శివుడిని లింగరూపంలోనే ఎందుకు కొలుస్తారు..

శివుడిని లింగరూపంలోనే ఎందుకు కొలుస్తారు..
x
Highlights

జగమంతా అయన స్వరూపమే అంటారు. భక్త జన కోరికలు తీర్చే కొంగుబంగారమని విశ్వసిస్తారు. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని నమ్ముతారు. ఆయనే బోళాశంకరుడు అభిషేక...

జగమంతా అయన స్వరూపమే అంటారు. భక్త జన కోరికలు తీర్చే కొంగుబంగారమని విశ్వసిస్తారు. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని నమ్ముతారు. ఆయనే బోళాశంకరుడు అభిషేక ప్రియుడు. శివ అంటే సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలు వస్తాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపములోను సింధు నాగరికత కాలంలోనే పూజలందుకున్నాడు. నేటికి దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివున్ని రుద్రునిగా పిలుస్తారు.

శివుడిని లింగ రూపంలో ఎందుకు పూజిస్తారు..

శివ లింగము హిందూ మతంలో భక్తులు పూజింపబడే, శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతుంది. పూర్వం శివుడిని విగ్రహ రూపంలోనే పూజించే వారు. కానీ ఆ పరమాత్మని లింగరూపంలో పూజించడానికి వరాహపురాణంలోని ఓ చరిత్ర ఉంది. అది ఏంటంటే వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన ఈ గాథలో భృగు మహర్షి శాప ఘట్టంలో భృగుమహర్షి శివుడి దగ్గరికి వస్తాడు. కానీ శివుడు తాండవం చేస్తూ మహర్షిని పట్టించుకోలేదు. దీంతో కోపోదృక్తుడైన మహర్షి "నేటి నుండి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యం అవుతుంది" అని శపిస్తాడు. అప్పటి నుండి శివుడిని లింగరూపంలో కొలుస్తారు. అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవని తెలుస్తుంది. ఆ శాపం కారణంగానే శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మొదలైందని చెపుతుంటారు. శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది. ఇక పోతే శివుడికి రూపం కూడా ఉండటం వల్ల, ఆయన నిరాకారుడు, సాకారుడు కూడా. ఈశ్వరుడు నిరాకారుడు కాబట్టి నిరాకారమైన లింగమందు పూజింపబడుతున్నాడు.

పురాణాల్లో లింగోద్బవం...

మహా శివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి లింగోద్భవ కాల పూజ పరమ శివుడిని కొలిచేందుకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ లింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించడం జరిగింది. మహా ప్రళయం తరువాత, సృష్టి, స్థితి కారకులైన బ్రహ్మ, విష్ణువు మధ్య ఎవరు గొప్పో తేల్చుకోవాలన్న పోటీ వచ్చి, అది సంగ్రామానికి దారి తీసింది. ఒకరిపై ఒకరు భీకర ఆస్త్రాలను ప్రయోగించుకునే వేళ, మరో ప్రళయాన్ని నివారించేందుకు లయ కారకుడు రంగంలోకి దిగి, ఆద్యంతాలు తెలియని మహాగ్ని స్తంభం రూపంలో అవతరించి దర్శనమిచ్చాడు. ఇది జరిగింది మాఘ బహుళ చతుర్దశి నాటి అర్థరాత్రి. ఇదే లింగోద్భవ కాలం.

ఇక ఈ శివ లింగావతారం మొదలును తెలుసుకునేందుకు విష్ణువు వరాహ రూపంలో, ముగింపును చూసేందుకు బ్రహ్మ హంస రూపంలో వెళ్లి, తమ లక్ష్యాన్ని చేరలేక తిరిగి వచ్చి శివుడినే శరణు కోరగా, తన నిజరూపంతో వారికి దర్శనమిచ్చి వారిలో నెలకొన్న అహంకారాన్ని రూపుమాపాడు. శివుడు తొలిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం కాబట్టి లింగోద్భవ కాలం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకే, రాత్రి 11 గంటల వేళ మొదలయ్యే లింగోద్భవ కాల పూజలను భక్తులు అత్యంత శ్రద్ధతో నిర్వహించి పరమశివుడి కృపకు పాత్రులవుతుంటారు.

శివ లింగనిర్మాణము..

శివలింగము (మానుష లింగము) లో మూడు భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో, విష్ణు భాగం పీఠంలో, శివ భాగం మనకు కనిపించే పూజా భాగముగా శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధముగ సరియైన రాతిలో గాని ఇతర పదార్ధాలతో నిర్మిస్తారు.

శివ లింగములు - రకములు

స్వయం భూ లింగములు : స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.

దైవిక లింగములు : దేవతా ప్రతిష్ఠితాలు.

రుష్య లింగములు : ఋషి ప్రతిష్ఠితాలు.

మానుష లింగములు : ఇవి మానవ నిర్మిత లింగములు.

బాణ లింగములు : ఇవి నర్మదా నదీతీరాన దొరికే (తులా పరీక్షకు నెగ్గిన) బొమ్మరాళ్ళు.

పంచభూత లింగాలు..

1. తేజో లింగం : అన్నామలైశ్వరుడు - అన్నామలై

2. జల లింగం : జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం

3. ఆకాశ లింగం : చిదంబరేశ్వరుడు (నటరాజ) - చిదంబరం

4. పృథ్వీ లింగం : ఏకాంబరేశ్వరుడు - కంచి

5. వాయు లింగం : శ్రీకాళహస్తీశ్వరుడు - శ్రీకాళహస్తి




Show Full Article
Print Article
More On
Next Story
More Stories