Sam Curran: మా ప్రణాళికలు మాకున్నాయి.. అభిషేక్ శర్మను బుట్టలో వేస్తాం!

Sam Curran: మా ప్రణాళికలు మాకున్నాయి.. అభిషేక్ శర్మను బుట్టలో వేస్తాం!
x

Sam Curran: మా ప్రణాళికలు మాకున్నాయి.. అభిషేక్ శర్మను బుట్టలో వేస్తాం!

Highlights

Sam Curran: అభిషేక్ శర్మ దూకుడు తెలిసినా భయం లేదు.. అతన్ని ఔట్ చేయడానికి ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేశామని సామ్ కర్రన్ వ్యాఖ్యలు!

Sam Curran: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం (మార్చి 5) జరిగే టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. గెలిచిన జట్టు ఫైనల్ చేరుకోనుండగా.. ఓడిన టీమ్ ఇంటిదారి పట్టనుంది. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయం. ఈ కీలక నాకౌట్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల సంవత్సరాల్లో ఇరు జట్లు తరచూ తలపడటంతో.. ఒకరి బాలాలు, బలహీనతలు మరొకరికి తెలుసని పేర్కొన్నాడు. అయితే ఓపెనర్ అభిషేక్ శర్మను బుట్టలో వేసేందుకు ఓ ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు చెప్పాడు.

వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు ముందు సామ్ కరణ్ మాట్లాడుతూ... 'ఈ మైదానంలో ఎన్నోసార్లు ఆడాం. ఇక్కడి పరిస్థితులు మాకు కొత్త కాదు. గ్రౌండ్ డైమెన్షన్స్, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అన్ని తెలుసు. ఇండియన్ ఆటగాళ్లతో ఐపీఎల్‌లో కలిసి ఆడటం వల్ల ఒకరికొకరు బాగా తెలుసు. కాబట్టి రేండు టీమ్స్ మధ్య పెద్దగా సీక్రెట్స్ ఉండవు' అని చెప్పాడు. మెగా టోర్నీలో మా ప్రయాణం ఊహించని మలుపులతో సాగింది. కానీ సెమీఫైనల్‌లో మాత్రం పర్ఫెక్ట్ గేమ్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. టీ20లో ఒకరిద్దరు ఆటగాళ్లు బ్యాట్, బాల్‌తో రాణిస్తే మ్యాచ్ పూర్తిగా మారిపోతుంది. గురువారం రాత్రి పర్ఫెక్ట్ గేమ్ ఆడుతామని ఆశిస్తున్నాం' అని తెలిపాడు.

'వాంఖడే స్టేడియం ‘సీ ఆఫ్ బ్లూ’గా మారుతుంది. భారత అభిమానులు భారీ సంఖ్యలో హాజరవుతారు. టీమిండియాకు మద్దతు భారీగా ఉంటుంది. అయితే ఆ సందడి మధ్య ఇంగ్లాండ్ జట్టు ఆటతోనే సమాధానం ఇస్తుంది. ఇది ఐకానిక్ స్టేడియం. గురువారం రాత్రి మాత్రం కొంచెం నిశ్శబ్దంగా ఉంటుందని ఆశిస్తున్నా' అంటూ సామ్ కరణ్ చెప్పాడు. 'భారత్ బలమైన జట్టే. అయితే భయపడే పరిస్థితి లేదు. మా ఆటగాళ్లలో చాలా మంది ఐపీఎల్ ఆడారు. ఇక్కడి పరిస్థితులకు అలవాటు ఉంది. సవాల్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం” అని స్పష్టం చేశాడు. ఈ టోర్నీలో ఉపఖండ జట్లలో భారత్ మాత్రమే సెమీస్‌కి చేరడం గురించి అడిగితే, పరిస్థితులకు త్వరగా అలవాటు పడడమే ప్రధాన కారణమని చెప్పాడు.

చివరిసారి వాంఖడేలో భారత్–ఇంగ్లాండ్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేసి జట్టుకు భారీ విజయం అందించాడు. ఆ ఇన్నింగ్స్ మళ్లీ పునరావృతం కాకూడదని ఆశిస్తున్నానని కరణ్ వ్యాఖ్యానించాడు. ఇది వరుసగా మూడోసారి టీ20 వరల్డ్ కప్‌లో భారత్–ఇంగ్లాండ్ సెమీఫైనల్ కావడం విశేషం. 2022లో అడిలైడ్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించగా, రెండు సంవత్సరాల తర్వాత గయానాలో జరిగిన 2024 ఎడిషన్ సెమీలో భారత్ 78 పరుగుల తేడాతో ప్రతీకారం తీర్చుకుంది. మొత్తానికి రెండు బలమైన జట్ల మధ్య వాంఖడేలో ఉత్కంఠభరిత సెమీఫైనల్‌కు రంగం సిద్ధం అయింది. ఎవరి ‘పర్ఫెక్ట్ గేమ్’ ఫలిస్తుందో గురువారం రాత్రి తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories