తిరుగులేని ముంబై.. ఐదోసారి ఐపీఎల్ విజేత!!

తిరుగులేని ముంబై.. ఐదోసారి ఐపీఎల్ విజేత!!
x
Highlights

* ఐపీఎల్‌ 13 ఫైనల్లో ముంబై ఘనవిజయం * ఐదోసారి ట్రోఫీని కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్‌ * ఐదోసారి ఐపీఎల్‌ విజేతగా నిలిచిన మంబై ఇండియన్స్‌ * ఢిల్లీపై 5 వికెట్ల తేడాతో నెగ్గిన ముంబై ఇండియన్స్‌ * ఐదోసారి ట్రోఫీని కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్‌ * ముంబై ఇండియన్స్‌ స్కోర్‌: 157/5 * ఢిల్లీ కేపిటల్స్‌ స్కోర్‌: 156/7

పదమూడో సీజన్‌ లీగ్‌ విజేతగా ముంబయి నిలిచింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ముంబయి అయిదో టైటిల్‌ సాధించింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో డిల్లీని అయిదు వికెట్ల తేడాతో చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఢిల్లీ విసిరిన 157 పరుగుల లక్ష్యాన్ని ముంబయి జట్టు మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.

ముంబయి జట్టులో సారథి రోహిత్ శర్మ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ 51 బంతుల్లో 68 పరుగులు చేశాడు. రోహిత్ అవుటైనా సాధించాల్సిన పరుగులు తక్కువగా ఉండడంతో విజయం నల్లేరుపై నడకే అయింది.

కాగా, ఐపీఎల్ లో తొలిసారి ఫైనల్ చేరిన ఢిల్లీ జట్టు టైటిల్ సాధించాలన్న ఆశలపై ముంబయి నీళ్లు చల్లింది. ముంబయి కి ఇది ఐదో ఐపీఎల్ టైటిల్. ముంబయి ఇండియన్స్ ఇంతకుముందు 2013, 2015, 2017, 2019లోనూ ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ లో మరే జట్టు ఇన్ని టైటిళ్లు నెగ్గలేదు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ కి ముంబయి బౌలర్లు షాక్ ఇచ్చారు. ముఖ్యంగా పేసర్లు బౌల్ట్‌, బుమ్రా పదునైన బౌలింగ్‌తో ఆ జట్టును బెంబేలెత్తించారు. తొలి బంతికే వికెట్ల వేట ప్రారంభించిన ముంబై బౌలర్లు ఇన్నింగ్స్‌ తొలి బంతికే స్టాయినిస్‌ను ఔట్‌ చేయడం ద్వారా దిల్లీని ఆత్మరక్షణలో పడేశారు. బౌల్ట్ ఈ వికెట్ తీసుకున్నాడు. తన తర్వాతి ఓవర్లోనే రహానె (2)ను కూడా వెనక్కి పంపాడు. గత మ్యాచ్ లో అదరగొట్టిన శిఖర్‌ ధావన్‌ ను తక్కువ స్కోరుకే బౌల్డ్‌ చేయడం ద్వారా స్పిన్నర్‌ జయంత్‌ యాదవూ ఢిల్లీని గట్టి దెబ్బతీశాడు. కానీ శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ జోడీ పోరాడింది. చక్కని బ్యాటింగ్‌తో, విలువైన భాగస్వామ్యంతో ఢిల్లీ కుప్పకూలే ప్రమాదాన్ని తప్పించి తమ బౌలర్లకు కాస్త పోరాడే స్కోరును అందించింది. మొత్తమ్మీద ఢిల్లీ జట్టు ఏడు వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. నిజానికి ఆ జట్టు మరో ఇరవై పరుగులు చేసే అవకాశం ఉంది. కానీ, చివరి ఓవర్లలో ముంబై బౌలర్లు..ఫీల్డింగ్ ధాటికి పరుగులు రాబట్టడం కష్టంగా మారడంతో ఢిల్లీ ఫర్వాలేదనిపించే స్కోరు చేసింది.

చిన్న లక్ష్యాన్ని చేదించడానికి ఏమాత్రం తడబడలేదు ముంబై. దూకుడుగా ఆడి ఢిల్లీ బౌలర్లపై ఒత్తిడి పెంచింది. ముఖ్యంగా కెప్టెన్‌ రోహిత్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఢిల్లీకి చిన్న అవకాశమైనా లేకుండా చేశాడు. చక్కని షాట్లతో అలరించిన రోహిత్‌.. చకచకా బౌండరీలు బాదేశాడు. డికాక్‌ (20; 12 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి 4 ఓవర్లలోనే 45 పరుగులు రాబట్టి.. మెరుపు ఆరంభాన్నిచ్చిన అతడు ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ (19; 20 బంతుల్లో 1×4, 1×6)తో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ప్రవీణ్‌ దూబె ఓవర్లో రెండు కళ్లు చెదిరే సిక్స్‌లు కొట్టాడు. అయితే చక్కగా ఆడుతున్న సూర్య.. రోహిత్‌ తప్పిదం వల్ల రనౌట్‌ అయ్యాడు. అప్పటికి స్కోరు 90. అయితే మరింత బాధ్యతాయుతంగా ఆడిన రోహిత్‌.. ఇషాన్‌ కిషన్‌తో కలిసి మరో విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. 47 పరుగులు జోడించాక రోహిత్‌ 17వ ఓవర్లో ఔటైనా.. తర్వాత ఇంకో రెండు వికెట్లు పడ్డా ముంబయి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది.

స్కోరు కార్డు:

ఢిల్లీ క్యాపిటల్స్‌:

స్టాయినిస్‌ (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 0; ధావన్‌ (బి) జయంత్‌ 15; రహానె (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 2; శ్రేయస్‌ అయ్యర్‌ నాటౌట్‌ 65; పంత్‌ (సి) హార్దిక్‌ (బి) కౌల్టర్‌నైల్‌ 56; హెట్‌మయర్‌ (సి) కౌల్టర్‌నైల్‌ (బి) బౌల్ట్‌ 5; అక్షర్‌ పటేల్‌ (సి) రాయ్‌ (బి) కౌల్టర్‌నైల్‌ 9; రబాడ రనౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 156;

వికెట్ల పతనం: 1-0, 2-16, 3-22, 4-118, 5-137, 6-149, 7-156; బౌలింగ్‌: 4-0-30-3; బుమ్రా 4-0-28-0; జయంత్‌ యాదవ్‌ 4-0-25-1; కౌల్టర్‌నైల్‌ 4-0-29-2; కృనాల్‌ పాండ్య 3-0-30-0; పొలార్డ్‌ 1-0-13-0

ముంబయి ఇండియన్స్‌‌:

రోహిత్‌శర్మ (సి) లలిత్‌ (బి) నార్జ్‌ 68; డికాక్‌ (సి) పంత్‌ (బి) స్టాయినిస్‌ 20; సూర్యకుమార్‌ రనౌట్‌ 19; ఇషాన్‌ కిషన్‌ నాటౌట్‌ 33; పొలార్డ్‌ (బి) రబాడ 9; హార్దిక్‌ (సి) రహానె (బి) నార్జ్‌ 3; కృనాల్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 157;

వికెట్ల పతనం: 1-45, 2-90, 3-137, 4-147, 5-156; బౌలింగ్‌: అశ్విన్‌ 4-0-28-0; రబాడ 3-0-32-1; నార్జ్‌ 2.4-0-25-2; స్టాయినిస్‌ 2-0-23-1; అక్షర్‌ పటేల్‌ 4-0-16-0; ప్రవీణ్‌ దూబె 3-0-29-0

Show Full Article
Print Article
Next Story
More Stories