
IPL 2026-Chinnaswamy Stadium: ఆర్సీబీ అభిమానులకు శుభవార్త.. చిన్నస్వామిలో లీగ్ మ్యాచ్‌లు సహా ప్లేఆఫ్స్, ఫైనల్!
IPL 2026-Chinnaswamy Stadium: బెంగళూరుకు భారీ గౌరవం.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్, ఫైనల్‌కు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఖరారు!
IPL 2026-Chinnaswamy Stadium: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు శుభవార్త. బెంగళూరులోని చారిత్రాత్మక చిన్నస్వామి స్టేడియం మరలా అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లకు సిద్ధమవుతోంది. ముందుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ తమ హోమ్ మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలోనే ఆడనుంది. లీగ్ దశలో ఐదు మ్యాచ్‌లు ఇక్కడే జరగనున్నాయి. ఈ సీజన్‌లోని ప్లేఆఫ్స్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే నిర్వహించనున్నారు. భారీ స్కోర్లకు వేదికగా నిలిచే చిన్నస్వామి మైదానం మరోసారి ఆర్సీబీకి కంచు కోటలా మారుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఐపీఎల్ 2026 ప్రారంభోత్సవ వేడుక కూడా చిన్నస్వామి స్టేడియంలోనే జరగనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఓపెనింగ్ మ్యాచ్‌తో పాటు ప్రారంభ వేడుక నిర్వహించనుండటంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఐపీఎల్ 2026లోని కీలక మ్యాచులు మొత్తం బెంగళూరులోనే జరగనుండడంతో కర్ణాటక వ్యాప్తంగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఆర్సీబీ తన రెండు లీగ్ మ్యాచ్‌లను రాయ్‌పూర్ వేదికగా ఆడనుంది. 2025లో ఆర్సీబీ విజయోత్సవాల సమయంలో జరిగిన దురదృష్టకర ఘటన తర్వాత చిన్నస్వామిలో జరిగే పెద్ద ఈవెంట్ కావడం విశేషం.
2025లో ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కేసుల అనంతరం స్టేడియంలో క్రికెట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం జస్టిస్ కున్హా కమిటీ సమగ్ర నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో తక్షణ, మధ్యకాల, దీర్ఘకాల భద్రతా చర్యలపై పలు సూచనలు ఇచ్చారు. ఆ సూచనల ఆధారంగా భద్రతా ప్రమాణాలను బలోపేతం చేసి, ప్రేక్షకుల సురక్షిత ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఏర్పాట్లు, అత్యవసర సేవలు, సమన్వయ పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టారు. అనంతరం కర్ణాటక కేబినెట్ స్టేడియంలో మళ్లీ ఐపీఎల్ మ్యాచ్‌లకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 35,000 ప్రేక్షకుల పరిమితితో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
భద్రతా పనులు కొనసాగుతున్న కారణంగా కర్ణాటక-జమ్మూ కశ్మీర్ మధ్య జరగాల్సిన రంజీ ట్రోఫీ ఫైనల్‌ను హుబ్బళ్లికి మార్చారు. ఇప్పుడు అన్ని పనులు పూర్తవడంతో చిన్నస్వామి స్టేడియం మళ్లీ క్రికెట్‌కు సిద్ధమైంది. కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం, పోలీస్ విభాగాలకు ఆర్సీబీ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. సమన్వయం, మార్గదర్శకతతో ఈసారి విజయవంతంగా మ్యాచ్‌లు నిర్వహిస్తామని వెల్లడించింది. లీగ్ దశలో ఐదు మ్యాచ్‌లతో పాటు రెండు మ్యాచ్‌లను షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. ఇది ఆర్సీబీకి రెండో హోమ్ వేదికగా ఉండనుంది. మొత్తానికి చిన్నస్వామి స్టేడియం మళ్లీ క్రికెట్ కేరింతలతో మార్మోగేందుకు సిద్ధమైంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఐపీఎల్ 2026 ఆరంభం కోసం ఎదురుచూస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




