IPL 2020 Updates: దేవదత్‌ పడిక్కల్..ఆరంగేట్రం లోనే అర్ధ సెంచరీ తో అదరగొట్టాడు.

IPL 2020 Updates: దేవదత్‌ పడిక్కల్..ఆరంగేట్రం లోనే అర్ధ సెంచరీ తో అదరగొట్టాడు.
x

Devdutt Padikkal 

Highlights

IPL 2020 Updates: ఇరవయ్యేళ్ళ దేవదత్ పడిక్కల్ ఆర్సీబీలో అడుగుపెడుతూనే అర్ధసెంచరీ చేసి ఆకట్టుకున్నాడు.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు నిన్న సాధించిన విజయంలో ఒక యువ క్రికెటర్ మెరుపులు ప్రధాన కారణం. అదరగొట్టే ఆట తీరుతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించాడు. అతడే కేరళ కుర్రోడు దేవదూత్‌ పడిక్కల్‌. ఆర్సీబీ లో తొలిసారిగా ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు ఈ యువకిశోరం. రావడం రావడమే ఓపెనర్ గా పంపించాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. కోహ్లీ అంచనా ఏమాత్రం తప్పుకాలేదు. కెప్టన్ తనకు అప్పగించిన పనిలో నూరుశాతం విజయం సాధించాడు పడిక్కల్. అంతే కాదు ఆరంగేట్రం లోనే అర్థ సెంచరీ సాధించిన ఆటగాళ్ళ జాబితాలో చేరిపోయాడు దేవదత్ పడిక్కల్. ఆరోన్ ఫించ్ తో కలసి ఆర్సీబీ ఇన్నింగ్స్ ప్రారంభించిన పడిక్కల్ సన్ రైజర్ బౌలర్లకు సవాల్ గా నిలిచాడు. పార్ధీవ్ పటేల్ ను పక్కన పెట్టి మరీ తనకు అవకాశం ఇచ్చిన కోహ్లీ నమ్మకాన్ని నిలబెట్టడమే కాగా ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా హాఫ్ సెంచరీ బాదేయడం అందరినీ ఆకట్టుకుంది.

ఓపెనింగ్ అర్ధ శతకాల స్పెషలిస్ట్..

దేవదూత్ పడిక్కల్.. మామూలోడు కాదు. తాను మొదటి సారి ఏ మ్యాచ్ ఆడినా సరే మినిమం ఫిఫ్టీ గ్యారెంటీ. ఆలేక్కే కోహ్లీ లాజిక్ అయి ఉండొచ్చు. అందుకే ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేసే బాధ్యత అప్పచెప్పాడు. ఇక పడిక్కల్ రికార్డులు.. * ఫస్ట్‌క్లాస్‌ అరంగేట్రంల్లో భాగంగా 2018లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్‌(77 రెండో ఇన్నింగ్స్‌లో) హాఫ్‌ సెంచరీ * లిస్ట్‌-ఏ క్రికెట్‌లో భాగంగా జార్ఖండ్‌తో 2019 జరిగిన మ్యాచ్‌లో 58 పరుగులు బాదేశాడు. * టీ20 ఫార్మాట్‌లో భాగటంగా ఉత్తరాఖాండ్‌తో జరిగిన అరంగేట్రంమ్యాచ్‌లో పడిక్కల్‌ 53 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఆ ఇన్నింగ్సే పడిక్కల్ కు ఐపీఎల్ ఛాన్స్ తీసుకువచ్చింది. ఇక ఐపీఎల్ మొదటి మ్యాచ్ లోనే 42 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు.

గత సీజన్‌లో విజయ్ హజారే ట్రోఫీలో (50 ఓవర్లు), సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీల్లో పడిక్కల్‌ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా పడిక్కల్ నిలిచాడు. 20 ఏళ్ల పడిక్కల్‌ 175.75 స్ట్రయిక్‌రేట్‌తో 580 పరుగులు పిండుకున్నాడు ఆ సీజన్. సగటున ప్రతి రెండు ఇన్నింగ్స్‌లకు ఓ అర్థ సెంచరీ సాధించి వెలుగులోకి వచ్చాడు.

ఆర్సీబీ లో ఐదోవాడు..

ఆర్సీబీతో తరఫున ఎంట్రీ ఇస్తూనే అర్ధ శతకాలు బాదిన వాళ్ళలో పడిక్కల్ 5 వ వాడు. ఇంతకు ముందు క్రిస్ గేల్.. 2011 లో ఆరగేట్రం చేస్తోనే శతకం (102 నాటౌట్), అదే సంవత్సరం ఏబీ డివిలియర్స్ 54 పరుగులు నాటౌట్ చేశారు. 2008లో శ్రీవాత్సవ్ గోస్వామీ 52 పరుగులు చేశాడు. ఇక యువరాజ్ సింగ్ 2014లో 52పరుగులతో నాటౌట్‌ గా నిలిచాడు. ఇప్పుడు ఆ వంతు పడిక్కల్ ది. ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ పడిక్కల్ అంటున్నారు!

Show Full Article
Print Article
Next Story
More Stories