Top
logo

క్రికెట్ జెర్సీపై ముదురుతున్న వివాదం..కాషాయరంగులో మతం చూస్తున్న విపక్షం

క్రికెట్ జెర్సీపై ముదురుతున్న వివాదం..కాషాయరంగులో మతం చూస్తున్న విపక్షం
Highlights

కాషాయ రంగు అంటేనే కషాయం మింగినట్లుగా ఉలిక్కి పడుతోంది విపక్షం. కాషాయం రంగు అంటే త్రివర్ణపతాకంలో పై భాగంలో ఉన్న...

కాషాయ రంగు అంటేనే కషాయం మింగినట్లుగా ఉలిక్కి పడుతోంది విపక్షం. కాషాయం రంగు అంటే త్రివర్ణపతాకంలో పై భాగంలో ఉన్న ముక్క గుర్తుకు రాదు. బీజేపీ జెండానే గుర్తుకు వస్తుంది. అందుకే తాజాగా క్రికెట్ జట్టు జెర్సీకి ఆరెంజ్ కలర్ ఎంచుకున్నా విపక్షానికి మాత్రం అందులో కాషాయీకరణనే కనిపిస్తోంది. ఇంతకూ కాషాయం రంగు జెర్సీ ఉంటే తప్పేంటి ? ఆ రంగు జెర్సీ ఉన్నంత మాత్రానా భారతీయ క్రికెట్ కాషాయీకరణ అయినట్లేనా ? లాంటి ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.

బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా కాషాయీకరణపై విమర్శలు పుట్టుకొస్తుంటాయి. నిజానికి ఇలాంటి విమర్శలు కొత్తేమీ కాదు. ఎవరు అధికారంలో ఉంటే వారు తమ విధానాలను సమర్థించే వారిని వివిధ అధికారవ్యవస్థల్లోకి చొప్పిస్తూనే ఉంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో యాంటీ బీజేపీ విధానం అమలైంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాషాయీకరణ విమర్శలు వస్తున్నాయి. ఇన్నాళ్ళుగా విద్య కాషాయికరణ జరిగిందన్న విపక్షం ఇప్పుడు క్రికెట్ కూడా కాషాయమయం అయిపోతున్నదని విమర్శిస్తోంది. మరి వారి విమర్శల్లో నిజం ఉందా ? అదీ చూద్దాం.

బీజేపీ పై విపక్షం గతంలో ఎన్నోసార్లు ఎన్నో రకాల విమర్శలు చేసింది. క్రికెట్ కు సంబంధించి బీజేపీ పై విమర్శలు రావడం మాత్రం ఇదే మొదటిసారి. తాజాగా క్రికెట్ జెర్సీ కూడా విపక్షాలకు ఒక ఆయుధంగా మారింది. అసలు ఈ వివాదం ఎందుకు మొదలైందో చూద్దాం. వరల్డ్ కప్ లో వివిధ జట్లు రకరకాల రంగుల దుస్తులతో ఆడుతున్నాయి. అయితే కొన్ని దేశాల జట్ల జెర్సీ రంగుల మధ్య మాత్రం తేడాలు అతి స్వల్పంగా ఉన్నాయి. ఆ దేశాలు గనుక బరిలోకి దిగితే ఏ ఆటగాడు ఏ దేశపు జట్టు సభ్యుడో గుర్తించడం కష్టమవుతుంది. ఉదాహరణకు బంగ్లాదేశ్, పాకిస్థాన్, సౌతాఫ్రికా గ్రీన్ కలర్ జెర్సీలతో ఉంటాయి. ఈ మూడింటి మధ్య పోటీలు జరిగితే మాత్రం ఆటగాళ్ళను గుర్తించడంలో ఇబ్బందులు ఉంటాయి. అదే విధంగా ఇండియా, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ కూడా. అందుకే అలాంటి సందర్భాలు గనుక వస్తే ఐసీసీ రూలింగ్ ప్రకారం ఆయా జట్లు ప్రత్యామ్నాయ రంగును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు భారత జట్టు ఆరెంజ్ రంగును ఎంచుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 30న ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో ఇండియా జట్టు ఆరెంజ్ జెర్సీ ని ధరించనుంది. నిజంగా జరిగింది ఇదైతే విపక్షాలు మరీ ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీ లాంటివి మాత్రం కోడిగుడ్డుకు ఈకలు పీకే ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత జట్టు ఆరెంజ్ జెర్సీ ధరించడం అంటే క్రికెట్ ను కాషాయీకరించడమేనని సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ విమర్శించారు.

ఐసీసీ వరల్డ్ కప్ 2019కు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఇరవై ఏళ్ళ తరువాత ఈ కప్ తిరిగి ఇంగ్లాండ్ కు వచ్చింది. అంతే కాదు ఈ వరల్డ్ కప్ లోనే ఐసీసీ ప్రతి జట్టుకు కూడా సెకండ్ చాయిస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఐసీసీ ప్రవేశపెట్టిన ఈ సెకండ్ చాయిస్ జెర్సీ విధానంలో ఒకదాన్ని హోమ్ అని, మరో దాన్ని అవే అని వ్యవహరిస్తుంటారు. ఆ మేరకు శ్రీలంక ఎల్లో జెర్సీని ఎంచుకుంది. ఇంగ్లాండ్ పై గెలిచిన నేపథ్యంలో శ్రీలంక ఎల్లో రంగును లక్కీ కలర్ గా భావించింది. మిగిలిన పోటీలకు కూడా తమ సెకండ్ చాయిస్ అయిన లక్కీ ఎల్లో ను వాడుతామని శ్రీలంక ఐసీసీ ని కోరింది. ఈ లక్కీ ఎల్లో రంగు ఇతర దేశాలు వాడుతున్న రంగులకు భిన్నంగానే ఉంది. దాంతో, శ్రీలంక అభ్యర్థనకు ఐసీసీ కూడా అంగీకరించింది. ఈ విధంగా రంగు మార్చుకోవడం శ్రీలంకలో ఎలాంటి వివాదాన్ని సృష్టించలేదు. ఇదే విధమైన సెకండ్ చాయిస్ కింద భారత్ ఆరెంజ్ ను ఎంచుకోవడం మాత్రం పెనువివాదంగా మారిపోయింది. బంగ్లాదేశ్ హోమ్ జెర్సీ లో గ్రీన్ ప్రధానంగా ఉంటుంది. అవే జెర్సీలో రెడ్ ప్రధానంగా ఉంటుంది. ఆప్ఘనిస్థాన్ హోమ్ లో బ్లూ ప్రధానంగా ఉంటుంది. అవే లో చేతుల వద్ద, వెనుక భాగంలో రెడ్ కలర్ ఉంటుంది. సౌతాఫ్రికా హోమ్ జెర్సీలో ఎల్లో ప్రధానంగా ఉంటుంది. అవే లో లేత, ముదురాకు పచ్చ రంగులు ఉంటాయి. శ్రీలంక హోమ్ జెర్సీలో పసుపు, నీలం రంగులు ఉంటాయి. అవే జెర్సీలో మాత్రం పసుపు రంగు ఆధిక్యం కనిపిస్తుంటుంది. ఇదే తరహాలో భారత్ తన సెకండ్ ఛాయిస్ గా ఆరెంజ్ ను ఎంచుకుంది. అదే ఇప్పుడు వివాదంగా మారింది.

ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజీలాండ్ జట్ల జెర్సీలు ఎంతో విభిన్నంగా ఉండడంతో వాటికి మాత్రం సెకండ్ ఛాయిస్ అవసరం లేకపోయింది. మరో వైపున భారత్ ఎంచుకున్న సెకండ్ ఛాయిస్ పై మాత్రం ఇప్పుడు వివాదాలు మొదలయ్యాయి. ఆరెంజ్ జెర్సీ ని వివాదం చేయడం ఎంతవరకు సమంజసం మతం రంగు పులమడం ఎంత వరకు కరెక్ట్ అనేదే ఇప్పుడు కీలకంగా మారింది.

కాషాయం రంగు అనగానే విపక్షం ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. మన దేశ జాతీయ పతాకంలోనూ కాషాయ వర్ణం ఉంది. జెండాలో ఉండే కాషాయం మతానికి ప్రతీక కాదు. ధైర్యానికి, శౌర్యానికి ప్రతీక. క్రికెట్ అంటే పోటీ. అలాంటి పోటీకి శౌర్యానికి ప్రతీక అయిన కాషాయవర్ణాన్ని మించింది మరొకటి లేదు. ఇలా గనుక లెక్కలు వేసుకోవాల్సి వస్తే ఇప్పటి వరకూ వాడుతున్న బ్లూ జెర్సీ ని కూడా వివాదం చేయాల్సి ఉంటుంది. నీలి రంగు ఎన్నో ఏళ్ళుగా బహుజనవాదానికి ప్రతీకగా ఉంటోంది. బీఎస్పీ తరహా భావజాలానికి చెందిన పార్టీలు, సంస్థల వారు నీలిజెండాలను, నీలి రంగు క్యాప్ లను వాడుతుంటారు. అంతమాత్రాన బ్లూ జెర్సీ వేసుకున్న జట్టును బీఎస్పీ టీమ్ గా చెప్పలేం. ప్రతీ అంశాన్ని కూడా వివాదం చేయాలని భావిస్తే వాదనలు, ప్రతివాదనలకే ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. శశి థరూర్ లాంటి కొందరు కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ విషయంలో హుందాగా వ్యవహరించారు. కాషాయవర్ణం మన దేశ జాతీయ పతాకం లోనూ ఉందని ఆ రంగు జెర్సీని భారత జట్టు ధరించడంలో ఎలాంటి తప్పు లేదని వారన్నారు. రంగును బట్టి మతాన్ని లెక్కించడం మొదలుపెడితే కాషాయ వర్ణం, ఆకుపచ్చ రంగులను ఇక మనం మర్చిపోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకూడదనే కోరుకుందాం.

క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచితేనే మంచిది. క్రీడల్లోనూ రాజకీయాలు చేయాలనుకుంటే అది దేశానికి చేటు తీసుకువస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వివిధ వ్యవస్థలను తన భావజాలంతో నింపేయడం సహజం. గతంలో అన్ని పార్టీలు అలా చేశాయి. అలాంటి అవకాశమే ఇప్పుడు బీజేపీకీ లభించింది. వ్యవస్థలను ధ్వంసం చేయవద్దు అని గనుక అన్ని పార్టీలూ భావిస్తే వాటిని మరింత రాజ్యాంగబద్ధం చేసేందుకు, వాటికి మరింత స్వతంత్ర ప్రతిపత్తిని ఇచ్చేందుకు కృషి చేయాలి. అలా గాకుండా క్రికెట్ జట్టు జెర్సీ విషయంలోనూ రాజకీయం చేద్దామనుకుంటే అది చివరకు వెగటు పుట్టించే అంశంగా మారుతుంది. ఏమైతేనేం కాషాయ రంగు జెర్సీ పై వచ్చిన వివాదం మరోసారి జాతీయవాదాన్ని ప్రముఖంగా పైకి తీసుకువచ్చింది.

Next Story

లైవ్ టీవి


Share it