MS Dhoni Birthday Special: రన్ ఔట్‌తో మొదలై రన్ ఔట్‌తోనే ముగిసిన ఒక అద్భుత ప్రస్థానం.. ధోనీ బర్త్ డే స్పెషల్

MS Dhoni Birthday Special
x

MS Dhoni Birthday Special: రన్ ఔట్‌తో మొదలై రన్ ఔట్‌తోనే ముగిసిన ఒక అద్భుత ప్రస్థానం.. ధోనీ బర్త్ డే స్పెషల్

Highlights

MS Dhoni Birthday Special: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రపంచ క్రికెట్‌లో అత్యంత గొప్ప కెప్టెన్లలో ఒకరిగా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోని సోమవారం, జులై 7న తన 44వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

MS Dhoni Birthday Special: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రపంచ క్రికెట్‌లో అత్యంత గొప్ప కెప్టెన్లలో ఒకరిగా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోని సోమవారం, జులై 7న తన 44వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 'కెప్టెన్ కూల్' గా, 'థల'గా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న ధోని నాయకత్వంలోనే టీమిండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2007, వన్డే వరల్డ్ కప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013 వంటి మూడు ప్రధాన ఐసీసీ టైటిళ్లను గెలిచి చరిత్ర సృష్టించింది. ధోని క్రికెట్ ప్రస్థానం చాలా కష్టాలతో కూడుకున్నది. విశేషం ఏమిటంటే, ఆయన అంతర్జాతీయ కెరీర్ ప్రారంభం రన్ ఔట్‌తోనే జరిగింది. అలాగే కెరీర్ ముగింపు కూడా రన్ ఔట్‌తోనే అయ్యింది. ఈ అద్భుతమైన ప్రయాణం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

2004లో అరంగేట్రం

మహేంద్ర సింగ్ ధోని తన 18 ఏళ్ళ వయసులో అంటే 1998లో సెంట్రల్ కోల్స్ ఫీల్డ్ లిమిటెడ్ జట్టు తరఫున ఆడేందుకు దేవల్ సహాయ్ తో చర్చలు జరిపారు. దాదాపు ఇదే సమయంలో అప్పటి సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) డీఆర్ఎం అనిమేష్ గంగూలీ ధోనిని రైల్వే జట్టు తరఫున ఆడాలని ఆహ్వానించారు. ధోని బ్యాటింగ్ నైపుణ్యాలు గంగూలీకి బాగా నచ్చడంతో స్పోర్స్ కోటా ద్వారా టీటీఈగా ఆయన రైల్వేలో ఎంపికయ్యారు. రైల్వే జట్టు తరఫున ధోని పలు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో రైల్వే తరఫున ఆయన చూపిన ప్రతిభను గుర్తించిన బీసీసీఐ, ఆయనకు అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడే అవకాశం కల్పించింది.

ధోని అంతర్జాతీయ అరంగేట్రం 2004లో బంగ్లాదేశ్‌పై జరిగింది. అయితే, తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ధోని ఖాతా తెరవకుండానే రన్ అవుట్ అయ్యారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ధోని ప్రారంభం నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, ఆయన త్వరగానే పుంజుకున్నారు. పాకిస్థాన్‌పై జరిగిన వన్డే సిరీస్‌లో 148 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి, టీమిండియా విజయానికి కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత శ్రీలంకపై 183 పరుగులతో నాటౌట్ ఇన్నింగ్స్ ఆడి అభిమానుల మనసులను గెలుచుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఒక విధ్వంసకర వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందారు. అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా అద్భుత బ్యాటింగ్ ప్రదర్శించిన తర్వాత, టీ20 వరల్డ్ కప్ 2007లో టీమిండియాకు కెప్టెన్‌గా నియమితులయ్యారు. ఆయన సారథ్యంలో టీమిండియా ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి కప్‌ను గెలుచుకుంది.

భారత్‌ను వరల్డ్ ఛాంపియన్‌గా నిలబెట్టిన ధోని

మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో టీమిండియా 2011 వన్డే వరల్డ్ కప్‌ను కూడా గెలుచుకుంది. ఫైనల్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ధోని అద్భుతమైన 91 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు విజయాన్ని అందించారు. దీనితో 28 ఏళ్ల తర్వాత భారత్ ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆయన ఛాంపియన్స్ ట్రోఫీ 2013 ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించి టీమిండియాను మరోసారి ఛాంపియన్‌గా నిలిపారు. ధోని సారథ్యంలో టీమిండియా 2010, 2016 ఏషియా కప్ టైటిళ్లను కూడా గెలుచుకుంది.

ఐపీఎల్‌లో సీఎస్‌కేను ఐదు సార్లు గెలిపించిన ధోని!

అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రమే కాకుండా, ధోని తన కెప్టెన్సీతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా అద్భుతాలు సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచారు. ఆయన నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆయన ఆట పట్ల ఉన్న నిబద్ధత మరియు అభిమానుల ప్రేమ వల్లే, ఐపీఎల్ మొదటి సీజన్ నుండి ఇటీవలి 18వ సీజన్ వరకు 42 ఏళ్ల వయసులో కూడా ఆయన నిలకడగా ఆడుతున్నారు.

రన్ ఔట్‌తో ముగిసిన అంతర్జాతీయ కెరీర్

మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ కెరీర్ ఎలా మొదలైందో, అలాగే ముగిసింది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన రన్ అవుట్ అయ్యారు. ఆ మ్యాచ్‌లో ధోని 50 పరుగులు చేసినప్పటికీ, తన జట్టును గెలిపించలేకపోయారు. ఆ తర్వాత 2020 ఆగస్టులో ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన ప్రదర్శన ఎప్పుడూ అద్భుతంగానే ఉంది. ధోనిని ప్రపంచవ్యాప్తంగా అభిమానించేవారు చాలా ఎక్కువ. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లను చూడటానికి చాలా మంది కేవలం ధోని బ్యాటింగ్‌ను చూడాలనే ఉద్దేశ్యంతో వస్తుంటారు.

ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ గణాంకాలు:

టెస్ట్ మ్యాచ్‌లు: 90 టెస్ట్ మ్యాచ్‌లలో, 30.09 సగటుతో 4876 పరుగులు చేశారు. ఇందులో ఆరు సెంచరీలు, 33 అర్థ సెంచరీలు ఉన్నాయి. ధోని అత్యధిక స్కోరు 224 పరుగులు.

వన్డే మ్యాచ్‌లు: 350 వన్డే మ్యాచ్‌లలో, 50.57 సగటుతో 10773 పరుగులు చేశారు.

టీ20 మ్యాచ్‌లు: 98 టీ20 మ్యాచ్‌లలో 1617 పరుగులు చేశారు. టీ20లో ఆయన అత్యధిక స్కోరు 56 పరుగులు.

Show Full Article
Print Article
Next Story
More Stories