Siddalakona Temple: సిద్దేశ్వర కొండకు ఆ పేరెందుకొచ్చిందో తెలుసా?

Siddalakona Temple: సిద్దేశ్వర కొండకు ఆ పేరెందుకొచ్చిందో తెలుసా?
x
Siddala Kona Temple
Highlights

Siddalakona Temple: కొన్ని క్షేత్రాల పేర్లు వింటే చాలు ఆ క్షేత్రాలను చూడాలనే ఆసక్తి ఉంటుంది.

Siddalakona Temple: కొన్ని క్షేత్రాల పేర్లు వింటే చాలు ఆ క్షేత్రాలను చూడాలనే ఆసక్తి ఉంటుంది. అలాంటి క్షేత్రాలను దర్శించినప్పుడు అవి మహిమాన్వితమైనవిగానే కనిపిస్తుంటాయి. అలాంటి మహమాన్విత క్షేత్రాల్లో 'సిద్ధులకొండ' కూడా ఒకటిగా ఉంది. ఈ క్షేత్రంలో ఒకప్పుడు ఈ కొండపై సిద్ధులు తపస్సు చేసుకునేవారట. నెల్లూరు - సైదాపురం సమీపంలో గల ఈ గుట్టపై సిద్ధేశ్వరస్వామి దర్శనమిస్తూ వుంటాడు.

స్థలపురాణము

ఒక దట్టమైన అడవిలో ఒక కొండపైన ఇద్దరు సిద్ధులు తపస్సు చేసుకుంటున్నారు. అక్కడ సంచరిస్తున్న ఒక గిరిజనుడు దేదీప్యమానంగా వెలుగు విరజిమ్ముతున్న వారిని చూస్తూ అలాగే రెండు రోజులుండిపోయాడు. సిద్ధులు తర్వాత కళ్లు తెరిచి గిరిజనుని చూసి తమగురించి ఎవ్వరికి చెప్పొద్దని చెప్పితే తనకే ప్రమాదమని హెచ్చరించి వెళ్లిపొమ్మన్నారు. కొన్నిరోజులు నిగ్రహించుకున్న ఆ గిరిజనుడు తాను చూసిన వింతను తమ వారికి చెప్పాడు. అందరూ కలిసి ఆ అటవీ ప్రాంతానికి వచ్చి చూడగా, ఆ సిద్ధులు శిలలుగా మారిపోయారు. ఆ గిరిజనుడు మరణించాడు. అప్పటినుండి గ్రామస్థులు ఆ సిద్ధులను పూజిస్తూ వచ్చారు. వారి కోరికలు సిద్ధిస్తుండడముతో ఆ కొండకు సిద్ధుల కొండ పేరు స్థిరపడింది.

చారిత్రికము

రాజరాజ నరేద్రుని చిన్న భార్య చిత్రాంగి రాజరాజ నరేంద్రుని కొడుకు సారంగధరుని మోహించి భంగ పడి ప్రతీకారంతో రాజుగారికి తప్పుడు ఫిర్యాదు చేస్తుంది. దాంతో రాజు సారంగధరుని కాళ్లు, చేతులు నరికి వేయమని ఆదేశిస్తాడు. అతని ఆదేశాల ప్రకారం సైదాపురం మండలం చాగణం సమీపంలో కత్తుల కొండపై సారంగధరుని కాళ్లు చేతులు నరికినట్లు ఆధారాల వల్ల తెలియ వస్తుంది. అవిటి వాడైన సారంగధరుడు సిద్ధుల కొండపైకి వచ్చాడు. శిలారూప నవకోటి, నవనాధసిద్ధులయ్యలు.... సారంగధరుని తమ శిష్యునిగా చేసుకున్నారు. ఆ విధంగా సిద్ధుల తోపాటు సారంగధరుని బొమ్మకూడ అక్కడ చేరిందని స్థానికులు చెపుతారు. ఈ ఆలయానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు తెలుస్తున్నది.

పూజలు, ఉత్సవాలు

ప్రతిఏడు కార్తీక మాసములో వచ్చే అన్ని సోమ వారాల్లో ఇక్కడ ప్రత్యేక తిరునాళ్లను నిర్వహిస్తారు. అంతేగాక, కార్తీక పౌర్ణమి, మహా శివరాత్రి, నాగ పంచమి, వసంత పంచమి రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ తిరుణాళ్లకు పరిసరజిల్లాలనుండే గాక తమిళనాడు నుండి కూడా భక్తులు విశేషంగా తరలి వస్తారు. గతంలో చిరుత పులి, పాము మొదలగునవి స్వాములను పూజించేవట. వీటిని దూరంగా పంపి, తాము పూజ చేసుకోవడానికి వీలుగా పూజకొరకు కొండ ఎక్కే ముందు పూజారి శంఖం వూదేవాడట. ఆ ఆచారము మొన్నటిదాక కొనసాగిందని స్థానికులు చెపుతారు.

ఆలయవిశిష్టత

మొదట్లో ఈ ఆలయానికి తలుపులు ఉండేవి కావు. ఆతర్వాత తలుపులు ఏర్పాటు చేసినా అవి ఉండేవి కావు. ఇది సిద్ధుల మహత్యమని ఆ తర్వాత తలుపులు ఏర్పాటు చేయడము మానేశారు. ఈ కొండపై సప్త దొరువులుగా పిలిచే ఏడు కొలనులున్నాయి. వాటిలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మిక. ఈ కొలనులో సర్వ వేళలా పుష్కలంగా నీరు ఉం డటము ఒక విశిష్టత. ఈ ఆలయంలో మరో విశేషమేమంటే.... భక్తులు ఒక పుష్పాన్ని తీసుకొని మనసులో ఒక కోర్కెను కోరుకొని ఆ పుష్పాన్ని నవకోటి నవ నాథుల శిలా మూర్తుల పై పెడితే .... అది క్రింద పడితే వారు కోరుకున్న కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. ఆ విధంగా కోరికలు తీరిన భక్తులు తమ పిల్లలకు సిద్ధులయ్య, నవకోటి, నవ నాథ్, సారంగధర అనే పేర్లు పెట్టుకుంటారు. అందుచేత ఈ ప్రాంతంలో ఆ పేర్లు ఉన్నవారే ఎక్కువగా ఉంటారు. ఈ కొండకు సమీపంలో బండరాతిపై సర్పాకృతిలో వెలసిన ఆకారాలను రాహు, కేతువులుగా చెపుతారు. అందుకే ఈ కొండను సర్పక్షేత్రమని పిలుస్తారు. ఈకొండ క్రింద సతీసమేత నవగ్రహ మంటపాలున్నాయి. నవగ్రహాలు ఎక్కడైనా ఉంటాయి. కాని సతీసమేత నవగ్రహాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి.

వసతులు

కొండకు వచ్చే భక్తుల కొరకు కార్తీక, మాఘ మాసాల్లో, ఇతర మాసాల్లో సోమ, శని వారాల్లో మధ్యాహ్నం పూట ఉచిత అన్నదానం చేస్తున్నారు. మాఘ మాసంలో వచ్చే వసంత పంచమి రోజున చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మధ్యన దాతల సహకారంతో... ఆలయ ప్రాంగణంలో సాయిబాబా మందిరం, దక్షిణామూర్తి ఆలయం, యాగమంటపం నిర్మించారు.

ఎలావెళ్ళాలి?

నెల్లూరు పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలోను, లేదా గూడూరు నుండి అరగంట ప్రయాణం చేసినా సైదాపురం చేరుకోవచ్చు. సైదాపురానికి సమీపంలోనే ఉన్నదీ సిద్ధులకొండ క్షేత్రము.

Show Full Article
Print Article
Next Story
More Stories