Srimukhalingeswram: మోక్ష ప్రదాత శ్రీముఖలింగేశ్వరుడు

Srimukhalingeswram: మోక్ష ప్రదాత శ్రీముఖలింగేశ్వరుడు
x
Highlights

తెలుగు రాష్ట్రాలు ప్రముఖ దేవాలయాలకు పెట్టింది పేరు. తిరుమల వెంకన్న..బెజవాడ దుర్గమ్మ..అన్నవరం సత్యనారాయణ మూర్తి..యదాద్రి నరసింహస్వామి..చిలుకూరు...

తెలుగు రాష్ట్రాలు ప్రముఖ దేవాలయాలకు పెట్టింది పేరు. తిరుమల వెంకన్న..బెజవాడ దుర్గమ్మ..అన్నవరం సత్యనారాయణ మూర్తి..యదాద్రి నరసింహస్వామి..చిలుకూరు బాలాజీ..బాసర సరస్వతీ దేవి ఇలా కొన్ని దేవాలయాలు ప్రసిద్ధి పొందాయి. వేలాది భక్తులు నిత్యం ఈ ఆలయలను సందర్శిస్తుంటారు. అయితే, ఇంత పేరు రాకపోయినా.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రముఖమైన దేవాలయాలు భక్తులకు కొంగు బంగారంలా భాసిల్లుతున్నాయి. ప్రాచీన చరిత వాటి సొంతం. స్థానిక భక్తులకు ఆ ఆలయాలు గర్వకారణం. వాటి చరిత్ర తెలిసిన భక్తులకు ఆ దైవ దర్శనం అపురూపం. అటువంటి దేవాలయల పరిచయం మీకోసం.

శ్రీముఖ లింగేశ్వరుడు..

వంశధారా నదీ తీరాన కొలువై ఉన్న ఈశ్వరుడు శ్రీముఖలింగం. ప్రదక్షణ మాత్రమున మోక్షాన్ని ప్రసాదించే దేవునిగా శ్రీముఖ లింగేశ్వరుడు ప్రసిద్ది గాంచాడు.

ఆలయ విశేషాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం పట్టణానికి సుమారు 56 కిలోమీటర్ల దూరంలో ముఖలింగం అనే గ్రామంలో ఉందీ ఆలయం. వంశధార తీరంలో వెలసిన ఈ ఆలయంలో శ్రీ మధుకేశ్వరస్వామి ఆలయం, శ్రీ భీమేశ్వరాలయం, శ్రీ సోమేశ్వరాలయం ఉన్నాయి. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని 1500 సంవత్సరాల క్రితం కళింగ గంగా వంశస్తులు నిర్మించారని తెలుస్తోంది. రెండవ గంగా వంశం రాజులకు కాలింగ నగరం అన్న పేరుతొ ఇక్కడ రాజధాని ఉండేదని చెబుతారు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అనీ, వైజయంతీ క్షేత్రమనీ పిలుస్తుంటారు. ఈ ముఖలింగానికి మొదట గోవిందకాననం అని పిలిచేవారని క్షేత్ర పురాణం చెబుతుంది. నాలుగు యుగాల్లోనూ ఇక్కడ ఉన్న ఈశ్వరుడిని జయంతీశ్వర, గోకర్నేశ్వర, మదూకేశ్వర, ముఖలింగేశ్వర అనే పేర్లు వ్యవహారంలో ఉన్నాయని క్షేత్ర పురాణం ద్వారా తెలుస్తుంది.

కనులవిందైన ఆలయం..

ఈ ప్రాచీన శైవ ఆలయం ఎంతో సుందరంగా ఉంటుంది. ఆలయం చుట్తో పెద్ద ప్రాకారం ఉంటుంది. తూర్పుముఖంగా ఉండే ఆలయంలో చుట్టూ అష్టదిక్పాలకుల లింగాలు ఉంటాయి.ఈ ఆలయ క్షేత్ర పాలకుడు మాధవ స్వామి. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నంది విగ్రం చూడముచ్చటగా ఉంటుంది. ఈ క్షేత్రం పంచ దేవతారాధన క్షేత్రంగా విశిష్టత పొందింది. సూర్యుడు, విష్ణువు, శంకరుడు, పార్వతి, గణపతి ఈ ఆలయంలో పూజలందుకోవడం విశేషం.


ముఖలింగాలయం లో శిల్ప కల అద్భుతంగా ఉంటుంది. ఆలయ సింహ ద్వారం దగ్గరలోని ఒక శిలాఖండం మీద చిత్రించిన ప్రతిమ కిరాతార్జునీయం కథకు ప్రతిరూపంగా భావిస్తారు. గర్భగుడిలో ఉండే ఈ ముఖలింగం అన్ని శివలింగాల్లా నల్లగా కాకుండా తెల్లగా ఉంటుంది. వంశధార నదిలో స్నానం చేసి ఈ ముఖలింగునికి ప్రదక్షణలు ఆచరిస్తే మరుజన్మ లేకుండా మోక్షం దక్కుతుందని భక్తుల విశ్వాసం.


ఎలా వెళ్ళాలి..

అన్ని ప్రధాన పట్టణాల నుంచి శ్రీకాకుళం వరకూ రైలు సౌకర్యం ఉంది. అక్కడ నుంచి బస్సులో ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. అదేవిధంగా విమానంలో విశాఖపట్నం వరకూ వెళ్లి అక్కడ నుంచి టాక్సీ లేదా బస్సులో శ్రీకాకుళం చేరుకోవచ్చు.


ముఖ్యమైన రోజులు..

శివరాత్రికి ఇక్కడ పెద్ద ఎత్తున తిరునాళ్ళ (జాతర) నిర్వహిస్తారు. అదేవిధంగా జేష్ఠ మాసం శుద్ధ ఏకాదశి నుంచి పూర్ణిమ వరకూ ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories