CSK-Women Cricket: మహిళా క్రికెట్‌లోకి సీఎస్‌కే ఎంట్రీ.. విసిల్ పోడు!

CSK-Women Cricket: మహిళా క్రికెట్‌లోకి సీఎస్‌కే ఎంట్రీ.. విసిల్ పోడు!
x

CSK-Women Cricket: మహిళా క్రికెట్‌లోకి సీఎస్‌కే ఎంట్రీ.. విసిల్ పోడు!

Highlights

CSK-Women Cricket: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఒకటి. ఇప్పటివరకు ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది.

CSK-Women Cricket: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఒకటి. ఇప్పటివరకు ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. ఐపీఎల్‌లో మేటి జట్టైన సీఎస్‌కే.. ఇప్పుడు మహిళా క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ తాజాగా ధృవీకరించారు. ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చెన్నై ఫ్రాంచైజీ తదుపరి అడుగు మహిళా క్రికెట్‌లో పెట్టుబడి పెట్టడమేనని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో మహిళా క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం ఒక్కసారిగా పెరిగింది.

ఇప్పటికే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఉన్న బ్రాండ్ విలువ, భారీ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లీడర్‌షిప్‌లో సీఎస్‌కే ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు అదే బ్రాండ్ పవర్ మహిళా క్రికెట్‌లోకి వస్తే.. ఆ విభాగానికి మరింత బలం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో సీఎస్‌కే ఈ నిర్ణయం తీసుకోవడం వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకంగా మారింది. డబ్ల్యూపీఎల్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్‌ పేరుతోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం డబ్ల్యూపీఎల్ 2026 చివరి దశకు చేరుకోగా.. డబ్ల్యూపీఎల్ 2027లో చెన్నై ఆడే అవకాశాలు ఉన్నాయి.

కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ఇది కేవలం జట్టు ఏర్పాటు మాత్రమే కాదు, మహిళా క్రికెట్ అభివృద్ధికి దీర్ఘకాలిక పెట్టుబడిగా సీఎస్‌కే చూస్తోందన్నారు. 'టాలెంట్ డెవలప్‌మెంట్, యంగ్ ప్లేయర్స్‌కు అవకాశాలు, బలమైన మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఏర్పాటు వంటి అంశాలపై ఫ్రాంచైజీ ఫోకస్ చేయనుంది. దీంతో భారత మహిళా క్రికెట్‌కు మరింత బలమైన వేదిక లభించనుంది' అని చెప్పారు. ఇప్పటికే ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి ఫ్రాంచైజీలు మహిళా క్రికెట్‌లో విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు సీఎస్‌కే కూడా ఈ రేస్‌లో చేరితే.. మహిళల క్రికెట్‌కు మరింత పోటీ, మరింత పాపులారిటీ రావడం ఖాయం. ఎల్లో ఆర్మీ మహిళా క్రికెట్‌లోకి వస్తే.. స్టేడియంల్లోనూ, సోషల్ మీడియాలోనూ అదే క్రేజ్ కనిపిస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.

మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ మహిళా క్రికెట్‌లోకి అడుగుపెట్టడం భారత క్రికెట్‌కు మరో శుభవార్త. అధికారిక ప్రకటన, జట్టు వివరాలు ఎప్పుడు వెలువడతాయన్నది వేచి చూడాలి. మహిళా క్రికెట్‌లో కూడా త్వరలోనే “విసిల్ పోడు” మోగనుంది. ఎంఎస్ ధోనీ కూడా మహిళా క్రికెట్‌ జట్టు కోసం సీఎస్‌కే యాజమాన్యంకు సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories