Top
logo

తిరుమలలో ఘ‌నంగా ముగిసిన శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం

తిరుమలలో ఘ‌నంగా ముగిసిన శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగంధన్వంతరి మహాయాగం చేస్తున్న పండితులు
Highlights

ఓం ధ‌న్వానంత‌రాయ విద్మ‌హే సుధ‌హ‌స్తాయ ధీమ‌హి త‌న్నో విష్ణుప్ర‌చోద‌యాత్ స్వాహా ఓం న‌మో భ‌గ‌వ‌తే వాసుదేవాయ...

ఓం ధ‌న్వానంత‌రాయ విద్మ‌హే

సుధ‌హ‌స్తాయ ధీమ‌హి

త‌న్నో విష్ణుప్ర‌చోద‌యాత్ స్వాహా

ఓం న‌మో భ‌గ‌వ‌తే వాసుదేవాయ ధ‌న్వ‌న్త‌ర‌యే

అమృత క‌ళ‌శ హ‌స్తాయ‌

స‌ర్వ భ‌య హ‌రాయ‌

త్రిలోక‌నాధాయ విష్ణ‌వే స్వాహా.

విశ్వ‌మాన‌వ శ్రేయ‌స్సును ఆకాంక్షిస్తూ, శ్రీ‌వారి ఆశీస్సులు కోరుతూ కరోనా కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేదవిజ్ఞానపీఠంలో మార్చి 26వ తేదీ నుండి నిర్వ‌హించిన శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం శ‌నివారం మ‌హా పూర్ణాహుతిలో ఘ‌నంగా ముగిసింది.

ఈ సందర్భంగా టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు మాట్లాడుతూ ఈ యాగంలో ప్రధానంగా ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ ధన్వంతరి స్వామిని ఆరాధ‌న చేసి హోమాలు, మంత్ర పూరిత‌మైన వాయువుల‌ను స‌మ‌స్త ప్ర‌పంచానికి సూర్య మండ‌లం ద్వారా అందించిన‌ట్లు తెలిపారు. మంత్ర ప‌ఠ‌నాన్ని శ్ర‌వ‌ణం చేసే అవ‌కాశాన్ని వేదంలో క‌లిగించిన‌ట్లు తెలిపారు. స‌మ‌స్త ప్ర‌పంచంలోని వ‌నాలు, ఔష‌దాలు, చెట్లు త‌దిత‌రాలు అంతా ధ‌న్వంత‌రి స్వ‌రూపాల‌న్నారు. క‌రోనా వంటి కంటికి క‌న‌ప‌డ‌ని విప‌త్తు ప్ర‌బ‌లిన‌ప్పుడు ఈ యాగం ద్వారా అన్ని వ్యాధుల నుండి ఉప‌స‌మ‌నం క‌లుగుతుంద‌న్నారు. ఇందులో ప్ర‌పంచంలోని జీవ‌రాశుల‌ను కాపాడ‌టానికి 24 క‌ళ‌శాల‌లో 24 మంది దేవ‌త‌ల‌ను మంత్ర బంధ‌నంతో ఆవాహ‌నం చేసి జ‌ప హోమాలు నిర్వ‌హించిన‌ట్లు వివ‌రించారు. ప్ర‌జ‌లు ధ‌న్వంత‌రి మ‌హా మంత్రాన్ని జ‌పించ‌డం వ‌ల‌న స‌మ‌స్త వ్యాధులు న‌యం అవుతాయ‌న్నారు.

అనంత‌రం టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ సీతారామాచార్యులు మాట్లాడుతూ ధ‌న్వంత‌రి మ‌హాయాగంలో అత‌ల‌, విత‌ల‌, సుత‌ల‌, త‌లాత‌ల‌, ర‌సాత‌ల, మ‌హాత‌ల‌, పాతాల వంటి 7 హోమ గుండాలలో హోమాలు నిర్వ‌హించ‌డం ద్వారా 14 లోకాలలోని దేవ‌త‌ల ఆశీస్సులు మాన‌వుల‌కు క‌ల‌గాల‌ని ఈ యాగం నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. ఈ యాగంలో నాలుగు వేదాల్లోని సూర్య జపానికి, అష్టదిక్పాలకులకు సంబంధించిన వేదమంత్రాలను రుత్వికులు పారాయణం చేసిన‌ట్లు తెలియ‌జేశారు. ఇందులో భాగంగా శ‌నివారం ఉద‌యం విశేషహోమం అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహించిన‌ట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్ర‌ధాన కుంభ మంత్ర జలాన్ని ధ‌న్వంత‌రి స్వామివారికి అభిషేకం చేసిన త‌రువాత, ఆ తీర్థ జ‌లాన్నితిరుమ‌ల‌లోని జలాశయంలో కలుపుతామ‌న్నారు. ఈ శక్తి సూర్యరశ్మి ద్వారా వాతావరణంలో కలిసి మేఘాల ద్వారా వాయు రూపంలో అనారోగ్య కారకాలను నశింపజేస్తుంద‌ని వివ‌రించారు.

ఈ సందర్భంగా విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూప‌నందేంద్ర స్వామివారు మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడి, ఆంధ్ర‌, తెలంగాణ‌ రాష్ట్రాల ముఖ్య మంత్రులు వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, కె.చంద్ర‌శేఖ‌ర్‌రావులు దేశ‌, తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల కోర‌కు, స‌మాజం కొర‌కు ప్ర‌జ‌లు త‌మ త‌మ ఇళ్ల‌లో ఉండాల‌ని, బ‌య‌ట‌కు రాకుడ‌ద‌ని, జ‌న‌సందోహం ఉండ‌కూడ‌ద‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితుల‌లో టిటిడి మార్చి 16 నుండి 25వ తేదీ వ‌ర‌కు ప్ర‌ముఖ పండితుల‌తో తిరుమ‌ల‌లో శ్రీ‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య జ‌పయ‌జ్ఞం ఘ‌నంగా నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. అదేవిధంగా మార్చి 26 నుండి 28వ తేదీ వ‌ర‌కు ధన్వంతరి మహాయాగాన్ని ప్ర‌ముఖ నిష్ణాతులైన పండితుల‌తో టిటిడి అద్భుతంగా నిర్వ‌హించింద‌న్నారు. ఈ యాగం ద్వారా శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆశీస్సుల‌తో ప్ర‌పంచ మాన‌వాళికి అశాంతిని, ఆనారోగ్యాన్ని దూరం చేసి స‌ర్వ‌తోముఖాభివృద్ధిని ప్ర‌సాదించాల‌న్నారు. శ్రీ‌వారి ఆశీస్సుల‌తో విశ్వంలోని స‌మ‌స్త జీవ‌కోటి ఆరోగ్యంగా, సుఖ సంతోషాల‌తో ఉండాలన్నారు. తిరుమ‌ల‌లో గ‌త మూడు రోజులుగా నిర్వ‌హించిన ధన్వంతరి మహాయాగం వ‌ల‌న శ్రీ‌వారి ఆశీస్సుల‌తో విశ్వంలోని స‌మ‌స్త జీవ‌కోటి ఆరోగ్యంగా, సుఖ సంతోషాల‌తో ఉంటార‌ని విశాఖ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామిజీ ఉద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి పెద్ద జీయ‌ర్ స్వామి, చిన్న జీయ‌ర్ స్వామి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, అదనపు ఈఓ ఏవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శివ‌కుమార్ రెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాధ్‌, ప్రిన్సిపాల్ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవ‌ధాని, ఆరోగ్య విభాగం అధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, శ్రీవారి ఆలయ ఓఎస్డి పాల శేషాద్రి, రుత్వికులు తదితరులు పాల్గొన్నారు.
Web Titleto kill coronavirus ttd organising last day Dhanvantari Mahayagam with Srinivasa Shanthiotsava in tirumala
Next Story