Josh Inglis : పెళ్లి కంటే ఐపీఎల్ ముఖ్యం..ఏకంగా హనీమూన్ నే వాయిదా వేసుకున్న ఆస్ట్రేలియా ప్లేయర్

Josh Inglis
x
Highlights

Josh Inglis : ఐపీఎల్ 2026 వేలంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్‎ని సొంతం చేసుకోవడానికి కావ్య మారన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), సంజీవ్ గోయెంకా (లక్నో సూపర్ జెయింట్స్) మధ్య తీవ్రమైన పోటీ జరిగింది.

Josh Inglis: ఐపీఎల్ 2026 వేలంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్‎ని సొంతం చేసుకోవడానికి కావ్య మారన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), సంజీవ్ గోయెంకా (లక్నో సూపర్ జెయింట్స్) మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. ఇంగ్లిస్ తన కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించుకోగా, చివరకు అతనికి దాదాపు ఐదు రెట్లు ఎక్కువ అంటే రూ.8.60 కోట్లు లభించింది. వాస్తవానికి తన పెళ్లి కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో సగానికి పైగా మ్యాచ్‌లకు ఇంగ్లిస్ అందుబాటులో ఉండడని ముందే అంచనా ఉంది. ఈ కారణంగానే పంజాబ్ కింగ్స్ జట్టు అతన్ని విడుదల చేసింది. అయినప్పటికీ వేలంలో ఇంగ్లిస్‌ను దక్కించుకోవడానికి ఎస్ఆర్‌హెచ్ రూ.8.40 కోట్ల వరకు బిడ్ వేయగా, చివరకు లక్నో సూపర్ జెయింట్స్ రూ.8.60 కోట్లకు అతన్ని సొంతం చేసుకుంది.

ఐపీఎల్ 2026 సీజన్‌కు ఇంగ్లిస్ అందుబాటుపై ఉన్న సందిగ్ధతకు తెరదించేలా తాజాగా ఒక ముఖ్యమైన సమాచారం వెలువడింది. ఇంత భారీ మొత్తం దక్కించుకున్న నేపథ్యంలో జోష్ ఇంగ్లిస్ తన హనీమూన్ ప్లాన్‌ను వాయిదా వేసుకుని, ఐపీఎల్ సీజన్‌కు ముందుగానే అందుబాటులో ఉండటానికి సిద్ధమవుతున్నాడు. క్రికబుజ్ నివేదిక ప్రకారం.. ఇంగ్లిస్ ఏప్రిల్ 18న పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే ఐపీఎల్ ఆడటానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లిస్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి కావడం, అలాగే లక్నో సూపర్ జెయింట్స్ కోచ్‌గా జస్టిన్ లాంగర్ ఉండటంతో, లాంగర్ అతన్ని జట్టుతో పూర్తి కాలం ఉండేలా ఒప్పించడానికి నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

జోష్ ఇంగ్లిస్ తన లభ్యత విషయంలో తీసుకున్న ఈ కొత్త నిర్ణయం పట్ల అతని పాత ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పంజాబ్ కింగ్స్‌తో ఉన్నప్పుడు, ఇంగ్లిస్ తన పెళ్లి కారణంగా ఐపీఎల్ సీజన్‌లో ఎక్కువ భాగం అందుబాటులో ఉండనని, మే నెలాఖరులో కేవలం 10-15 రోజులు మాత్రమే జట్టు సేవలు అందిస్తానని చెప్పినట్లు క్రికబుజ్ నివేదిక వెల్లడించింది. అయితే, వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న తర్వాత ఇంగ్లిస్ తన నిర్ణయాన్ని మార్చుకోవడంపై పంజాబ్ కింగ్స్ అసంతృప్తితో ఉంది. మరోవైపు, ఇంగ్లిస్‌ను కొనుగోలు చేయడానికి పోటీపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ మాట్లాడుతూ, ఇంగ్లిస్ అందుబాటులో ఉండకపోవడం అతని వ్యక్తిగత కారణమని, అయితే ఆ నిర్ణయం ఎప్పుడైనా మారవచ్చని వ్యాఖ్యానించడం విశేషం. జోష్ ఇంగ్లిస్ గతేడాది పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసి, 11 మ్యాచ్‌లలో 162 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 278 పరుగులు చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories