IND vs AFG U19 Semifinal : రికార్డులన్నీ బ్రేక్.. అండర్-19 చరిత్రలోనే కనీవినీ ఎరుగని రన్ చేజ్‌తో భారత్ సంచలనం

రికార్డులన్నీ బ్రేక్.. అండర్-19 చరిత్రలోనే కనీవినీ ఎరుగని రన్ చేజ్‌తో భారత్ సంచలనం

CR Reddy
Published on: 5 Feb 2026 6:57 AM IST
IND vs AFG U19 Semifinal : రికార్డులన్నీ బ్రేక్.. అండర్-19 చరిత్రలోనే కనీవినీ ఎరుగని రన్ చేజ్‌తో భారత్ సంచలనం
X

IND vs AFG U19 Semifinal : హరారే వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అఫ్గానిస్థాన్ నిర్మించిన 311 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కుర్రాళ్లు ఊపిరి బిగబట్టే ఉత్కంఠ లేకుండా ఛేదించేశారు. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా, అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత భారీ రన్ చేజ్ సాధించిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. గతంలో 2006లో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ సాధించిన 305 పరుగుల రికార్డును మన కుర్రాళ్లు ఈరోజు తుడిచిపెట్టేశారు.

అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో ఫైసల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజై (101*) అద్భుత సెంచరీలతో భారత బౌలర్లను ఆడుకున్నారు. వీరిద్దరి ధాటికి భారత్ ఓటమి తప్పదని అంతా అనుకున్నారు. కానీ, భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. వైభవ్ స్ట్రైక్ రేట్ 206.06గా ఉండటం విశేషం.

మధ్యలో వచ్చిన కెప్టెన్ ఆయుష్ మాత్రే (62) పక్కాగా ఇన్నింగ్స్‌ను నిర్మించగా, ఓపెనర్ ఆరోన్ జార్జ్ క్లాసిక్ సెంచరీతో భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. ఆరోన్ 104 బంతుల్లో 115 పరుగులు చేసి టీమిండియాను సురక్షిత తీరానికి చేర్చాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో విహాన్ మల్హోత్రా (29*) లాంఛనాన్ని పూర్తి చేయడంతో భారత్ ఘనవిజయం సాధించింది. ఇక టోర్నీలో ఫైనల్ పోరు ఫిబ్రవరి 06, శుక్రవారం నాడు భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనుంది. ఆరోసారి ప్రపంచ విజేతగా నిలవడానికి భారత్ ఇప్పుడు అడుగు దూరంలో ఉంది.

CR Reddy

CR Reddy

Next Story