రాయలవారు కట్టించిన రాములవారి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు

రాయలవారు కట్టించిన రాములవారి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు
x
Highlights

టిటిడి అనుబంధ ఆలయమైన చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం( 20-10-2019) పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది.

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

విజయనగర సామ్రాజ్య చక్రవర్తి, తెలుగు ప్రబంధ కవి, సాహితీ సమరాంగణ సార్వభౌమునిగా ప్రఖ్యాతుడైన శ్రీకృష్ణదేవరాయలు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి అపారమైన‌ భక్తుడని చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తోంది.......తిరుమల కొండలకు దిగువ‌న ఉన్నచంద్రగిరి గ్రామంలో బహుళ అంతస్థులతో దుర్గాన్ని (కోట) నిర్మించుకొని ఏడు పర్యాయాలు తిరుమల క్షేత్రాన్ని సందర్శించారు....ఆ సమయంలో ఆయన చంద్రగిరిలో ఒక రాములవారి ఆలయాన్ని నిర్మించారు...శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల అధీన పరచుకుంది.

టిటిడి అనుబంధ ఆలయమైన చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం( 20-10-2019) పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమకుంభారాధన, మండలపూజ, ఉపకుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు. ఉదయం 9.00 నుండి మ‌ధ్య‌హ్నం 12.00 గంటల వరకు యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. అనంతరం మూలవర్లకు, శ్రీనరసింహస్వామివారు, శ్రీగోదాదేవి అమ్మవారు, 12 మంది ఆళ్వార్లు, శ్రీ వేణుగోపాలస్వామివారు, శ్రీ అభయ ఆంజనేయస్వామివారు, శ్రీ భక్త ఆంజనేయస్వామివారు, శ్రీ విష్వక్సేనులవారికి, శ్రీ గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, విమానగోపురానికి పవిత్రాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో సుబ్ర‌మ‌ణ్యం, సూపరిండెంట్ కృష్ణారావు, కంకణభట్టర్‌ కృష్ణ బ‌ట్టర్‌, ఆలయ అర్చకులు శ్రీ శ్రీనివాస బట్టర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ చైతన్య, ఇతర అధికార ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories