Top
logo

కర్మ ఫలితం... సుఖ దుఖాలమయం

కర్మ ఫలితం... సుఖ దుఖాలమయం
Highlights

ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఎవరికైనను తప్పదన్నా.. ఏనాడు ఏ తీరో ఎవరు చెప్పాగలరు అనుభవించుట తథ్యమన్నా!...

ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఎవరికైనను తప్పదన్నా.. ఏనాడు ఏ తీరో ఎవరు చెప్పాగలరు అనుభవించుట తథ్యమన్నా! అలనాటి పాండవులు ఆకులు అలములుమేసి అడవి పాలైపోయరన్నా! రాముడంతటి వాడు రమణి సీతనుబాసి పావురునివలె ఏడ్చెనన్నా! ఏనాడు ఏ తీరో ఎవరు చెప్పాగలరు అనుభవించుట తథ్యమన్నా!'' అంటూ ఇటీవలికాలం దాకా ఊళ్లల్లో సాధువులు తంబుర చేతబట్టి తత్వాలు పాడుతుండేవారు. మానవుని సుఖ దుఃఖములకు తన మనోవాక్కాయ కర్మలే కారణం. ఎవరు చేసిన కర్మ తాలూకూ ఫలాన్ని వారు అనుభవించే తీరాలి. సృష్టి క్రమంలో భగవంతుడు సంకల్పించిన, మన వేద విజ్ఞానం ప్రవచించిన, అందరికీ వర్తించే, ఎవరూ తప్పించుకోజాలని ఇనుప గొలుసులతో మానవాళిని బంధించిన భగవంతుని కఠినమైన చట్టం కర్మఫలం.

ఎట్టి విత్తనమో అట్టి మొక్క, ఎట్టి తిండో అట్టి తేనుపు. అయితే కర్మ ఫలాలను అనుభవించటానికి పట్టే సమయంలో, కాలంలో తేడాలుండవచ్చు. కానీ ఎప్పటికైనా అనుభవించక తప్పదు. చేసిన తక్షణమే ఫలితమందించే కర్మలు కొన్ని. నెలలు, సంవత్సరాల తర్వాత ఫలితమందించేవి మరికొన్ని. వందల, వేల సంవత్సరాల తర్వాత ఫలితాలనందించే కర్మలు కూడా ఉంటాయి. మనం నడుస్తుంటే కాలు జారి కింద పడతాం. తక్షణమే ఎముక విరుగుతుంది. భుజించిన ఆహారం జీర్ణమై శక్తినందించటానికి కొన్ని గంటలు పట్టవచ్చును. భూమిలో నాటిన విత్తనం మొలకెత్తటానికి కొన్ని రోజులు, వృక్షమై ఫలాలను అందించడానికి సంవత్సరాలు పడుతుంది.

కర్మఫలం కూడా అంతే. ఈ సత్యాన్ని గుర్తించనివారు.. 'ఫలానా వాళ్లు ఎన్నో దుర్మార్గాలు చేసి సొమ్ము కూడబెట్టుకుంటున్నారు. ఆస్తులు సంపాదిస్తున్నారు. వారి అక్రమాలకు బలై ఎందరో ఆక్రోశిస్తున్నారు. మరి ఆ బాధ పెట్టేవారు సుఖంగా, ఆనందంగా ఉన్నారు గదా! అనుకుంటారు. కానీ, దైవచట్టం వారు వీరు అనే తేడా లేకుండా అందరికీ అనుభవంలోకి వస్తుంది. అయితే ఎంతకాలంలోపు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేం. ఇప్పుడు సుఖాలు అనుభవిస్తున్న వారికి కష్టాలు అనుభవించే రోజు ఒకటి ఉంటుంది. కర్మఫలాన్ని కొంతమేర తప్పించుకోవటానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే దైవానుగ్రహం. అది అంటే ఇతర గ్రహాలు ఏమీ చేయలేవు. భగవంతుని మెప్పించేది మన ఉత్తమ ఆలోచనా విధానం, మనం చేసే మంచి పనులు, మనం మాట్లాడే మంచి మాటలు మాత్రమే.


లైవ్ టీవి


Share it
Top