T20 World Cup 2026 : దాయాది డ్రామాలకు చెక్..రూల్స్ ప్రకారం ముందుకెళ్తున్న సూర్య సేన

దాయాది డ్రామాలకు చెక్..రూల్స్ ప్రకారం ముందుకెళ్తున్న సూర్య సేన

CR Reddy
Published on: 2 Feb 2026 7:40 AM IST
T20 World Cup 2026 : దాయాది డ్రామాలకు చెక్..రూల్స్ ప్రకారం ముందుకెళ్తున్న సూర్య సేన
X

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్-పాకిస్థాన్ పోరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించినప్పటికీ, టీమిండియా మాత్రం తన ప్రణాళికను మార్చుకోవడం లేదు. ప్రత్యర్థి జట్టు వస్తుందా రాదా అన్నదానితో సంబంధం లేకుండా, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకుంది. నిబంధనలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా పాక్ వైఖరిని ఎండగట్టాలని బీసీసీఐ భావిస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యంత ఆసక్తికరమైన భారత్-పాక్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ జట్టు కూడా ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకే పాక్ రాకపోయినా తాము మాత్రం షెడ్యూల్ ప్రకారం కొలంబో వెళ్తామని టీమిండియా స్పష్టం చేసింది. ఫిబ్రవరి 15న కొలంబోకు చేరుకోనున్న భారత జట్టు, అక్కడ అధికారిక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటుంది, మైదానంలో ప్రాక్టీస్ చేస్తుంది. మ్యాచ్ సమయానికి స్టేడియంలో రిపోర్ట్ చేస్తుంది.

ఐసీసీ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ సమయానికి ఒక జట్టు మైదానంలోకి రాకపోతే, మ్యాచ్ రెఫరీ నిర్ణీత సమయం వరకు వేచి చూస్తారు. అప్పటికి కూడా ప్రత్యర్థి జట్టు రాకపోతే, మైదానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తూ ఫార్ఫిట్ నిర్ణయం తీసుకుంటారు. దీనివల్ల భారత్‌కు నేరుగా రెండు పాయింట్లు లభిస్తాయి. పాకిస్థాన్ ఆడినా ఆడకపోయినా, ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావాల్సిందే. అందుకే భారత జట్టు లంక పర్యటనను రద్దు చేసుకోకుండా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తోంది.

మరోవైపు ఐసీసీ ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం టోర్నీ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఐసీసీ వ్యాఖ్యానించింది. ప్రతి దేశం తమ ప్రభుత్వాల రాజకీయ నిర్ణయాలను గౌరవించాల్సిందే అయినా, క్రీడల్లో ఇలా సెలెక్టివ్ పార్టిసిపేషన్(నచ్చిన మ్యాచ్‌లు మాత్రమే ఆడటం) చెల్లదని ఐసీసీ హెచ్చరించింది. పిసిబి నుంచి అధికారిక సమాచారం వచ్చిన తర్వాత ఐసీసీ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే పాక్ రాకపోవడం వల్ల ఐసీసీకి సుమారు 300 కోట్ల రూపాయల వరకు ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

CR Reddy

CR Reddy

Next Story