IPL 2023: నేడు ఐపీఎల్‌ ఫైనల్‌ ఫైట్

Today is the Final Fight of IPL 2023
x

IPL 2023: నేడు ఐపీఎల్‌ ఫైనల్‌ ఫైట్ 

Highlights

IPL 2023: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో గుజరాత్‌ టైటాన్స్‌ అమీతుమీ

IPL 2023: రెండు నెలలుగా మండు వేసవిలో క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగించిన ఐపీఎల్‌ మెగా ఈవెంట్‌లో విజేతను తేల్చేందుకు సమయం ఆసన్నమైంది. ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోడీ స్టేడియంలో ఇవాళ ఫైనల్‌ పోరు జరగనుంది. మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో.. డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ అమీతుమీ తేల్చుకోబోతోంది. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో తలపడిన ఈ రెండు జట్లే చివరికి లీగ్‌కు ముగింపు పలుకబోతుండడం ప్రధాన్యత సంతరించుకుంది.

చెన్నై ఇప్పటికే నాలుగు టైటిళ్లు గెలుచుకుంది. మరోసారి విజేతగా ఆవిర్భవిస్తే ముంబై ఇండియన్స్‌తో సమంగా నిలుస్తుంది. ఇక హార్దిక్‌ బృందం ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తొలి ఏడాదే కప్‌ను ఖాతాలో వేసుకుని అబ్బురపరిచింది. ఈసారి కూడా ఆల్‌రౌండ్‌ షోతో అందరికంటే ముందే ప్లేఆఫ్‌లో అడుగుపెట్టింది. ఇప్పుడు వరుసగా రెండో టైటిల్‌ను కూడా గెలవాలనే పట్టుదలతో ఉంది. ధోనీ, హార్దిక్‌లలో ఎవరిది పైచేయి కానుందో మరికొన్ని గంటల్లోనే తేలనుంది.

గతేడాది ఐపీఎల్‌లో ఆడిన పది జట్లలో చెన్నై తొమ్మిదో స్థానంలో నిలిచింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుంది. జడేజాను కెప్టెన్‌గా చేసి దెబ్బతిన్న ఈ జట్టు తమ పొరపాటును సరిదిద్దుకుని ఉవ్వెత్తున ఎగిసింది. గుజరాత్‌పైనే తొలి క్వాలిఫయర్‌లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టిన చెన్నై ఆత్మవిశ్వాసంతో ఉంది. దీనికి తోడు ఓపెనర్లు రుతురాజ్‌, డెవాన్‌ కాన్వే జట్టుకు అతిపెద్ద బలంగా ఉన్నారు.

ఈసారి ఓపెనర్లు రుతురాజ్‌, డెవాన్‌ కాన్వే కలిసి 14 మ్యాచ్‌ల్లో 775 పరుగులు జోడించారు. తొమ్మిదిసార్లు అర్థశతక భాగస్వామ్యాలు నెలకొల్పారు. అందుకే ఫైనల్ ఫైట్‌లోనూ ఈ ద్వయం మరింత దూకుడుగా ఆడాలని జట్టు సభ్యులు ఉన్నారు. మిడిలార్డర్‌లో రహానె, శివమ్‌ దూబే, జడేజాలతో పటిష్ఠంగా కనిపిస్తోంది. ఎంఎస్‌ ఫినిషర్‌ పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నాడు. పవర్‌ప్లే స్పెషలిస్ట్‌ దీపక్‌ చాహర్‌ ఆరంభంలోనే వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు.

బ్యాటింగ్‌, బౌలింగ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుతాలే చేస్తోంది. ఛేదనలో ఇప్పటికే అన్ని జట్లకన్నా ముందుంది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఈ జట్టుకు అతిపెద్ద బలంగా మారాడు. ఇప్పటికే ఇక్కడ ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేసి మరో మ్యాచ్‌లో 94 వరకు వచ్చి ఆగాడు. ఈనేపథ్యంలో గిల్‌పై ఈ కీలక పోరులోనూ టైటాన్స్‌ భారీ ఆశలే పెట్టుకుంది. మరో ఓపెనర్‌ సాహాలో నిలకడ లోపించింది. సాయి సుదర్శన్‌, హార్దిక్‌, విజయ్‌ శంకర్‌, మిల్లర్‌, తెవాటియాలతో బ్యాటింగ్‌ విభాగం బలంగా కనిపిస్తోంది.

ఈ సీజన్లో ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సౌలభ్యాన్ని గుజరాత్‌, చెన్నై జట్లు బాగానే ఉపయోగించుకున్నాయి. వేరే జట్లు అవసరాన్ని బట్టి ఇంపాక్ట్‌ ప్లేయర్లను మారుస్తున్నాయి కానీ.. కొన్ని మ్యాచ్‌లుగా ఈ రెండు జట్లు ఇద్దరినే ఉపయోగించుకున్నాయి. చెన్నై మొదట బ్యాటింగ్‌ చేస్తే దూబెను తుది జట్టులోకి తీసుకుని.. బౌలింగ్‌లో పతిరనను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఉపయోగించుకుంటోంది. మొదట బౌలింగ్‌ చేస్తే పతిరనను తుది జట్టులో ఆడించి.. తర్వాత దూబెను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా తీసుకుంటోంది. గుజరాత్‌ శుభ్‌మన్‌, జోష్‌ లిటిల్‌లను ఇలాగే ఆడిస్తోంది. ఫైనల్లో కూడా రెండు జట్లూ ఇదే కొనసాగించవచ్చు.

ఐపీఎల్‌- 16 విజేత జట్టు 20 కోట్లు నగదు బహుమతిగా పొందనుంది. రన్నరప్‌ జట్టు 13 కోట్లు ఖాతాలో వేసుకుంటుంది. ఈ సారి మొత్తం 46.5 కోట్లను నగదు బహుమతిగా అందజేయనున్నారు. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు వరుసగా 7 కోట్లు, 6.5 కోట్లు దక్కించుకుంటాయి. అత్యధిక పరుగులు చేసే బ్యాటర్‌కు, అత్యధిక వికెట్లు తీసే బౌలర్‌కు 15 లక్షల చొప్పున అందిస్తారు. టోర్నీ వర్థమాన ఆటగాడికి 20 లక్షలు, అత్యంత విలువైన ఆటగాడికి 12 లక్షలు ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories