IPL 2021: భళా బెంగళూరు..చేజేతులా ఓడిన సన్‌రైజర్స్

Royal Challengers Bangalore Won by 6 Runs
x

IPL 2021 SRH vs RCB:(File Image)

Highlights

IPL 2021: ఐపీఎల్ 14 సీజన్‌లో బెంగళూరు వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

IPL 2021: ఐపీఎల్ 14 సీజన్‌లో బెంగళూరు వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. హైదరాబాద్‌పై బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. 150 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ 20 ఓటర్లలో 9వికెట్లకు 143 పరుగులే చేసింది. ఈ సీజన్‌లో హైదరాబాద్ రెండో ఓటమిని ఖాతాలో వేసుకుంది.

మరోవైపు కీలక సమయాల్లో బెంగళూరు బౌలర్లు రెచ్చిపోయారు. తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 54, మనీశ్ పాండే 38 పోరాటం వృథా అయింది. వీరిద్దరు ఔటైన తర్వాత మ్యాచ్‌ ఒక్కసారిగా బెంగళూరు వెళ్లింది. షాబాజ్‌ అహ్మద్‌ (3/7), సిరాజ్‌ (2/25), హర్షల్‌ పటేల్‌ (2/25) విజృంభించడంతో బుధవారం బెంగళూరు 6 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించింది. గెలుపు ముంగిట సన్‌రైజర్స్‌ అనూహ్యంగా బోల్తా కొట్టింది. మ్యాక్స్‌వెల్‌ (59; 41 బంతుల్లో 5×4, 3×6), కోహ్లి (33; 29 బంతుల్లో 4×4) రాణించడంతో మొదట బెంగళూరు 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. హోల్డర్‌ (3/30), రషీద్‌ ఖాన్‌ (2/18), భువనేశ్వర్‌ (1/30) ఆ జట్టును కట్టడి చేశారు. వార్నర్‌ (54; 37 బంతుల్లో 7×4, 1×6), మనీష్‌ పాండే (38; 39 బంతుల్లో 2×4, 2×6) రాణించడంతో సన్‌రైజర్స్‌ గెలుపు బాటలో పయనించినా.. ఆఖర్లో తడబడింది. 9 వికెట్లకు 143 పరుగులే చేసింది.

అతి కష్టం మీద 149 పరుగులు..

సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 10 ఓవర్లకు బెంగళూరు 63/2పరిస్థితిది. పడిక్కల్‌ (11), షాబాజ్‌ అహ్మద్‌ (14)ను త్వరగా నిష్క్రమించారు. ఓ వైపు కోహ్లి నిలిచినా ధాటిగా ఆడలేకపోయాడు. 4 పరుగుల వ్యవధిలో కోహ్లీని హోల్డర్‌, డివిలియర్స్‌ (1)ను రషీద్‌ ఔట్‌ చేయడంతో 95/4తో బెంగళూరు చిక్కుల్లో పడింది. మ్యాక్స్‌వెల్‌ పోరాడటంతో కష్టం మీద ఆ జట్టు 149 పరుగులు చేసింది.

స్వయంకృతాపరాధమే...

సన్‌రైజర్స్‌ పరాజయానికి కారణం స్వయంకృతాపరాధమే. లక్ష్యం దిశగా సాఫీగా సాగిపోతున్న దశలో అనవసరంగా వికెట్లు పారేసుకుని మూల్యం చెల్లించుకుంది. స్పల్ప లక్ష్య ఛేదనలో 13 పరుగులకే ఓపెనర్‌ సాహా (1)ను కోల్పోయినా కెప్టెన్‌ వార్నర్‌ ధాటిగా ఆడడంతో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ మెరుగ్గానే సాగింది. పేస్‌, స్పిన్‌లో సాధికారికంగా ఆడిన వార్నర్‌ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. పాండే అతడికి మంచి సహకారాన్నిచ్చాడు. మొదట్లో కాస్త బ్యాట్‌ ఝుళిపించిన పాండే.. ఆ తర్వాత సింగిల్స్‌కే పరిమితమైనా సాధించాల్సిన రన్‌రేట్‌ మరీ ఎక్కువేమీ లేకపోవడంతో సన్‌రైజర్స్‌కు ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. 13 ఓవర్లకు స్కోరు 96/1. అయితే తర్వాతి ఓవర్లో వార్నర్‌ను జేమీసన్‌ ఔట్‌ చేయడంతో తిరిగి పోటీలోకి రావడానికి బెంగళూరుకు అవకాశం దక్కింది. అయినా 16 ఓవర్లలో 115/2తో సన్‌రైజర్స్‌ లక్ష్యాన్ని అందుకేలానే కనిపించింది. కానీ బ్యాట్స్‌మెన్‌ నిర్లక్ష్యం ఆ జట్టును దెబ్బతీసింది.

24 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో కాస్త జాగ్రత్త ఆడినా సన్‌రైజర్స్‌ గట్టెక్కేదే. కానీ 17వ ఓవర్లో షాబాజ్‌ అహ్మద్‌.. పాండే, బెయిర్‌స్టో (12; 13 బంతుల్లో 1×4), అబ్దుల్‌ సమద్‌ (0)లను ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఎంతకీ బౌండరీలు రాకపోవడంతో ఎదురు దాడికి దిగాలనుకున్న బెయిర్‌స్టో.. స్లాగ్‌ స్వీప్‌ చేయబోయి వికెట్‌కీపర్‌కు డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఒత్తిడికి లోనైన పాండే.. తర్వాతి బంతికే క్రీజు నుంచి బయటికి వచ్చి భారీ షాట్‌ ఆడబోయి షార్ట్‌ థర్డ్‌మన్‌లో చిక్కాడు. సమద్‌ కూడా అలాగే నిష్క్రమించాడు. తర్వాతి ఓవర్లో ఏడు పరుగులే ఇచ్చిన హర్షల్‌.. విజయ్‌ శంకర్‌ను ఔట్‌ చేశాడు.

చివరి రెండు ఓవర్లలో 27 పరుగులు చేయడం కష్టంగానే కనిపిస్తున్నా.. హోల్డర్‌ క్రీజులో ఉండడంతో సన్‌రైజర్స్‌లో ఏదో ఆశ. కానీ అతడూ నిరాశపరిచాడు. సిరాజ్‌ వేసిన 19వ ఓవర్లో ఔటయ్యాడు. అదే ఓవర్లో రషీద్‌ ఓ సిక్స్‌ కొట్టడం వల్ల చివరి ఓవర్లో సన్‌రైజర్స్‌కు 16 పరుగులు అవసరమయ్యాయి. మూడో బంతికి హర్షల్‌ నోబాల్‌ వేయగా.. దాన్ని రషీద్‌ ఫోర్‌గా మలచడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది. ఎందుకంటే నాలుగు బంతుల్లో సన్‌రైజర్స్‌ చేయాల్సింది ఎనిమిది పరుగులు. అయితే కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన హర్షల్‌.. మిగతా బంతుల్లో రెండు వికెట్లు తీసి ఒక్క పరుగే ఇచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories