Leeds Test: లీడ్స్ టెస్టులో చివరి రోజు ఎవరికి కలిసొస్తుంది.. 126ఏళ్ల రికార్డు ఏం చెబుతోంది ?

Leeds Test
x

Leeds Test: లీడ్స్ టెస్టులో చివరి రోజు ఎవరికి కలిసొస్తుంది.. 126ఏళ్ల రికార్డు ఏం చెబుతోంది ?

Highlights

Leeds Test: లీడ్స్ టెస్ట్‌లో ఇప్పుడు చివరి రోజు వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందా, లేక ఇంగ్లాండ్ గెలుస్తుందా అనేది ఈ రోజు ఆటతోనే తేలిపోనుంది.

Leeds Test: లీడ్స్ టెస్ట్‌లో ఇప్పుడు చివరి రోజు వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందా, లేక ఇంగ్లాండ్ గెలుస్తుందా అనేది ఈ రోజు ఆటతోనే తేలిపోనుంది. భారత్ నిర్దేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. అంటే, ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ చివరి రోజున ఇంగ్లాండ్ 350 పరుగులు చేయాలి. ఇంకా వారి చేతిలో 10 వికెట్లు ఉన్నాయి.

ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారు? ఒకవేళ ఇంగ్లాండ్ ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే, అది వారి సొంత గడ్డపై చేసిన రెండో అతిపెద్ద ఛేజ్ అవుతుంది. అలాగే, లీడ్స్ మైదానంలో కూడా ఇది రెండో అతిపెద్ద ఛేజ్ అవుతుంది. కానీ, ఇంగ్లాండ్‌కు ఇది అంత ఈజీనా అంటే వారి గత రికార్డులు, ప్రస్తుత ఆటతీరుపై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, భారత్ గతంలో ఎలా ఆడింది.. ఇప్పుడు ఎలా ఆడుతుంది అనే దానిపైనా ఆధారపడుతుంది. కాబట్టి, లీడ్స్ టెస్ట్ ఫలితంపై ఒక అంచనాకు రావాలంటే రెండు జట్ల చరిత్ర మీద ఓ లుక్కేయాలి.

టీమిండియా టెస్ట్ క్రికెట్‌లో 350 లేదా అంతకంటే ఎక్కువ పరుగులను డిఫెండ్ చేసినప్పుడు, ఇప్పటివరకు కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఓడిపోయింది. భారత్ ఇప్పటివరకు 59 టెస్టుల్లో 350+ పరుగులను డిఫెండ్ చేయడానికి బరిలోకి దిగింది. ఆ 59 టెస్టుల్లో, 42 మ్యాచ్‌లలో భారత్ గెలిచింది, కేవలం 1 మ్యాచ్‌లోనే ఓటమి పాలైంది. మిగిలిన 16 టెస్టులు డ్రాగా ముగిశాయి.

ఇంగ్లాండ్ ఇప్పుడు బెన్ స్టోక్స్ 'బజ్‌బాల్' స్టైల్‌లో దూకుడుగా ఆడుతోంది. వాళ్ల చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి, చివరి రోజు ఆట మొత్తం ఉంది. దీన్ని బట్టి చూస్తే, ఇంగ్లాండ్ మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలని అనుకోదనిపిస్తోంది. ఒకవేళ వాళ్ళు డ్రా చేయాలని అనుకోకపోతే మ్యాచ్ ఖచ్చితంగా ఒక ఫలితం వైపు వెళ్తుంది. అలా అయితే, భారత్‌కు 350+ పరుగులను డిఫెండ్ చేయడంలో అది 43వ గెలుపు అవుతుంది లేదా రెండో ఓటమి అవుతుంది.

ఇంగ్లాండ్ విషయానికొస్తే, సొంతగడ్డపై ఆడిన గత 6 టెస్టుల్లో, 200 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించిన వాటిలో బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో 5 మ్యాచ్‌లను గెలిచింది. అంటే, కేవలం ఒక మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్ ఓడింది. ఇందులో 2022లో బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో భారత్‌పై 378 పరుగులు ఛేదించిన మ్యాచ్ కూడా ఉంది. ఇది వారి సొంత గడ్డపై చేసిన అతిపెద్ద విజయవంతమైన ఛేజ్. లీడ్స్ మైదానం 126 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే, అక్కడ ఇప్పటివరకు కేవలం 2 సార్లు మాత్రమే 350 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించారు. మొదటిసారి 1948లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌పై 404 పరుగులు ఛేదించింది. రెండవసారి 2019లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాపై 359 పరుగులు ఛేదించింది. ఇప్పుడు ఇంగ్లాండ్ మూడోసారి లీడ్స్ రికార్డు పుస్తకంలో తన పేరును నమోదు చేసుకుంటుందా అనేది చూడాలి.

మొత్తంగా చూస్తే, గెలుపు భారత్ వైపే మొగ్గు చూపుతున్నట్లు అనిపిస్తుంది. కానీ, భారత బౌలింగ్ వైపు దృష్టి మళ్ళీస్తే, ఇంగ్లాండ్ పైచేయి సాధిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే, 2023 నుంచి 2025 వరకు భారత బౌలర్లు SENA (సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో ఆడిన టెస్టుల్లో 3 సార్లు 450 పరుగులకు పైగా ఇచ్చేశారు. ఇదే గణాంకం 2016 నుంచి 2022 మధ్య జీరోగా ఉంది. అంటే, అప్పట్లో భారత బౌలర్లు ఒక్కసారి కూడా 450+ పరుగులు ఇవ్వలేదు. కాబట్టి, లీడ్స్‌లో భారత్ గెలుపు ఓటముల్లో దాని బౌలర్ల పాత్ర చాలా కీలకం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories