Hardik Pandya: నటాషా స్టాంకోవిక్‌కు భరణంగా 70 శాతం హార్దిక్ పాండ్యా ఆస్తి.. ఈ వివాదంపై ఇప్పటివరకు ఏం తెలుసు?

Hardik Pandya: నటాషా స్టాంకోవిక్‌కు భరణంగా 70 శాతం హార్దిక్ పాండ్యా ఆస్తి.. ఈ వివాదంపై ఇప్పటివరకు ఏం తెలుసు?
x
Highlights

ముంబయి ఇండియన్స్ (ఎంఐ) జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఈ ఏడాది కలిసి రాలేనట్లుగా కనిపిస్తోంది. గత సీజన్‌లో గుజరాత్ టైటన్స్‌ నడిపించిన తరహాలో ప్రస్తుతం ఎంఐలో ఆయన మార్కు కనిపించలేదు.

ముంబయి ఇండియన్స్ (ఎంఐ) జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఈ ఏడాది కలిసి రాలేనట్లుగా కనిపిస్తోంది. గత సీజన్‌లో గుజరాత్ టైటన్స్‌ నడిపించిన తరహాలో ప్రస్తుతం ఎంఐలో ఆయన మార్కు కనిపించలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌లో ఆడిన మొత్తం 14 మ్యాచ్‌లలో కేవలం 4 మ్యాచ్‌లే ముంబయి ఇండియన్స్ గెలిచింది.

జట్టు కెప్టెన్సీని రోహిత్ శర్మ నుంచి తీసుకోవడంపై మ్యాచ్‌ల సమయంలో రోహిత్ అభిమానులు పాండ్యాను ఎగతాళి చేస్తూ కనిపించారు. సోషల్ మీడియాలోనూ ఈ విషయంలో పాండ్యాపై చాలా ట్రోలింగ్ జరిగింది.

ప్రస్తుతం పాండ్యా వ్యక్తిగత జీవితం కూడా ఒడిదొడుకులకు లోనవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

విడివిడిగా జీవనం..

ప్రస్తుతం పాండ్యా, అతడి భార్య, సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ విడివిడిగా జీవిస్తున్నారని, త్వరలోనే వీరు విడాకులకు వెళ్లబోతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మొదటగా ఒక రెడిట్ పోస్టులో దీనిపై వార్త వచ్చింది. ఇది సోషల్ మీడియాతోపాటు ప్రధాన మీడియా స్రవంతిలోనూ దావాణలంలా వ్యాపించింది.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పాండ్యా ఇంటి పేరును నటాషా తొలగించారు. ఇదివరకు నటాషా స్టాంకోవిక్ పాండ్యాగా ఉన్న పేరు ప్రస్తుతం నటాషా స్టాంకోవిక్ అని మాత్రమే కనిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో వీరిద్దరూ ఒకరి ఫొటోలను మరొకరు షేర్ చేసుకోవడం కూడా మానేశారు.

నటాషా పుట్టిన రోజైన మార్చి 4న ఆమెకు శుభాకంక్షలు చెబుతూ హార్దిక్ పాండ్యా ఎలాంటి పోస్టూ చేయలేదు.

మరోవైపు తాజా ఐపీఎల్ మ్యాచ్‌లలోనూ ఆమె ఎక్కడా కనిపించలేదు.

అయితే, హార్దిక్ పాండ్యాతో తీసుకున్న ఫొటోలన్నీ ఇన్‌స్టా నుంచి నటాషా తొలగించారని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ, వీటిలో నిజంలేదు. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టా అకౌంట్‌లో హార్దిక్ ఫొటోలు కనిపిస్తున్నాయి.

70 శాతం ఆస్తి పోతుందా?

ప్రస్తుతం మరో వార్త కూడా ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. వీరి విడాకులు చివరి దశకు వచ్చేశాయని, భరణం కింద నటాషాకు హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70 శాతాన్ని ఇవ్వాల్సి ఉంటుందని దీనిలో పేర్కొన్నారు.

అయితే, ఈ వార్తలను అటు హార్దిక్ పాండ్యా, ఇటు నటాషా ఇద్దరూ ధ్రువీకరించలేదు. అలానే ఖండించలేదు కూడా.

విడాకుల వార్తల నడుమ ఆన్‌లైన్‌లో ప్రస్తుతం నటాషాపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. చాలా మంది నెటిజన్లు ఆమెకు వ్యతిరేకంగా నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.

‘‘బాగా పాపులర్‌ అయిన వ్యక్తితో పిల్లాడిని కనండి. ఆ తర్వాత ఆ ప్రముఖుడిని పెళ్లి చేసుకోండి. అనంతరం విడాకులు తీసుకోండి. ఇది జీరో ఫండింగ్‌తో మంచి స్టార్టప్ ఐడియా’’ అని గగన్ ప్రతాప్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.

‘‘నటాషా విడాకులు కోరడంతో రూ.165 కోట్ల విలువైన ఆస్తులున్న హార్దిక్ పాండ్యా వాటిలో 70 శాతాన్ని ఆమెకు ఇవ్వాల్సి వస్తోంది. మన సమాజంలో పురుషులకు ఎప్పుడూ ఇలాంటి కఠినమైన నిబంధనలే ఉంటాయి’’ అని ఓ ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించారు.

‘‘బ్రో.. వెంటనే నీ ఆస్తి మొత్తాన్ని మీ అమ్మ పేరిట రాసేయ్’’ అని మరో యూజర్ రాసుకొచ్చారు.

అయితే, ఇక్కడ నటాషాకు మద్దతుగా మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు.

‘‘ఇలాంటి ట్రెండ్లను ఇప్పటికైనా ఆపాలి. కేవలం డబ్బు కోసమే హార్దిక్ పాండ్యాను ఆమె పెళ్లి చేసుకున్నారని మీరు ఎలా చెబుతారు. వారి మధ్య ఏం జరిగిందో మీకేం తెలుసు? ఏం తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయకూడదు’’ అని నవనీత ట్వీట్ చేశారు.

వారిద్దరూ ఏం చెబుతున్నారు?

తాజా వివాదం నడుమ నటాషా స్టాంకోవిక్ ఇన్‌స్టాలో ఒక పోస్టు చేశారు. ‘‘ఒకరు రోడ్డు మీదకు వచ్చేయబోతున్నారు’’ అని ఆమె ట్వీట్ చేశారు.

ఈ విషయంపై ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా స్పందించలేదు. కానీ, గతంలో గౌరవ్ కపూర్‌ షో ‘‘బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్’’లో హార్దిక్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

‘‘నా ఆస్తులను మా కుటుంబం చూసుకుంటుంది. ముఖ్యంగా మా అమ్మ చూసుకుంటుంది. డబ్బు విషయంలో నన్ను నేను నమ్మను. అందుకే 50 శాతం ఆస్తులను మా అమ్మ పేరిట ట్రాన్స్‌ఫర్ చేశాను. అవి తన దగ్గర ఉంటేనే మంచిదని అలా చేశాను. ఒకవేళ ఏదైనా జరిగినా నేను మొత్తం కోల్పోను కదా’’ అని హార్దిక్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఎవరీ నటాషా స్టాంకోవిక్?

సెర్బియాకు చెందిన మోడల్, నటి అయిన నటాషాకు 2020 మార్చి నెలలో ఒక నౌకలో హార్దిక్ పాండ్యా ప్రపోజ్ చేశారు.

వీరిద్దరూ 2020 మే 31న పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది జులై 30న వీరి తమ తొలి బిడ్డ అగస్త్యకు జన్మనిచ్చారు.

గత ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున ఉదయ్‌పుర్‌లో ప్రత్యేక వేడుక ఏర్పాటుచేసి మరోసారి వీరు పెళ్లి ప్రమాణాలు చేశారు.

శిఖర్ ధవన్‌కు కూడా ఇలానే..

తాజా వార్తలకు కొన్ని నెలల ముందుగా మరో భారత క్రికెటర్ శిఖర్ ధవన్ విడాకుల విషయంలోనూ ఇలానే మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది.

నెలలపాటు విస్తృత చర్చల అనంతరం 2023 అక్టోబరులో భార్య అయేషా ముఖర్జీ నుంచి శిఖర్ ధవన్‌కు దిల్లీలోని ఒక ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.

భరణంలో భాగంగా ఆస్ట్రేలియాలో శిఖర్ ధవన్ కొనుగోలు చేసిన మూడు ఆస్తుల్లో 99 శాతం యాజమాన్యాన్ని (ఓనర్‌షిప్)ను అయేషాకు అప్పగించారు. మరో రెండు ఆస్తుల్లోనూ 50 శాతం వాటాను ఆమెకు ఇవ్వాల్సి వచ్చింది.

అయితే, తొమ్మిదేళ్ల తన కుమారుడిని కలవలేకపోతున్నానని, అన్ని ప్లాట్‌ఫామ్‌లలోనూ అయేషా తనను బ్లాక్ చేసిందని గత ఏడాది డిసెంబరులో శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్టు చేశారు. పుట్టిన రోజు నాడు తన కొడుకును కలవలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రస్తుతం హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్‌ల కూడా ఒక బాబు ఉన్నాడు. వీరి విడాకుల వార్త నిజమైతే.. ఆ బాబును ఎక్కడ ఉంచుతారు? అతడిని చూసేందుకు ఎలాంటి అనుమతులు ఇస్తారు? లాంటి వివరాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories