T20 World Cup 2026 : వరల్డ్ కప్ టీమ్‌లో గిల్‎కు మళ్ళీ షాక్.. ఆకాష్ చోప్రా జట్టులో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్

T20 World Cup 2026 : వరల్డ్ కప్ టీమ్‌లో గిల్‎కు మళ్ళీ షాక్.. ఆకాష్ చోప్రా జట్టులో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
x
Highlights

2026 టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపిక ఇప్పటికే క్రీడా వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపింది.

T20 World Cup 2026 : 2026 టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపిక ఇప్పటికే క్రీడా వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. ముఖ్యంగా యువ సంచలనం శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఒక ఆసక్తికరమైన పని చేశారు. అసలు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఆటగాళ్లతో కలిపి ఆయన ఒక ప్రత్యామ్నాయ టీమిండియాను ప్రకటించారు. అయితే ఇందులో కూడా శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఆకాష్ చోప్రా తన జట్టులో ఓపెనింగ్ బాధ్యతలను యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు అప్పగించారు. జైస్వాల్ లాంటి పేలుడు బ్యాటర్ ఫామ్‌లో ఉన్నా అసలు జట్టులో లేకపోవడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. గైక్వాడ్‌ను ఒక నిలకడైన బ్యాటర్‌గా అభివర్ణించారు. వీరిద్దరితో పాటు కేఎల్ రాహుల్‌ను కూడా ఓపెనింగ్ ఆప్షన్‌గా ఎంచుకున్నారు. గిల్‌ను పక్కన పెట్టి మరీ వీరిని ఎంచుకోవడం ఆయన వ్యూహాన్ని స్పష్టం చేస్తోంది.

ఆకాష్ చోప్రా తన జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్‌కు ఇచ్చారు. మిడిల్ ఆర్డర్‌లో బలాన్ని పెంచేందుకు రిషబ్ పంత్, జితేష్ శర్మ, కేఎల్ రాహుల్ రూపంలో ముగ్గురు వికెట్ కీపర్ బ్యాటర్లను ఎంపిక చేయడం విశేషం. జితేష్ శర్మ ఇటీవలి టీ20 సిరీస్‌లలో తన సత్తా చాటినప్పటికీ, అసలు వరల్డ్ కప్ జట్టులో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లకు చోటు దక్కింది. ఆల్ రౌండర్ల విషయానికి వస్తే నితీష్ కుమార్ రెడ్డిని ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా, కృనాల్ పాండ్యాను స్పిన్ ఆల్ రౌండర్‌గా ఎంచుకున్నారు.

బౌలింగ్ విభాగంలో ఆకాష్ చోప్రా పెద్ద సంచలనమే చేశారు. టీమిండియాకు దూరమై చాలా కాలమైన సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను మెయిన్ స్పిన్నర్‌గా ఎంచుకున్నారు. ఇక వేగ విభాగంలో స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్‌ను వెనక్కి తీసుకొచ్చారు. భువీ 2022 తర్వాత టీ20లు ఆడకపోయినా, ఆయన అనుభవం జట్టుకు అవసరమని చోప్రా భావించారు. మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్ రూపంలో బలమైన పేస్ దళాన్ని ఆయన సిద్ధం చేశారు.

ఆకాష్ చోప్రా ఎంచుకున్న ప్రత్యామ్నాయ జట్టు: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్, జితేష్ శర్మ, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, కృనాల్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్.

Show Full Article
Print Article
Next Story
More Stories