IND vs WI : భారత్-వెస్టిండీస్ 2వ టెస్ట్.. కోట్లా కోట చరిత్ర చెక్కుచెదరదా?

IND vs WI  : భారత్-వెస్టిండీస్ 2వ టెస్ట్.. కోట్లా కోట చరిత్ర చెక్కుచెదరదా?
x

IND vs WI : భారత్-వెస్టిండీస్ 2వ టెస్ట్.. కోట్లా కోట చరిత్ర చెక్కుచెదరదా?

Highlights

అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌పై తిరుగులేని విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు న్యూఢిల్లీకి చేరుకుంది.

IND vs WI : అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌పై తిరుగులేని విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు న్యూఢిల్లీకి చేరుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‎లో తమ రెండో సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం, అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్‌ను కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా కేవలం రెండున్నర రోజుల్లోనే ఇన్నింగ్స్ తేడాతో గెలిచి అంచనాలను నిలబెట్టుకుంది. ఢిల్లీలో కూడా కథ మారే అవకాశం తక్కువగా కనిపిస్తున్నా, ఈ మ్యాచ్ కోసం భారత్ తమ ప్లేయింగ్-11లో ఏమైనా మార్పులు చేస్తుందా అనేది ఆసక్తికరం.

గత కొద్ది రోజులుగా ఢిల్లీలో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. అయితే, మ్యాచ్ జరిగే శుక్రవారం వర్షం పడే సూచనలు లేవు. ఉష్ణోగ్రతలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు సుమారు 25 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండొచ్చు, ఇది టెస్ట్ మ్యాచ్‌కు అనువైన వాతావరణం. ఉదయం పూట గాలి వీచే అవకాశం ఉండటంతో ఫాస్ట్ బౌలర్లకు కొద్దిగా సహాయం లభించే ఛాన్స్ ఉంది. అయితే, ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేయడమే ఉత్తమ నిర్ణయం కావొచ్చు.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం (గతంలో ఫిరోజ్ షా కోట్లా) భారత్‌కు అభేద్యమైన కోటగా నిలిచింది. ఈ మైదానంలో టీమిండియా గత 38 ఏళ్లుగా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. చివరగా 1987లో భారత్ ఇక్కడ వెస్టిండీస్ చేతిలోనే ఓటమి పాలైంది. ఆ తర్వాత ఇక్కడ ఆడిన 13 టెస్టుల్లో భారత్ 11 గెలిచింది, రెండూ డ్రా అయ్యాయి. అంటే, ఆ దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్రను ఈ మ్యాచ్‌లో కూడా చెక్కుచెదరకుండా కాపాడుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ స్టేడియంలో చివరిగా 2023లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ జరిగింది. ఈసారి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లు లేకపోయినా, ఈ చారిత్రక మ్యాచ్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.

1987 నాటి వెస్టిండీస్ జట్టుకు, 2025 నాటి జట్టుకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుత కరీబియన్ టీమ్ బలంగా లేకపోవడంతో, టీమిండియా ప్లేయింగ్-11లో మార్పులు చేసినా గెలుపుపై ప్రభావం చూపకపోవచ్చు. ఈ మార్పులకు సంబంధించిన చర్చల్లో ప్రధానంగా జస్‌ప్రీత్ బుమ్రా గురించే మాట్లాడుకుంటున్నారు. మొదటి టెస్ట్ మూడు రోజుల్లోనే ముగియడంతో బుమ్రాకు ఐదు రోజుల విశ్రాంతి దొరికింది. అయినప్పటికీ, అతని పనిభారం దృష్టిలో ఉంచుకుని మేనేజ్‌మెంట్ ఢిల్లీ టెస్ట్‌కు బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బుమ్రాకు రెస్ట్ ఇస్తే, యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకు తుది జట్టులో అవకాశం లభించవచ్చు. సాధారణంగా ఢిల్లీ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. అయితే ఈసారి పిచ్ బ్యాట్స్‌మెన్‌కు కూడా అనుకూలించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి, విండీస్ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించవచ్చు.

భారత జట్టు (అంచనా)

శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

Show Full Article
Print Article
Next Story
More Stories