Top
logo

వరల్డ్ కప్ కు సూపర్ టీమ్

వరల్డ్ కప్ కు సూపర్ టీమ్
X
Highlights

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే 2019 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో తెలుగుతేజం అంబటి...

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే 2019 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో తెలుగుతేజం అంబటి రాయుడు, ఢిల్లీ డైనమైట్ రిషభ్ పంత్ చోటు దక్కించుకోలేకపోయారు. ముంబైలో ముగిసిన బీసీసీఐ ఎంపిక సంఘం సమావేశంలో తుదిజట్టును ఖరారు చేశారు. తమిళనాడు ఆటగాళ్లు దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్ అందరి అంచనాలు తలకిందులు చేసి భారతజట్టులో బెర్త్ లు ఖాయం చేసుకొన్నారు.

2019 వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో తెలుగుతేజం అంబటి రాయుడు, ఢిల్లీ డైనమైట్ రిషభ్ పంత్ చోటు దక్కించుకోలేకపోయారు. మొత్తం 15 మంది సభ్యుల తుదిజట్టును చీఫ్ సెలెక్టర్ ఎమ్మేస్కే ప్రసాద్, బీసీసీఐ కార్యదర్శి ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ దేశాల వేదికగా మే 30 నుంచి జరిగే ఈ టోర్నీలో మాజీ చాంపియన్ భారత్ సైతం హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా పోటీకి దిగుతోంది.

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఓపెనర్లుగాను, కెఎల్ రాహుల్ రిజర్వ్ ఓపెనర్ గా ఎంపికయ్యారు. రెండో డౌన్ స్థానంలో అంబటి రాయుడికి బదులుగా తమిళనాడుకు చెందిన మీడియం పేస్ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కు చోటు కల్పించారు. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ చోటును ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ ఖాయం చేసుకొన్నాడు. ఇక పేస్ ఆల్ రౌండర్ గా హార్ధిక్ పాండ్యా, స్పిన్ ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా జట్టు చోటు సంపాదించారు.

స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ లను ఖరారు చేశారు. పేస్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రా కీలక బౌలర్లుగా ఉన్నారు. రిజర్వ్ కమ్ రెండో వికెట్ కీపర్ స్థానాన్ని దినేశ్ కార్తీక్ సంపాదించాడు. ఢిల్లీ డైనమైట్, డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ను పక్కన పెట్టి తుదిజట్టులో దినేశ్ కార్తీక్ కు ఎంపిక సంఘం చోటు కల్పించింది.

సౌతాఫ్రికా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ , శ్రీలంక, అప్ఘనిస్థాన్ జట్లతో టీమిండియా రౌండ్ రాబిన్ లీగ్ లో తలపడుతుంది. జూన్ 5న సౌతాంప్టన్ లోని రోజ్ బౌల్ వేదికగా సౌతాఫ్రికాతో టీమిండియా తన తొలిమ్యాచ్ ఆడనుంది. మే 30 నుంచి జూన్ వరకూ జరిగే ఈటోర్నీ లో భాగంగా మొత్తం 45 మ్యాచ్ లు నిర్వహిస్తారు. ఒక్కో జట్టు తొమ్మిదిరౌండ్ల ప్రధానమ్యాచ్ లు ఆడాల్సి ఉంది. జులై 14న క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జరిగే టైటిల్ సమరంతో 2019 ప్రపంచకప్ కు తెరపడనుంది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో 1983, 2011టోర్నీలు నెగ్గిన ఘనత భారత్ కు ఉంది. విరాట్ కొహ్లీ నాయకత్వంలో టీమిండియా ప్రపంచకప్ తో తిరిగిరావాలని కోరుకొందాం.

Next Story