిష్యత్తులో కంపెనీలకు వేల మంది ఇంజనీర్లు అవసరం లేదు. కేవలం AIని పర్యవేక్షించే కొద్దిమంది 'ఎడిటర్లు' ఉంటే చాలు.
భారత ఐటీ రంగానికి రెడ్ అలర్ట్
ఇండియాలో దాదాపు 50 లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నారు. మన కంపెనీలు ఎక్కువగా అమెరికా క్లయింట్లపై ఆధారపడి పనిచేస్తుంటాయి. ఇప్పుడు ఆ క్లయింట్లు తమ పనులను తక్కువ ఖర్చుతో AI ఏజెంట్లకు అప్పగిస్తే, మన దేశంలోని రొటీన్ కోడింగ్, టెస్టింగ్ ఉద్యోగాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఫిబ్రవరి 4న ఈ టెక్నాలజీ అప్‌డేట్ రాగానే Nifty IT ఇండెక్స్ 7 శాతం పడిపోవడం చూస్తుంటే, మార్కెట్ ఎంతటి ఆందోళనలో ఉందో స్పష్టమవుతోంది. ఇది 2020 కరోనా సంక్షోభం తర్వాత ఐటీ రంగానికి తగిలిన అతిపెద్ద దెబ్బ.
అయితే, ప్రతి నాణేనికి రెండు పార్శ్వాలు ఉంటాయి. కొందరు నిపుణులు దీన్ని సానుకూలంగా కూడా చూస్తున్నారు.కేవలం రొటీన్ పనులు చేసే వారికి ముప్పు పొంచి ఉన్నా, AIని సమర్థవంతంగా వాడగలిగే వారికి కొత్త అవకాశాలు వస్తాయి.సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇకపై కేవలం 'కోడర్లు'గా కాకుండా, సిస్టమ్ డిజైనర్లుగా, AI ఎడిటర్లుగా తమను తాము అప్‌గ్రేడ్ చేసుకోవాలి. స్టార్టప్‌లు, చిన్న కంపెనీలు తక్కువ ఖర్చుతో అద్భుతమైన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను సృష్టించే అవకాశం కలుగుతుంది.
ఆంథ్రోపిక్ తెచ్చిన ఈ మార్పు ఐటీ రంగానికి ఒక టర్నింగ్ పాయింట్. ఇది ఉద్యోగాలను మింగేసే భూతమా లేక ఉత్పాదకతను పెంచే అద్భుతమా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం... మారిన టెక్నాలజీకి అనుగుణంగా మారకపోతే, చరిత్రలో కలిసిపోవడం ఖాయం. ఐటీ ఉద్యోగులు ఇప్పుడు తమ స్కిల్స్‌ను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




