Gautam Gambhir: గౌతమ్ గంభీర్ మార్క్ కోచింగ్ ఇదేనా? 5 సిరీస్ లలో 3 ఓటములు..ఫ్యాన్స్ ఫైర్

Gautam Gambhir
x

Gautam Gambhir: గౌతమ్ గంభీర్ మార్క్ కోచింగ్ ఇదేనా? 5 సిరీస్ లలో 3 ఓటములు..ఫ్యాన్స్ ఫైర్

Highlights

Gautam Gambhir : టీమిండియా కలలేమో 2027 వరల్డ్ కప్ గెలవాలని.. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అభిమానులకు గుండె దడ పుడుతోంది.

Gautam Gambhir: టీమిండియా కలలేమో 2027 వరల్డ్ కప్ గెలవాలని.. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అభిమానులకు గుండె దడ పుడుతోంది. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వన్డే ఫార్మాట్‌లో భారత జట్టు ప్రదర్శన ఆందోళనకరంగా మారింది. తాజాగా ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను 2-1తో కోల్పోవడం టీమిండియాకు పెద్ద అవమానంగా మారింది. కివీస్ జట్టు గత 37 ఏళ్లలో భారత్‌లో ఎప్పుడూ వన్డే సిరీస్ గెలవలేదు, కానీ ఇప్పుడు గంభీర్ హయాంలో ఆ పట్టు కూడా చేజారిపోయింది.

గత ఏడాది జూలైలో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా వచ్చాక టీమిండియా ఇప్పటివరకు 5 వన్డే సిరీస్‌లు ఆడింది. విచిత్రం ఏంటంటే.. ఇందులో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి, మూడింటిలో ఓడిపోయింది. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో 27 ఏళ్ల తర్వాత భారత్ ఓడిపోవడం అప్పట్లో పెద్ద సంచలనం. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ను క్లీన్ స్వీప్ చేసినా, ఆస్ట్రేలియా చేతిలో పరాభవం తప్పలేదు. సౌతాఫ్రికాను ఓడించి ఊపిరి పీల్చుకున్న లోపే, ఇప్పుడు న్యూజిలాండ్ భారత్‌లో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ప్రధాన ఆటగాళ్లు లేని కివీస్ జట్టు చేతిలో సొంతగడ్డపై ఓడిపోవడం మేనేజ్‌మెంట్‌ను ఇరకాటంలో నెట్టింది.

టీమిండియా తన తదుపరి వన్డే సిరీస్‌ను ఈ ఏడాది జూలైలో ఆడనుంది. ఇంగ్లాండ్‌తో జరిగే ఆ సిరీస్ నుంచే 2027 వరల్డ్ కప్ సన్నాహకాలను మొదలుపెట్టాలని గంభీర్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఆటగాళ్ల ఫామ్, జట్టు ఎంపిక, మ్యాచ్ మధ్యలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు విమర్శలకు దారితీస్తున్నాయి. ఇండోర్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేసినా, యువ బౌలర్ హర్షిత్ రాణా వీరోచితంగా పోరాడినా జట్టుకు విజయం దక్కలేదు. మిగిలిన బ్యాటర్ల బాధ్యతారాహిత్యం టీమిండియా కొంపముంచుతోంది.

కివీస్‌తో జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన 54వ వన్డే సెంచరీతో అదరగొట్టాడు. కానీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్లు నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. వరల్డ్ కప్ గెలవాలంటే ఒకరిద్దరి మీద ఆధారపడితే సరిపోదని, జట్టు మొత్తం సమష్టిగా ఆడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూలైలో ఇంగ్లాండ్‌తో సిరీస్ లోపు గంభీర్ ఈ లోపాలను సరిదిద్దకుంటే 2027 కల కష్టమేనని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories