Shivam Dube: నేను ఇప్పుడు చాలా ఇంటెలిజెంట్.. శివమ్‌ దూబే ఆసక్తికర వ్యాఖ్యలు!

Shivam Dube: నేను ఇప్పుడు చాలా ఇంటెలిజెంట్.. శివమ్‌ దూబే ఆసక్తికర వ్యాఖ్యలు!
x
Highlights

టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో అత్యధిక స్కోర్ నమోదు చేశాడు.

టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దూబె 31 బంతుల్లో, 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66 పరుగులు చేశాడు. కళ్లు చెదిరే సిక్స్‌లతో అలరించాడు. ఆరంభంలో కొన్ని డాట్‌ బాల్స్‌ ఆడినా.. తర్వాత గేర్‌ మార్చి బౌండరీల మోత మోగించాడు. కళ్లు చెదిరే సిక్స్‌లతో అభిమానులను అలరించాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ఈ ఇన్నింగ్స్ ఆడటం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాడు. పిచ్ పరిస్థితులు అంత సులభంగా లేవని, వికెట్ కఠినంగా ఉండటంతో ప్రారంభంలో ఒత్తిడి ఎదురైందని, అలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం తనకు ఇష్టమని దూబే చెప్పాడు.

'ప్రత్యర్థి ఆఫ్ స్పిన్నర్ బాగా బౌలింగ్ చేశాడు. వరుసగా నాలుగు డాట్ బాల్స్ వేసినా.. నేను ఆందోళన చెందలేదు. తర్వాతి ఓవర్లలో ఆ లోటును పూడ్చగలనని నాకు ముందుగానే తెలుసు. బంతి స్కిడ్ అవుతూ, కొన్నిసార్లు కిందికి కూడా వచ్చింది. ఒక్కో బంతి టర్న్ కూడా అయింది. అలాంటి సమయంలో పెద్ద షాట్లు ఆడే అవకాశం ఉన్నప్పటికీ.. మ్యాచ్ పరిస్థితి మరోలా డిమాండ్ చేశాయి. నాకు సాధారణంగా సిక్సర్లు కొట్టడం ఇష్టం. కానీ బౌలర్ బాగా బౌలింగ్ చేస్తే పరిస్థితికి అనుగుణంగా బౌండరీలు కూడా ఆడాలని ముందే ప్లాన్ చేసుకుంటా. ప్రత్యర్థి బౌలర్లు నాకు షార్ట్ బాల్స్, స్లోవర్స్ ఎక్కువగా వేస్తారని తెలుసు. వాటికి తగిన విధంగా ముందుగానే సిద్ధమయ్యా' అని శివమ్ దూబే చెప్పాడు.

'టీ20 క్రికెట్‌లో డాట్‌ బాల్స్‌ ఆడితే ఎక్కువగా ఒత్తిడికి గురికావాల్సి ఉంటుంది. అయితే ఓ బ్యాటర్‌గా ఎప్పుడు వేగంగా ఆడాలో నాకు తెలుసు. నేను 10 బంతుల్లో కేవలం 2 పరుగులు చేస్తే.. తర్వాత 5 బంతుల్లో నేను రెండు సిక్స్‌లు కొడితే లెక్క సరిపోతుంది. కఠిన పరిస్థితుల్లో ఆడిన ప్రతిసారీ మనం నేర్చుకుంటాం. ఆ అనుభవంతో నేను తెలివిగా మారాను. నాకు ఏ బౌలర్‌ ఎప్పుడు ఏ బంతి వేస్తాడో ముందుగానే పసిగట్టగలుగుతున్నా. స్లో బంతులపై కూడా చాలా ప్రాక్టీస్‌ చేశాను. నేను రోజురోజుకు మెరుగవుతున్నాను. మధ్య ఓవర్లలో నేను క్రీజులోకి వచ్చినప్పుడు స్ట్రైక్‌రేట్‌ ఎక్కువగా ఉండాలని కెప్టెన్, కోచ్ చెప్పారు. అది పూర్తిగా మ్యాచ్ పరిస్థితిపై ఆధారపడుతుంది. మొదట పరిస్థితి దూకుడుగా ఆడేలా లేకపోయినా.. సరైన సమయం వచ్చినప్పుడు వేగం పెంచా. బౌలింగ్ విషయంలో కూడా కష్టపడి పనిచేస్తున్నాన్నా. టీ20లో కొన్నిసార్లు పరుగులు ఇస్తాం, కానీ వికెట్లు కూడా తీస్తాము' అని దూబే తెలిపాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories