నేటి నుండి అధిక మాసం ఈ మాసంలో శుభకార్యాలు చేయొచ్చా ? చేయకూడదా ?

నేటి నుండి అధిక మాసం ఈ మాసంలో శుభకార్యాలు చేయొచ్చా ? చేయకూడదా ?
x
Highlights

అధిక మాసం అంటే ఏమిటి? ఎందుకు అధిక మాసం వస్తుంది? ఈ మాసంలో శుభకార్యాలు చేయొచ్చా?

మన పండగలు ఒకో సంవత్సరం ఒక్కో తేదీన వస్తుంటాయి. ఏ పండగా కూడా ప్రతి సంవత్సరం ఒకే రోజు రాదు. అందుకు కారణం తెలుసా? మన కాలెండర్ చంద్రమానం ప్రకారం ఉంటుంది. తరచూ మనం అధిక మాసం అనే మాట వింటాము. అధిక మాసం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం.

మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. పంచాంగ గణనం ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంబావు రోజులు తేడా ఉంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. ఇదే మాదిరిగా చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇందువల్ల ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం కావడం జరగకుండా పోతుంది. అటువంటప్పుడు సూర్యసంక్రాంతి లేకుండా పోయిన చాంద్రమాసానికి అధికమాసం అని పేరుపెట్టారు. ఇలా అధికంగా వచ్చే అధికమాసం శుభకార్యాలకు పనికిరాదని నిషేధించారు.

అలాగే ఈ శార్వరి నామ సంవత్సరంలో అధిక మాసం వచ్చింది. అయితే ఈ అధిక మాసంలో ఏ విధమైన శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ అధిక మాసం 2020 సంవత్సరంలో సెప్టెంబర్ 18వ తేదీన మొదలైంది. ఏది ఏమైనా అధికమాసంలో దేవుళ్ల పూజలకు సంబంధించిన కార్యక్రమాలను మాత్రం కచ్చితంగా చేయాలని పండితులు చెపుతున్నారు. శుభకార్యాలకు ఈ మాసం నిషేధం కదా..మరి పూజలు ఎలా పూజాకార్యక్రమాలు ఎలా నిర్వర్తించొచ్చు అని అనుకోవచ్చు. కానీ శుభకార్యాలు వేరు. దేవతల పూజలు వేరు. అందుకే పూజాధికార్యక్రమాలు నిర్వగ్నంగా జరుపుకోవచ్చు. ఇక ఈ అధిక మాసంలో సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది.

ఇలాంటి సదావకాశం ప్రతి ఏడాది రాదు. ఈ అధిక మాసం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే గొప్ప అవకాశం. అందుకే ఇలాంటి సువర్ణాకాశాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నారు పండితులు. దక్షిణ భారతదేశంలోని మన తెలుగు రాష్ట్రాల ప్రజలు చాంద్రమానాన్ని పాటిస్తే.. తమిళనాట ఉండే ప్రజలు సౌరమానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

అధికామసంలోని 30 రోజులలోని పౌర్ణమికి ముందు వచ్చే ఏడు రోజులలో భాగవతాన్ని పారాయణం చేయాలి. లేదా భాగవతం పారాయణం చేయాలి. అనంతరం ఆ గ్రంధాన్ని పండితులకు అందజేయాలి. ముఖ్యంగా భాగవతంలోని దశమ స్కందంలోని క్రిష్ణునికి సంబంధించిన కథనాలను పారాయణం చేస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

అధికమాసం అంటే ?

చంద్రుని కదలికలను అనుగుణంగా ఉండే చాంద్రమానం.. సూర్యుని కదలికలను అనుగుణంగా ఉండే సౌర మానం.. వీటికి లెక్కల్లో కొన్ని తేడాలు వస్తుంటాయి. అందులో సౌరమానంలో సంవత్సరానికి కేవలం 360 రోజులు మాత్రమే వస్తాయి. అదే చాంద్రమానంలో 365 రోజులు వస్తాయి. ఇలాంటి తేడాలను సరిచేసి ఒకే లైనుపై తీసుకొచ్చే ప్రయత్నాన్ని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చేశారు. ఇలా రెండు కాలమానాలను సర్దుబాటు చేసిన కాలాన్నే అధిక మాసం అంటారు.

అధికమాసం ఎలా ఏర్పడుతుంది ?

సూర్యుని చుట్టూ భూమి చుట్టివచ్చే కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. కాని ఈ భ్రమణం వల్ల నెలలు ఏర్పడవు. నెలలను కొలవడానికి చంద్ర భ్రమణమే మూలం. భూమి చుట్టు చంద్రుని ప్రదక్షిణాకాలాన్ని నెల అంటారు. దాన్నే చాంద్ర మాసమని అంటారు. ఆ విదంగా ఏర్పడిన 12 చాంద్ర మాసాలను కలిపి ఒక సంవత్సరం అని అనలేము. సూర్యుడు .... మేషం, వృషభం వంటి 12 రాశులలో ఒక్కో రాశిలో ఒక్క నెల సంచరించడాన్ని సౌర మాసం అని అంటారు. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోనికి ప్రవేశించడాన్ని రాశి సంక్రమణం అంటారు.

అధిక మాసము చంద్ర మానము ద్వారానే వస్తుంది. చాంద్ర మానం అంటే చంద్ర కళలను ఆదారంగా ఒక నెల రోజులను లెక్కించడము. సూర్యుడు ఏడాదిలో 12 రాశుల చక్రాన్నిపూర్తి చేస్తే చంద్రుడు రోజుకు ఒక నక్షత్రం చొప్పున నెలకు 27 నక్షత్రాల దగ్గరే వుంటాడు. అంటే 324 రోజులు. సూర్యుడి చుట్టు భూమి తిరగడానికి 365 రోజులా, 6 గంటలు, 11 నిముషాలు 31 సెకెండ్లు పడుతుంది. చంద్రునికైతె 324 రోజులె పడుతుంది. వీరిద్దరి మధ్య సుమారు 41 రోజులు తేడా ఉంది. ఈ వ్యత్యాసం వల్ల భూమి సూర్యుని చుట్టు 19 సార్లు తిరిగితే చంద్రుడు 235 సార్లు తిరుగుతున్నాడు. దాని వలన 19 సంవత్సరాలకు ఏడాదికి 12 మాసాల చొప్పున 228 మాసాలు రావలసి వుండగా 235 మాత్రమే వస్తున్నాయి. అంటే చంద్రుడు 7 నెలలు అధికంగా తిరుగు తున్నాడని అర్థం. ఆ లెక్కన ప్రతి ముప్పై రెండున్నర సౌర మాసాలకు ఒక చంద్ర మాసం అధికంగా వస్తుంది. ఈ విషయాన్ని మొట్టమొదట గ్రహించిన వారు భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞలే.

ఈ అధిక మాసము ఎప్పుడూ చైత్రమాసము నుండి ఆశ్వయుజమాసము మధ్యలోనే వస్తుంది. ఒక సారి అధిక మాసము వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. ఆ తర్వాత 34, 34, 35, 28 నెలలకు వస్తుంది. అధిక మాసం ముందు వచ్చి ఆతర్వాత నిజ మాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని మైల మాసం అని అంటారు. అందుకే ఈ అధిక మాసంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు.

పురుషోత్తమ మాసం..

ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసంగా కూడా పిలుస్తారు. అందరి జీవులలో ఉత్తమ పురుషగా ఉండేవాడు..ఆత్మస్వరూపుడిగా సర్వజీవులలో ఉండే వాడు పరమాత్ముడు. ఆ విధంగా పరమాత్ముడిని దర్శించడానికి , అందుకు ప్రాతిపదికగా తనలో ఉన్న ఆత్మను దర్శించడానికి ఈ సమయం చాలా అనుకూలమైనది.

దేవతలకు పూజలు..

ఈ మాసంలో సకల దేవతలకు పూజలు చేయవచ్చు. ఈ అధిక మాసంలో పుణ్యకార్యాలైన సత్యనారాయణ వ్రతం, నవగ్రహ హోమాలు, నవగ్రహ జపాలు, దేవుళ్లకు అభిషేకాలు, శాంతి పూజలు ప్రత్యేకించి భాగవత పారాయణం, రామాయణ పారాయణం, ఆంజనేయస్వామికి సంబంధించి హనుమాన్ చాలీసా వంటివి ఖచ్చితంగా పఠించాలి.

ఎప్పుడైతే సంక్రమణం ఉండదో..

అధికమాసంలో సంక్రమణం కూడా రాదు. అసంక్రాంతి , ద్విసంక్రాంతి వస్తుంది. ఈ మాసంలో పౌర్ణమి వచ్చినప్పటికీ , ఆ పౌర్ణమితో కూడుకున్నటువంటి విశేష గుణగణాలు కనిపించవని పండితులు చెబుతున్నారు. ఏ మాసంలో అయితే సంక్రమణం ఉండదో ఆ మాసమే అధిక మాసం అని చెబుతున్నారు.

శుభకార్యాలు చేయకూడదు..

ఇలా సంక్రమణం లేని మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, నామకరణాలు, ఉపనయనాల ఇలాంటి కార్యక్రమాలను చేపట్టవద్దని పండితులు చెపుతున్నారు.

ఈ నెలలో పుణ్యకార్యాలు చేస్తే..

అధికమాసంలో నిత్యం ఇష్టదైవాన్ని తలచుకుని ద్యానం చేయడం లేదా జపం చేయడం వంటివి చేయాలి. ఇలా చేసిన వారికి ఎన్నో రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. ఉదాహరణకు నిజమాసాల్లో రామ అని ఒక్కసారి పలికితే ఒక్కసారే ఫలితం వస్తుంది. కానీ ఈ అధిక మాసంలో ఒక్కసారి రామా అంటే కోటి రెట్ల ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

దానం చేయడం..

ఈ అధికమాసంలో దానం చేయడం వల్ల ఎన్నో రెట్ల పుణ్యఫలం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ అధిక మాసంలో పేదలకు, అనాథలకు, ఇతరులకు ఏమి దానం చేసినా ఎంతో పుణ్యఫలి లభిస్తుంది. ముఖ్యంగా అన్నదానం, లేదా విద్యాదానం చేస్తే మరింత శుభప్రదమైన ఫలితాలొస్తాయట. ఈ దానాలు మాత్రమే చేయాలని నియమనిబంధనలేమీ లేవు. అందుకే మీ మనసు పూర్తిగా మీకు నచ్చిన ఇష్టదైవాన్ని స్మరిస్తూ మీకు ఉన్నదాంట్లో, మీ శక్తి మేరకు మీకు తోచిన సాయం చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories