Suryakumar Yadav: ప్రతిసారి పిచ్‌ను నిందించలేము.. ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది!

Suryakumar Yadav: ప్రతిసారి పిచ్‌ను నిందించలేము.. ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది!
x
Highlights

Suryakumar Yadav: టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా పసికూన అమెరికాతో జరిగిన మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలో తన అనుభవాలను ఓపెన్‌గా పంచుకున్నాడు.

Suryakumar Yadav: టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా పసికూన అమెరికాతో జరిగిన మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలో తన అనుభవాలను ఓపెన్‌గా పంచుకున్నాడు. 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో తాను ఎంతటి ఒత్తిడిని అనుభవించానో తనకే తెలుసని సూర్య వెల్లడించాడు. అయినప్పటికీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గతంలో బ్యాటింగ్ చేసిన అనుభవం తనకు ఉందని, ముంబై క్రికెట్ మైదానాలు ఆజాద్ మైదాన్, క్రాస్ మైదానాల్లో ఆడిన ఎన్నో మ్యాచ్‌లు తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని చెప్పాడు. చివరి వరకు క్రీజ్‌లో నిలబడితే జట్టుకు మంచి స్కోర్ అందించగలం నమ్మకం తనకు ఉందని సూర్య స్పష్టం చేశాడు. ప్రతిసారి పిచ్‌ను నిందించలేమని, తాము ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిందని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.

'77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో నేను ఎంత ఒత్తిడిని అనుభవించానో నాకే తెలుసు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేసిన అనుభవం నాకు ఉంది, ముంబై మైదానాల్లో (ఆజాద్ మైదానం, క్రాస్ మైదానం) ఆడిన ఎన్నో మ్యాచ్‌లు నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. చివరి వరకు క్రీజ్‌లో నిలబడితే మ్యాచ్‌పై ప్రభావం చూపగలనని నాకు నమ్మకం ఉంది. సాధారణంగా వాంఖడేలో ఉండే వికెట్‌ కంటే ఇది కొంచెం భిన్నంగా ఉంది. ఉదయం లేవగానే సూర్యకాంతి తక్కువగా ఉందని గమనించాము. క్యూరేటర్‌, గ్రౌండ్స్‌మెన్‌ ఉత్తమమైన పిచ్‌ను సిద్ధం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. అయితే కొన్ని అంశాలు వారి నియంత్రణలో ఉండవు. సూర్యకాంతి లేకపోవడం వల్ల పిచ్‌ను సరిగ్గా రోల్ చేయడం, నీరు పెట్టడం కష్టమై ఉండవచ్చు. ప్రతి విషయాన్నీ పిచ్‌పై నెట్టేయలేము. మేము బ్యాటింగ్‌లో ఇంకా మెరుగ్గా ఆడాల్సింది' అని సూర్య చెప్పాడు.

'ఈ మ్యాచ్‌లో చిన్న చిన్న భాగస్వామ్యాలు జట్టు స్కోర్‌ను 160 వరకూ తీసుకెళ్లాయి. ఒకరు లేదా ఇద్దరు చివరి వరకు ఆడటంపై ఆధారపడకుండా.. మరింత స్మార్ట్‌గా బ్యాటింగ్ చేయాల్సింది. అయినా ఇవన్నీ నేర్చుకునే ప్రక్రియలో భాగమే. ఇప్పుడు మేం రిలాక్స్‌అవుతాం. తదుపరి మ్యాచ్‌కు ఇంకా ఐదు రోజులు సమయం ఉంది. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగి వస్తాం. వాషింగ్టన్ సుందర్ ఢిల్లీలో జట్టుతో కలుస్తాడు. అతడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రాకు వాతావరణ మార్పుల వల్ల తీవ్ర జ్వరం వచ్చింది. అబిషేక్‌ కూడా కొంత అస్వస్థతకు గురయ్యాడడు. ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదు' అని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories