Mohammed Shami : మహమ్మద్ షమీ అంతర్జాతీయ కెరీర్‌కు ఎండ్ కార్డ్? కన్నీరు పెట్టుకుంటున్న ఫ్యాన్స్

Mohammed Shami
x

Mohammed Shami : మహమ్మద్ షమీ అంతర్జాతీయ కెరీర్‌కు ఎండ్ కార్డ్? కన్నీరు పెట్టుకుంటున్న ఫ్యాన్స్

Highlights

Mohammed Shami : భారత క్రికెట్ అభిమానులకు ఇదొక చేదు వార్త. టీమిండియా వెటరన్ పేసర్, సెన్సేషనల్ బౌలర్ మహమ్మద్ షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనా? సెలక్టర్లు అతడిని పూర్తిగా పక్కన పెట్టేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

Mohammed Shami: భారత క్రికెట్ అభిమానులకు ఇదొక చేదు వార్త. టీమిండియా వెటరన్ పేసర్, సెన్సేషనల్ బౌలర్ మహమ్మద్ షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనా? సెలక్టర్లు అతడిని పూర్తిగా పక్కన పెట్టేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. శనివారం బీసీసీఐ ప్రకటించిన న్యూజిలాండ్ వన్డే సిరీస్ జట్టులో షమీ పేరు లేకపోవడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. డొమెస్టిక్ క్రికెట్‌లో నిప్పులు చెరుగుతున్నా, వికెట్ల వేట కొనసాగిస్తున్నా షమీని విస్మరించడంపై ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

మహమ్మద్ షమీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బెంగాల్ తరపున ఆడుతూ విజయ్ హజారే ట్రోఫీలో కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 11 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి తన సత్తా ఏంటో చాటాడు. రంజీ ట్రోఫీలోనూ తన పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్ల పని పట్టాడు. ఏ లెజెండరీ ప్లేయర్ కూడా షమీ అంతగా డొమెస్టిక్ క్రికెట్ ఆడి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోలేదు. ఇన్ని చేసినా, 2026లో టీమ్ ఇండియా ఆడే మొదటి వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేయకపోవడం వెనుక పెద్ద రాజకీయమే ఉందని అభిమానులు ఆరోపిస్తున్నారు.





అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇప్పుడు షమీని కాదని హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి యువ బౌలర్లకు అవకాశం ఇచ్చింది. గౌతమ్ గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత జట్టులో భారీ మార్పులు జరుగుతున్నాయని, సీనియర్లను మెల్లమెల్లగా పక్కన పెడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో చివరిసారిగా కనిపించిన షమీ, ఆ టోర్నీలో భారత్ తరపున టాప్ వికెట్ టేకర్ (9 వికెట్లు). ఆ స్థాయి ప్రదర్శన తర్వాత కూడా అతడిని దూరం పెట్టడం అంటే, సెలక్టర్లు షమీని దాటి ముందుకు వెళ్ళిపోయారని స్పష్టమవుతోంది.

జట్టు ప్రకటన వెలువడగానే ఎక్స్‎లో షమీ పేరు మార్మోగిపోయింది. "ఒక లెజెండ్ కెరీర్‌ను ఇలా ముగించడం అన్యాయం" అని ఒక యూజర్ అంటే, "రాజకీయాల వల్ల ఒక గొప్ప బౌలర్ కెరీర్ నాశనమవుతోంది" అని మరొకరు మండిపడ్డారు. షమీ కన్నీరు పెట్టుకుంటున్న ఫోటోలు, స్టేడియంలో అతను చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. షమీ లాంటి నిలకడైన బౌలర్‌ను తప్పించడం వల్ల టీమ్ ఇండియా డెత్ ఓవర్ల బౌలింగ్‌పై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.

భారత క్రికెట్ చరిత్రలో షమీ అత్యంత ప్రభావవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్‌లలో అతని రికార్డులు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాయి. కనీసం ఒక వీడ్కోలు సిరీస్ ఆడే అవకాశం కూడా ఇవ్వకుండా సెలక్టర్లు అతడిని నిర్లక్ష్యం చేయడం ఫ్యాన్స్‌ను బాధిస్తోంది. మరి ఇప్పటికైనా షమీకి తర్వాతి సిరీస్‌లలో అవకాశం దక్కుతుందో లేదో తెలియదు కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం షమీకి టీమ్ ఇండియా తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్టే కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories