కార్తీకమాసం.. శివకేశవుల మహిమాన్వితం! ఆధ్యాత్మిక సౌందర్య సంబరం!!

కార్తీకమాసం.. శివకేశవుల మహిమాన్వితం! ఆధ్యాత్మిక సౌందర్య సంబరం!!
x
Highlights

29-10-2019 తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతోంది. ఈ సందర్భంగా కార్తీక మాస విశిష్టత-చేయదగ్గ పూజలు,చేయకూడని పనులు, సంక్షిప్తంగా మీకోసం.

హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మికత కు పెద్ద పీట వేశారు. హిందూ క్యాలెండర్ లో ప్రతి మాసానికీ ఒక విశిష్టత ఉంటుంది. కొన్ని మాసాలకు మరింత ప్రత్యేకత ఉంటుంది. పండుగలు పేరుతొ దైవారాధనకు కేటాయించే ప్రత్యెక సమయాలు ఒక ఎత్తైయితే, ఈ ప్రత్యెక మాసాలకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. భక్తిపూర్వకంగా ఈ మాసాల్లో మేలుగుతుంటారు భక్తజనం. ఇటువంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న వాటిలో అతి ముఖ్యమైనది కార్తీక మాసం. కార్తీక మాసం అనగానే సాధారణంగా పరమ శివునికి ప్రీతి పాత్రమైనదిగా భావిస్తారు. కానీ ఇది విష్ణుమూర్తి ఆరాధనకూ అత్యంత ప్రధానమైన మాసం. ఈ నెలలో ఇటు శైవ క్షేత్రాలు.. అటు వైష్ణవ క్షేత్రాలు అన్నిటిలోనూ ప్రత్యెక పూజాదికాలు నిర్వహిస్తారు. భక్త జనకోటి ఈ పూజాదికాల్లో పాల్గొని తదాత్మ్యత చెందుతారు. ఇక ఈ సంవత్సరం 29-10-2019 తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతోంది. ఈ మాసం ప్రారంభం అవుతున్న సందర్భంగా కార్తీక మాస విశిష్టత.. ఈ మాసంలో చేయదగ్గ పూజలు.. చేయకూడని పనులు.. అన్నిటినీ సంక్షిప్తంగా మీకోసం అనిదిస్తున్నాం.

సాటిలేని కార్తీకం..

శ్రీమహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీకమాసంతో సమానమైన మాసం లేదని అంటారు. శివకేశవులకు అత్యంత ప్రతీకరమైంది కార్తీకమాసం. ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రం, మహిమాన్వితమైంది. కార్తీకమాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఈ మాసంలో అనేక వ్రతాలు చేస్తుంటారు. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అంటే పాడ్యమి తిథి నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. కార్తీకమాసం హరిహరాదులకు ప్రీతికరం..అందులోను ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ''ఆశుతోషుడు'' అనే బిరుదు వచ్చింది.

కార్తీకంలో దైవార్చన ఇలా..

అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకన్నా.. కార్తీక మాసంలో చేసే ఉపవాసం,స్నానం, దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువును తులసి దళాలు, మల్లె ,కమలం,జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతోను శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయంటారు. ఈ మాసంలో నిత్యం ప్రాతఃకాలంలో స్నానమాచరించి.. గుడికి వెళ్లి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతారు. అది సాధ్యం కాని వారు కనీసం సోమవారం, కార్తీక పౌర్ణిమ, ఏకాదశి రోజుల్లో అయినా ఇలా చేస్తే మంచిదని చెబుతారు. కార్తీకమాసంలో చేసే దీపారాధన వలన గతజన్మ పాపాలతో సహా ఈ జన్మపాపాలు కూడా తొలగిపోతాయి. మహిళలు ఈ దీపారాధన చేయడం వలన సౌబాగ్యాలు సిద్దిస్తాయంటారు. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యంగా భావించాలి.

ఈ పనులు కార్తీకంలో మంచిది కాదు..

మాంసం, మద్యం జోలికి ఈ మాసంలో పోకూడదు. ఎవరికీ ద్రోహం చేయవద్దు. పాపపు ఆలోచనలు దరిచేరనీయవద్దు. దైవ దూషణ కూడదు. నువ్వుల నూనె ను కేవలం దీపాల్ని వెలిగించడానికే ఉపయోగించాలి.

విశిష్టమైన రోజులు..

కార్తీక మాసం అంతా ప్రతిరోజూ పవిత్రమైనదే. అయితే, కొన్ని రోజులకు మరింత ప్రాధాన్యత ఇచ్చారు. వాటిలో సోమవారం ప్రధానమైనది. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం దీపారాదాన, శివార్చన చేస్తే మంచిదని ఉవాచ. ఇక కార్తీక ఏకాదశి, పౌర్ణిమ మరింత శ్రేష్టమైనవిగా చెబుతారు. మాసమంతా నిష్టగా ఉంది భగవన్నామస్మరణ చేయలేని వారు ఈ విశిష్ట దినాల్లో తమ భక్తీ పూర్వక నివేదనను భగవంతుడికి సమర్పించుకోవచ్చు. ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలా ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ,సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారంరోజైనా నియమనిష్టల తో ఉపవాసం ఉండి,గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభిం చే పుణ్యఫలాన్ని వర్ణిం చడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతి వృత్తాలు, ఉదాహారణలను బట్టి తెలుసుకోవచ్చు.

కార్తీకమాసం తొలి రోజున బలిపాడ్యమి, విదియనాడు వచ్చే భగనీహస్త భోజనం ఆధ్యాత్మికంగా విశిష్టమైనవి. కార్తీకమాసంలో చేసే దీపదానం మంచి ఫలితాలను ఇస్తుంది. కార్తీకమాసం శుక్లపక్షంలో అక్షయ నవమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, త్రయోదశిలు ఇలా ప్రతి రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. కార్తీక శుద్ధ త్రయోదశి రోజునే స్వాయంభువ మన్వంతరం ప్రారంభమైందని పేర్కొంటారు. కార్తీకపౌర్ణమి రోజున గౌరీవ్రతం, కార్తికేయ దర్శనాలు చేసుకుంటారు. తారాకాసురుడనే రాక్షసుని సంహారం రోజే కార్తీక పౌర్ణమి జరుపుకుంటారనేది పురాణ ప్రశస్తి. కార్తీకమాసంలో ఎటువంటి మంచి పనిచేసినా 'కార్తికదామోదర ప్రీత్యర్థం'అని ఆచరించాలని శాస్త్రోక్తి.

అత్యంత శ్రేష్టం నదీస్నానం..

ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నదీస్నానం అత్యంత శ్రేష్ఠమైంది. శరదృతువులో నదుల్లో ఔషధాల సారం ఉంటుంది. అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైన శరదృతువులోని పవిత్ర జలాన్ని 'హంసోదకం' అని అంటారు. కార్తీకమాసంలో మానసిక, శారీరక రుగ్మతులను తొలగించి ఆయురారోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం ముఖ్యమైంది. పైత్య ప్రకోపాలను తగ్గించడానికే హంసోదక స్నానం. సూర్యోదయానికి ముందే నదిలో మునిగి స్నానం ఆచరిస్తే ఉదర సంబంధ రోగాలు నయమవుతాయి. కార్తీకంలో సూర్యోదయానికి ముందు విష్ణు సన్నిధిలో శ్రీహరి కీర్తనలు గానం చేస్తే వేలగోవుల దానఫలితం, వాయిద్యం వాయిస్తే వాహపేయ యజ్ఞఫలం, నాట్యం చేస్తే సర్వతీర్థ స్నానఫలం, పూజా ద్రవ్యాలను సమరిస్తే అన్ని ఫలాలూ, దర్శనం చేసేవారికి ఈ ఫలితాల్లో ఆరోవంతు ఫలం లభిస్తుంది.

కార్తీక సోమవారం శివారాధన ఇలా..

కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమని ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సోమవారం శివుని ఎలా ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయో చూద్దాం. కార్తీకమాసంలో కృత్తికతో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి పరమేశ్వరుని ఆరాధించాలి. శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం. అందులోనూ శివకేశవులకు ఇష్టమైన కార్తీక సోమవారం నాడు స్నాన, జపాలు ఆచరిస్తే వెయ్యి అశ్వమేథాల ఫలం దక్కుతుంది. సోమవార వ్రతాన్ని ఆరు విధాలుగా ఆచరిస్తారు.

ఉపవాసం: కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసంతో గడిపి, సాయంకాలం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం సేవించడం.

ఏకభుక్తం: దాన, తపం, జపాలు చేసిన తరువాత మధ్యాహ్నం పూట భోజనం చేసి, రాత్రి శైవతీర్థమో, తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి.

నక్తం: పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం లేదా అల్పాహారం స్వీకరించాలి.

అయాచితం: భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం.

స్నానం : శక్తిలేని వాళ్లు సమంతరం స్నానం, జపాలు చేసినా చాలు.

మంత్ర, జపవిధులు కూడా తెలియనివాళ్లు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది.

మహావిష్ణు ప్రీతి కోసం ఇలా..

ఆషాఢశుద్ధ ఏకాదశినాడు శయనించిన శ్రీమహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశినాడు నిద్ర లేస్తాడని చెబుతారు. అందుకే, శయనించినఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అని, నిద్రలేచి కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధన ఏకాదశి అని పిలుస్తారు. ఈ మధ్యలోని నాలుగు నెలలు కూడా వర్షాకాలంగా, చాతుర్మాస్యదీక్షగా నిత్యమూ విష్ణు ఆలయాలలో సంకీర్తనలు తులసి పూజలు చేస్తారు.

కార్తీక శుద్ధ ద్వాదశిని తెలుగువారు క్షీరాబ్ది ద్వాదశి గా ఒక గొప్ప పర్వంగా జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు నిద్రపోయి, నిద్రలేచిన స్వామి మొదట బృందావనంలోని తులసివనంలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ రోజు బృందావనంలో తులసికోట దగ్గర కూడా స్వామిని పూజిస్తారు. కార్తీక ద్వాదశి కి గోవత్స ద్వాదశి, విభూతి ద్వాదశి, నీరాజన ద్వాదశి, యోగిని ద్వాదశి, మధన ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అని అనేకమైన నామాలు ఉన్నట్లుగా చెబుతారు శ్రీకృష్ణుని దేవేంద్రుడు పాలతో అభిషేకించిన సందర్భంలో గోవిందుడి గా పిలవబడ్డాడు .

ఇలా కార్తీక మాసం అంటేనే ఆధ్యాత్మిక విశిష్టతలకు మారు పేరుగా నిలిచింది. ఈ మాసంలో దైవారాధనకు సమయం కేటాయించలేని వారు.. అంత అవకాశం లభించని వారు ప్రాతఃకాలంలో శివకేశవులను తలచుకుని ప్రార్థన చేసినా వారి జన్మ ధన్యం అవుతుందని పండితులు చెబుతారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories