Srisailam: మల్లన్నగా ముక్కంటి భక్తజనకోటిని మురిపించే శ్రీశైల క్షేత్రం

Srisailam: మల్లన్నగా ముక్కంటి భక్తజనకోటిని మురిపించే శ్రీశైల క్షేత్రం
x
Highlights

శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల...

శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.

ఆలయ చరిత్ర...

నల్లమల లోతట్టు ప్రాంతమైన భౌరాపూర్‌ చెరువు వద్ద వెలసిన భ్రమరాంబ అమ్మవారికి రెడ్డిరాజులు, విష్ణుకుండినులు, చాళుక్యుల కాలంలో గుడి నిర్మించినట్టు చరిత్ర చెప్తున్నది. ఆదివాసీల సోదరి భ్రమరాంబికను శివుడు వివాహం చేసుకున్నందున చెంచు గిరిజనులు శివుడిని బావగా పిలుచుకొంటూ అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. మహాశివరాత్రి రోజున పూర్వంనుంచి చెంచులే ప్రత్యేకంగా శివపార్వతులకు కల్యాణంచేసే పద్ధతి నేటికీ కొనసాగుతున్నది. ఆ కాలంలోనే ఈ ఆలయానికి కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలనుంచి భక్తులు తరలివచ్చేవారు. శ్రీశైలంలో వెలిసిన మల్లికార్జున ఆలయం ప్రాచుర్యంలోకి రావడంతో భక్తులు శివరాత్రి సందర్భంగా అక్కడికి వెళ్తున్నారు.

ఈ ఆలయంలో పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు దర్శించుకుని పూజలు చేసారని చరిత్ర చెబుతుంది. శ్రీశైల దేవస్థానాన్ని రక్షించడానికి కొందరు రాజులు ఆలయం చుట్టూ కోట లాంటి పటిష్ఠ కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది.

ఆలయ విశిష్టత..

శ్రీశైలం దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయంలో శివ పార్వతుల భక్తులకు దర్శనం ఇస్తారు. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజిస్తారు. హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు. ఈ ఆలయానికి సమీపంలోగల మల్లెలతీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.

స్థల పురాణం..

పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే, చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.

శ్రీశైల దేవాలయ ప్రాంతము..

శ్రీమల్లికార్జునుని దేవాలయం అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయం. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది.

భ్రమరాంబిక అమ్మవారి ఆలయం : భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉండును. ఈ ఆలయము ఆంధ్రదేశములోనే అత్యంత విశిష్టమైన శిల్ప కళ కలిగిన దేవాలయముగా వినుతికెక్కినది. ఈ దేవాలయములో గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి వింటే ఝమ్మనే బ్రమరనాధం వినవస్తుంది.

మనోహర గుండము..

శ్రీశైలములో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. దీనిలో గొప్పతనము ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది. శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశములో ఉంది. అంత ఎత్తులో కూడా ఆ రాళ్ళలో ఇంత చక్కని నీరు ఉండటం నిజంగా చూడవలసినదే. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మహానంది లోని కోనేటి నీటిలో క్రింద రూపాయ వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్ని గుండంలో కూడా కనిపిస్తుంది.

పంచ పాండవులు దేవాలయాలు..

పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున అయిదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి శివలింగములను ప్రతిష్ఠించిరి.

వృద్ద మల్లికార్జున లింగము..

ఇక్కడ ముడతలు పడిన ముఖంలా ఉన్న శివ లింగం బక్తులకు దర్శనం ఇస్తుంది. దీన్ని చూస్తే అంత అన్ని శివలింగాల వలె అందముగా కనిపించదు. బహుశా ఈ లింగం బక్తులకు ముసలితనాన్ని గుర్తు చేస్తుంది.

శ్రీశైల శిఖరం..

శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది, ఈ శ్రీశైల శిఖరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు, దూరంగా ఉన్న ఈ ఎత్తైనకొండ శిఖరేశ్వరం పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు.

శ్రీశైలం ఆలయానికి ఇలా వెళ్లాలి..

మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌ నుంచి వచ్చే భక్తులు రోడ్డు మార్గంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్ననూర్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి ఫరహాబాద్‌ చౌరస్తా వచ్చి నల్లమలలోని పుల్లాయిపల్లి, భౌరాపూర్‌ మీదుగా అటవీ ప్రాంతంలో సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే భ్రమరాంబ ఆలయం వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చేవారు శ్రీశైలం చేరుకొని అక్కడ నుంచి ఫరహాబాద్‌ చౌరస్తాకు వచ్చి, అక్కడ నుంచి భౌరాపూర్‌ భ్రమరాంబ ఆలయానికి చేరుకోవాలి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories