Karun Nair: 3146 రోజుల తర్వాత కరుణ్ నాయర్ అద్భుతం.. ఇంగ్లండ్‌పైనే మళ్లీ ఫిఫ్టీ!

Karun Nairs Test Comeback Scores a Fifty After 3146 Days, Against England
x

Karun Nair: 3146 రోజుల తర్వాత కరుణ్ నాయర్ అద్భుతం.. ఇంగ్లండ్‌పైనే మళ్లీ ఫిఫ్టీ!

Highlights

Karun Nair: టెస్ట్ క్రికెట్ నుంచి కనుమరుగైపోయాడనుకున్న కరుణ్ నాయర్, సరిగ్గా 3146 రోజుల తర్వాత మళ్లీ సత్తా చాటాడు.

Karun Nair: టెస్ట్ క్రికెట్ నుంచి కనుమరుగైపోయాడనుకున్న కరుణ్ నాయర్, సరిగ్గా 3146 రోజుల తర్వాత మళ్లీ సత్తా చాటాడు. చివరిసారిగా 2016లో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ కొట్టి రికార్డు సృష్టించిన కరుణ్, ఆ తర్వాత టెస్టుల్లో అంచనాలను అందుకోలేక జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఇంగ్లండ్ జట్టుపై అద్భుతమైన అర్ధసెంచరీ చేసి తనను తక్కువ అంచనా వేసినవారికి గట్టి సమాధానం ఇచ్చాడు.

ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి, భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ విఫలమైనప్పటికీ, కరుణ్ నాయర్ జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టడమే కాకుండా 3146 రోజుల తర్వాత టెస్టుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అతను చివరిసారిగా 2016లో ఇంగ్లండ్‌పైనే ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత టెస్టుల్లో పెద్దగా రాణించకపోవడంతో జట్టు నుంచి తప్పించారు.

ఓవల్ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు, భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి కేవలం 153 పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్‌తో కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు అజేయంగా 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కరుణ్ నాయర్ 52 పరుగులతో, వాషింగ్టన్ సుందర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఓవల్ టెస్ట్ మొదటి రోజు కరుణ్ నాయర్ సాధించిన అర్ధసెంచరీ ఎంతో ప్రత్యేకమైనది. ఈ అర్ధసెంచరీ కోసం అతను 3146 రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. అతను 98 బంతుల్లో 7 ఫోర్లతో 52 పరుగులు చేసి క్రీజులో నిలకడగా ఉన్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 89 బంతుల్లో తన అర్ధసెంచరీని పూర్తి చేశాడు. దీనికి ముందు అతను 2016 డిసెంబర్ 18న చెన్నైలో ఇంగ్లండ్‌పైనే అజేయంగా 303 పరుగుల ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత అతను టెస్టుల్లో రాణించలేక జట్టుకు దూరమయ్యాడు.

భారత జట్టు నుంచి తప్పించిన తర్వాత కూడా కరుణ్ నాయర్ నిరుత్సాహపడకుండా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కొనసాగించాడు. ఇటీవల ఐపీఎల్ 2025లో కూడా అదరగొట్టాడు, దీని ఆధారంగానే 8 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు అతన్ని తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఈ సిరీస్‌లో ఇంతకు ముందు ఆడిన మూడు టెస్టుల్లో పెద్దగా రాణించలేకపోయినా, ఓవల్ పిచ్‌పై కఠిన పరిస్థితుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఫిఫ్టీ సాధించడం విశేషం.

33 ఏళ్ల కరుణ్ నాయర్ ఇప్పటివరకు 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 14 ఇన్నింగ్స్‌లలో అతను 46.41 సగటుతో 557 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. వీటితో పాటు అతను భారత జట్టు తరపున 2 వన్డే మ్యాచ్‌లు ఆడి 46 పరుగులు చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories