శివలింగానికి కొప్పు ఉండడం ఎక్కడయినా చూసారా..

శివలింగానికి కొప్పు ఉండడం ఎక్కడయినా చూసారా..
x
Koppu Lingeshwara Swamy
Highlights

శివాలయాలలో శివలింగాన్ని ఎక్కడ చూసినా ఒకే మాదిరిగా ఉంటాయి. కానీ ఓ శివాలయంలో మాత్రం శివలింగానికి కొప్పు దర్శనం ఇస్తుంది.

శివాలయాలలో శివలింగాన్ని ఎక్కడ చూసినా ఒకే మాదిరిగా ఉంటాయి. కానీ ఓ శివాలయంలో మాత్రం శివలింగానికి కొప్పు దర్శనం ఇస్తుంది. ఇది వింటుంటే విచిత్రంగా ఉంది కదూ..అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది.. ఆలయ విశేషాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం..

శివక్షేత్రాలలో అతి ప్రాచీనమైన శివక్షత్రం 'కొప్పు లింగేశ్వర స్వామి'ఆలయం. ఈ ఆలయంలో ఉండే శివలింగం సాధారణంగా కాకుండా కాస్త విచిత్రంగా ఉంటుంది. ఈ శివలింగానికి స్త్రీకి ఉన్నట్టుగా పైన కొప్పు ఉంటుంది. అదే ఈ శివలింగం ప్రత్యేకత.

ఈ ఆలయం రాజమండ్రికి సమీపంలో ఉన్న కొత్తపేటకు మూడు కిలోమీటర్ల దూరంలోనున్న 'పలివెల' గ్రామంలోని, 'కౌశికి' నదీతీరాన ఈ 'కొప్పులింగేశ్వరస్వామి'వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని స్వామి పేరు నిజానికి 'అగస్తేశ్వరుడు'. ఈ శివలింగాన్ని అగస్త్యమహర్షి ప్రతిష్ఠించారు. అయితే..'కొప్పులింగేశ్వరుడు' అనే పేరు ఎందుకు వచ్చింది? దానికి ఓ కథ ఉంది. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం..

స్థల పురాణం

ఈ ఆలయం 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరం రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుడు కాలంలో నిర్మించాడు. ఈ స్వామి వారికి నిత్య పూజలు అభిషేకాలు చేయడానికి ఓ అర్చకుడుండేవాడు. అతను ఓ గొప్ప శివభక్తుడు. ఎంతటి భక్తులైనా ఏదోఒక సమయంలో బలహీనతలకు లోనవక తప్పరు. ఇదే కోణంలో ఈ అర్చకుడు కూడా కాంతాదాసుడయ్యాడు. విషయవాంఛల వలయంనుంచి తప్పించుకోలేక.., వేశ్యాలోలుడయ్యాడు. ఆ అర్చకుడు ప్రతిరోజు శివలింగానికి అలంకరించవలసిన పూలను తన ప్రియురాలి ముచ్చట తీర్చడం కోసం ముందుగా తన ప్రియురాలికి అలంకరించే వాడు. ఆ తరువాత అవే పూలను తీసుకువచ్చి శివలింగానికి అలంకరించేవాడు. ప్రతి రోజు ఇదే విధంగా జరిగేది. ఎంత వేశ్యాలోలుడైనా, శివార్చన చేసే విషయంలో భక్తిలోపం రానిచ్చేవాడు కాదు.

ఇలా జరుగుతున్న సమయంలో ఒకరోజు మహారాజుగారు స్వామి దర్శనానికి దేవాలయానికి వచ్చారు. అర్చకుడు పూజలు నిర్వహించి అందరికీ ఇచ్చినట్టుగానే వేశ్యకు అలంకరించిన తర్వాత శివలింగానికి పెట్టిన పూలమాలను మహారాజుకు శివప్రసాదంగా అందించాడు. మహారాజుకు ఇచ్చిన ఆ పూలలో ఓ పొడవైన వెంట్రుక ఉండడాన్ని గమనించాడు. వెంటనే మహారాజు పూజారిని కోపంగా చూస్తూ ఈ వెంట్రుక ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, నిజం చెప్పు' అని గట్టిగా మందలించాడు. అప్పుడు ఆ అర్చకుడికి ఒక్క సారిగా వెన్నులో భయం చొచ్చుకుంది. ఎలా ఈ సమస్య నుంచి బయట పడాలా అని ఆలోచించిన అర్చకుడు ధైర్యం తెచ్చుకుని 'మహారాజా..ఈ శివలింగానికి కొప్పు ఉందని, ఈ వెంట్రుక శ్రీ స్వామివారిదే' అని చెప్పసాగాడు. అప్పుడు మహారాజు వెంటనే నిజమా ఏదీ ఒక్కసారి నాకూ స్వామివారి కొప్పు చూపించు' అని అడిగాడు. ఇక అర్చకుడు వెంటనే 'మన్నించండి మహారాజా.. నేడు అలంకరణ పూర్తి అయింది.

రేపు ఉదయం స్వామి దర్శనానికి రండి, అప్పుడు తప్పకుండా స్వామివారి కొప్పు చూపిస్తాను అని అన్నాడు. సరేనని మహారాజు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అర్చకుడు తనకొచ్చిన కష్టాన్ని స్వామివారికి చెప్పుకుని, కాపాడమని ప్రార్థించి, తిరిగి వేశ్య ఇంటికి వెళ్ళిపోయాడు. సరే అని రాజు వెళ్ళిపోయాడు .పూజారికి అబద్ధం ఆడినందుకు ప్రాణ సంకటంగా ఉంది .తనతప్పును రాజు గమనిస్తే మరణ శిక్ష ఖాయం అనుకోని పశ్చాత్తాప పడతాడు.బోళా శంకరుడు దయ తలిచి తనలింగం పై కొప్పు దానికి శిరోజాలు సృష్టించి పూజారిని కాపాడాడు. మర్నాడు రాజు రావటం స్వామి శిరస్సున శిరోజాలు చూసి పూజారిని అనుమానిచి నందుకు మన్నించమని కోరడం జరిగింది .పూజారినీ రాజును భక్త వత్సలుడు మన్నించి దీవించాడు .అప్పటినుండి కొప్పు లింగేశ్వర స్వామిగా ప్రజలు కొలుస్తున్నారు.

ఇతర విషయాలు

ఈ ఆలయానికి తూర్పున కౌసికి, దక్షిణాన సాంఖ్యాయని, ఉత్తరాన మాండవి, పల్వల అనే నదుల మధ్య లో ఈ ఆలయం ఉంది. శివ లింగానికి పై భాగం లో చతురస్రాకారం లో కొప్పు కనిపిస్తుంది .అందుకే కొప్పు లింగేశ్వరుడుగా దర్శనం ఇస్తాడు. పార్వతీ దేవి గర్భ గుడిలోనే స్వామి లింగంప్రక్కనే ఒకే పీఠంపై కొలువై ఉండటంవిశేషం.ఈ ఆలయంలో కుమారస్వామి వినాయకుడు కూడా ఉన్నారు.

రవాణా సౌకర్యాలు

ఈ దేవాలయం కొత్తపేట కు 2 కిలోమీటర్ల ఉంది. రాజమహేంద్రవరం , అమలాపురం నుండి బస్సు సౌకర్యం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories