Bhuvneshwar Kumar: టెస్టులకు నేను సిద్ధమే.. అవన్నీ తప్పుడు వార్తలు: భువీ

Bhuvneshwar Kumar Clarifies Rumours Not Wanting Play Test Cricket
x

భువనేశ్వర్ కుమార్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Bhuvneshwar Kumar: రెండు వైపులా బంతిని స్వింగ్ చేస్తూ.. ప్రత్యర్థులను భయపెట్టడంలో భువనేశ్వర్ కుమార్ దిట్ట.

Bhuvneshwar Kumar: రెండు వైపులా బంతిని స్వింగ్ చేస్తూ.. ప్రత్యర్థులను భయపెట్టడంలో భువనేశ్వర్ కుమార్ దిట్ట. పరుగులు ఇవ్వకుండా చాలా పొదుపుగా బౌలింగ్‌ చేయడంతోపాటు.. కీలక సమయంలో వికెట్లు తీస్తూ జట్టుకు విజయాలను అందిస్తుంటాడు. ముఖ్యంగా డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు సంపాదించాడు భువీ. అన్ని ఫార్మాట్లలో ఒకప్పుడు కీలకమైన బౌలర్‌గా మారాడనడంలో సందేహం లేదు.

కానీ, క్రమంగా టెస్టులు ఆడడం తగ్గిపోయింది. ఈమేరకు ఇటీవల డబ్యూటీసీ ఫైనల్‌ తోపాటు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లకు జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే ఈ జట్టులో భువనేశ్వర్ కుమార్ చోటు సంపాదించలేకపోయాడు. ఇంగ్లాండ్ పిచ్‌లకు భువీ బౌలింగ్ బాగా సెట్ అవుతుంది. అయినా భువీని సెలక్టర్లు పక్కన పెట్టారు. దీంతో భువీ టెస్టులకు పక్కన పెట్టి పరిమిత ఓవర్లపై ఆసక్తి పెంచుకున్నాడనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా భువీ స్పందించాడు. '' టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ఆడేందుకు నేనెప్పుడూ సిద్దంగానే ఉంటాను. నా దృష్టిలో టెస్ట్ క్రికెట్‌కే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. వన్డే, టీ20లపై దృష్టి పెట్టేందుకే నేను టెస్టులు ఆడడం లేదనే వార్తల్లో నిజం లేదు. ఏ బౌలర్‌ అయినా సరే.. సంప్రదాయ క్రికెట్‌కే మొగ్గు చూపిస్తాడు. ఓ బౌలర్‌ తన బౌలింగ్‌లో వైవిధ్యం చూపించే అవకాశం టెస్టుల్లోనే ఉంటుంది. అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్‌ కంటే టెస్టులకే ప్రాముఖ్యతనిస్తారు. కేవలం ఊహాగానాల ఆధారంగా నాపై అసత్య ప్రచారాలు రాయొద్దంటూ '' కోరాడు.

కాగా, భువనేశ్వర్ కుమర్ చివరిసారిగా జనవరి, 2018లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇంతవరకు టెస్టు మ్యాచ్‌లో కనిపించలేదు. ఈమేరకు తాజాగా ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కాకపోవడంతో... టెస్టులకు దూరం అవుతున్నట్లు రూమర్స్ వినిపించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories