T20 World Cup 2026: పాక్‌ క్రికెటర్లు రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నట్లే.. పీసీబీ యూ-టర్న్ పక్కా: గావస్కర్‌

T20 World Cup 2026: పాక్‌ క్రికెటర్లు రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నట్లే.. పీసీబీ యూ-టర్న్ పక్కా: గావస్కర్‌
x

T20 World Cup 2026: పాక్‌ క్రికెటర్లు రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నట్లే.. పీసీబీ యూ-టర్న్ పక్కా: గావస్కర్‌

Highlights

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న పాకిస్థాన్ నిర్ణయంను టీమిండియా క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఎద్దేవా చేశారు

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న పాకిస్థాన్ నిర్ణయంను టీమిండియా క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ క్రికెట్‌లో నిర్ణయాలను తరచూ మార్చుకునే చరిత్ర ఉందని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా, పాకిస్థాన్‌లోనే మాజీ క్రికెటర్ల నుంచి ఒత్తిడి పెరిగితే.. పాక్ తప్పకుండా యూ-టర్న్ తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రిటైర్మెంట్ ప్రకటించి, ఆ తర్వాత మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే సంప్రదాయం పాక్‌లో ఉందని సన్నీ చురకలంటించారు. షాహిద్ అఫ్రిది, మహమ్మద్ అమిర్, షోయబ్ మాలిక్ వంటి ఆటగాళ్లను గవాస్కర్ పరోక్షంగా అన్నారు.

'ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు మొదలయ్యాక, అలాగే వారి మాజీ ఆటగాళ్ల నుంచి ఒత్తిడి వస్తే.. నాలుగు ఐదు రోజుల్లోనే పాకిస్థాన్ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది' అని సునీల్ గవాస్కర్ స్పష్టం చేశారు. 'నిర్ణయాలను మార్చుకోవడంలో తప్పేమీ లేదు. పాకిస్థాన్ ఆటగాళ్లే దీనికి ఉదాహరణ. పాక్ ప్లేయర్స్ రిటైర్మెంట్ ఇస్తారు. 4-5 రోజులకే అభిమానులు మరలా ఆడమని అంటున్నారని చెప్పి.. తమ రిటైర్మెంట్లను వెనక్కి తీసుకుంటారు. అలాగే ఈ మ్యాచ్ విషయంలో కూడా ఫిబ్రవరి 15కి ముందు ఏదైనా మార్పు జరగొచ్చు' అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ అన్నారు.

భారత్‌తో మ్యాచ్ ఆడకుండా పాకిస్తాన్ తప్పుకుంటే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి కఠిన చర్యలు తప్పవని సునీల్ గవాస్కర్ హెచ్చరించారు. భారత్, పాకిస్థాన్ మధ్య పర్యటనలు సాధ్యం కాకపోవడంతోనే.. ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌ను రూపొందించిందని, అలాంటి పరిస్థితుల్లోనూ ఒక జట్టు ఎంపిక చేసిన మ్యాచ్‌లకే ఆడతామంటే ఐసీసీ బోర్డు తప్పకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. భారత్‌తో మ్యాచ్‌ నుంచి వైదొలగడానికి సరైన కారణాలు, ఆధారాలు చూపించలేకపోతే.. పాక్‌పై ఐసీసీ చర్యలు ఉంటాయని సన్నీ స్పష్టం చేశారు. భారత్–పాకిస్థాన్ జట్లు ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలో లీగ్ దశ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఆదివారం సాయంత్రం పాకిస్థాన్ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడంతో పెద్ద దుమారం రేగింది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ.. పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ఈ నిర్ణయం తీసుకుని ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంపై ఐసీసీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపిన ఐసీసీ.. గ్లోబల్ టోర్నీలో ఒక జట్టు సెలెక్టివ్‌గా ఆడటం క్రీడా ప్రయోజనాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. భారత జట్టు షెడ్యూల్ ప్రకారమే కొలంబోకు వెళ్లి ప్రాక్టీస్ సెషన్లు, ప్రీ-మ్యాచ్ ప్రెస్‌మీట్లో పాల్గొననుందట. మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది రిఫరీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. గతంలో ఆసియా కప్‌లో కూడా పాకిస్థాన్ ఇలాగే యూఏఈతో మ్యాచ్‌ను బహిష్కరించేందుకు ప్రయత్నించి.. చివరకు ఆడాల్సి వచ్చిన ఉదంతాన్ని క్రికెట్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఈసారి పాకిస్థాన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories