Top
logo

కలి ప్రభావం.. శ్రీనివాసుడి విలాసం

కలి ప్రభావం.. శ్రీనివాసుడి విలాసం
X
Highlights

కలియుగం ప్రారంభం నుంచే పాపాలు పెరిగిపోయాయి. కలి ప్రభావాన్ని తట్టుకోవడం మానవ జాతి వశం కాకుండాపోయింది. ఆ...

కలియుగం ప్రారంభం నుంచే పాపాలు పెరిగిపోయాయి. కలి ప్రభావాన్ని తట్టుకోవడం మానవ జాతి వశం కాకుండాపోయింది. ఆ సమయంలో సప్త రుషులు ఓ యాగాన్ని తలపెట్టారు. భృగుమహర్షి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగానికి నారుదుడు కూడా వచ్చాడు. ఆ సమయంలో హవిర్భోక్త ఎవరన్న ఒక చర్చ త్రిమూర్తులను పరీక్షించే దాకా వెళ్లింది. అలా బ్రహ్మను, శివుడిని పరీక్షించిన భృగువు చివరగా శ్రీ మహా విష్ణువు వద్దకు వెళ్తాడు. అక్కడ త్రైలోక్యాధిపతిని పరీక్షించే విధానంపై అలిగిన సిరి... హరిని విడిచి భూలోకానికి పయనమైంది. ఆమెను వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు కూడా భూలోకానికి చేరుతాడు.

అలా వచ్చిన శ్రీహరి లక్ష్మీదేవి కోసం వెతికి వెతికి అలసిపోతాడు. ఒక పుట్టలో సేద తీరుతాడు. ఆ సమయంలో హరి ఆకలి తీర్చేందుకు బ్రహ్మ గోవుగా, శివుడు లేగదూడగా మారి చోళరాజు ఆస్థానానికి చేరుతారు. అక్కడ గోపాలకుడి ఆధీనంలో ఉంటూ హరి ఆకలి తీరుస్తుంది కపిల గోవు. ఆ విషయాన్ని చాటుగా గమనించిన గోపాలకుడు... ఆవుపై దాడి చేయబోతాడు. అదే సమయంలో పుట్టలో ఉన్న హరి అకస్మాత్తుగా పైకి లేచి.. గోవును కాపాడుతాడు. ఆవుకు తాకాల్సిన దెబ్బ.... హరికి తాకుతుంది. గడ్డంపై గాయం అవుతుంది. అది చూసిన గోపాలకుడు భయంతో వణికిపోతాడు. గోపాలకుడిని బ్రహ్మ రాక్షసిగా మారమని శపిస్తాడు. ప్రత్యామ్నాయ మార్గం కోరిన గోపాలకుడికి కలియుగ వరదుడు

వరమిచ్చాడు. భూలోకంలో తనను చూసిన మొట్టమొదటి వ్యక్తి ఈ యాదవుడే కనుక... తన గుడి తలుపులు తీసి... తొలి దర్శనం యాదవ వంశస్తులే చేసుకోవాలని వరమిస్తాడు. అదే సంప్రదాయం యుగయుగాల నుంచి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏమైనా ఇది పౌరాణిక గాథ. పురాణ కథ. శేషాచలం కొండలు.... ఆదిశేషుని అవతారం. వెంకటాద్రిలో విలీనమైన ఆదిశేషుడు... తిరుమల నుంచి శ్రీశైలం వరకు విస్తరించాడు. అంజనాద్రి, గరుడాద్రి, నారాయాణాద్రి, నీలాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, వృషభాద్రిని కలుపుకొని ఏడుకొండలుగా పిలుస్తారు. ఆదిశేషువు పడగ భాగం తిరుమల వేంకటేశుడు, శేషువు మధ్య భాగం అహోబిలం లక్ష్మీ నారసింహుడు, తోకభాగాన శ్రీశైలం మల్లికార్జునస్వామి వెలిశారన్నది ప్రచారంలో ఉన్న ఒక కథనం.

హరి, సిరి ఒక్కటై కొలువున్న పరమ పుణ్యధామం శేషాచలం. ఇంతటి పరమపద క్షేత్రం గురించిన నిజనిజాలు ప్రచారంలో కోకొల్లలు. మరి భక్తుల కొంగు బంగారాన్ని నిత్యం తాకే భాగ్యం కలిగిన ఆలయ ప్రధాన అర్చకులు దీనిపై ఏం చెబుతున్నారు. వారి అభిప్రాయాలేమిటి? సాలగ్రామ శిలాస్వరూపంగా కొలువై ఉన్న శ్రీవారి విగ్రహం అలౌకికమైన పదార్థంతో నిర్మితమైందంటారు అర్చకులు. స్వయంవ్యక్తం వెలసిన స్వామివారి మూలవిరాట్టు విగ్రహంపై ఎన్నో ప్రచారాలు ఉన్నా అవన్నీ మూఢనమ్మకాలేనని కొట్టి పారేస్తున్నారు.

Next Story