IND vs SL: వన్డే చరిత్రలో టీమిండియా అతిపెద్ద విజయం

Team India Biggest Win In One Day History
x

IND vs SL: వన్డే చరిత్రలో టీమిండియా అతిపెద్ద విజయం

Highlights

IND vs SL: భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడిన లంకేయులు

IND vs SL: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి 317 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్‌ అవతరించింది. తొలుత భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 22 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. గాయం కారణంగా వాండర్సే బ్యాటింగ్‌కి దిగలేదు. శ్రీలంక బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఫెర్నాండో 19 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు‌. మహమ్మద్‌ సిరాజ్‌ శ్రీలంక పతనంలో కీలకపాత్ర పోషించాడు. షమి, కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా రాణించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ చేసింది.

391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు మహమ్మద్‌ సిరాజ్‌ ఆదిలోనే షాకిచ్చాడు. రెండో ఓవర్లో అవిష్క ఫెర్నాండోని వెనక్కి పంపిన సిరాజ్‌ నాలుగో ఓవర్లో కుశాల్ మెండిస్‌ని ఔట్‌ చేశాడు. షమి వేసిన 6.3 ఓవర్‌కు అసలంక వెనుదిరిగాడు. నువనిదు ఫెర్నాండోని 7.3 ఓవర్‌కు క్లీన్‌బౌల్డ్ చేసిన సిరాజ్‌ కొద్ది సేపటికే హసరంగని ఔట్‌ చేసి నాలుగో వికెట్‌ని ఖాతాలో వేసుకున్నాడు. 12వ ఓవర్‌లో కరుణరత్నెని అద్భుతంగా రనౌట్‌ చేశాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన 15వ ఓవర్లో చివరి బంతికి డాసున్‌ శనక క్లీన్‌ బౌల్డ్ అవ్వగా షమి వేసిన 15.4 బంతికి వెల్లలగె, సూర్యకుమార్‌ యాదవ్‌కి చిక్కాడు. కుల్‌దీప్‌ వేసిన 22వ ఓవర్‌లో చివరి బంతికి లాహిరు కుమార ఔటయ్యాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ 110 బంతుల్లో 166 పరుగులు చేశారు. 13 ఫోర్లు, 8 సిక్స్‌లు చేసి విశ్వరూపం ప్రదర్శించారు. శుబ్‌మన్ గిల్ 97 బంతుల్లో 116 పరుగులు చేశారు. దీంట్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు చేశారు. రోహిత్ శర్మ 42, శ్రేయస్‌ అయ్యర్‌ 38 పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో లహిరు కుమార, కసున్‌ రజిత తలో రెండు వికెట్లు పడగొట్టగా కరుణరత్నె ఒక వికెట్‌ తీశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories