తులసి పూజ ఎందుకు చేస్తారు...తులసిలోని ఔషదగుణాలేంటి..

తులసి పూజ ఎందుకు చేస్తారు...తులసిలోని ఔషదగుణాలేంటి..
x
Tulasi plant
Highlights

తులసి ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామము ఓసిమమ్ టెన్యుయిఫ్లోరమ్.

తులసి ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామము ఓసిమమ్ టెన్యుయిఫ్లోరమ్. ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు. ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు. షోడశోపచార పూజా విద్ధానములో తులసికి విశిష్ట స్థానం ఉంది.నేడు విదేశీయులు సైతం తులసిలోని విశేషమును అంగీకరించుచున్నారు. పరమపవిత్రమైనదిగా భావించే తులసి కోట అన్ని ఇళ్ళల్లో ఉంటుంది. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. ఈ పత్రి తులసీ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఏడవది.

తులసి ప్రాముఖ్యత

హిందూ మతంలో, ప్రత్యేకించి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి, పూజావిధానాలు ఉన్నాయి. ఆడువారు తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, నియమాలు, స్తోత్రాలు, భక్తి గేయాలు ఆచారంలో ఉన్నాయి. తులసి తీర్థం అన్నమాట తరచు వింటాము. తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలి ఉంది. దీన్ని సర్వరోగ నివారణిగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు. తులసి 24 గం.లూ ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది. ఆ వాయువును పీల్చుట వలన ' యజ ' చేయగా వచ్చు ఫలితము వచ్చుచున్నది.కావున ప్రతి ఇంట్లో కనీసం 10 మొక్కలయినా పెంచి, వాతావరణ కాలుష్యాన్ని నివారించి, ఆరోగ్యాన్ని రక్షించుకొని, తులసి తీర్థం సేవించండి. త్రికాలములందు తులసిని సేవించినచో అనేక చాంద్రాయణ వ్రతములకంటే మిన్నగా శరీరశుద్ధియగును.తులసి యొక్క సువాసన వ్యాపించి ఉన్న వాతావరణంలో నివసించు ప్రాణికోటి పవిత్రులు, నిర్వికారులు కాగలరు.తులసి మొక్క వున్న చోట త్రిమూర్తులు మొదలగు సర్వ దేవతలు నివసింతురు.తులసి దళములందు పుష్కరాది తీర్ధములు, గంగ మొదలగు నదులు, వాసుదేవది దేవతలు నివసిస్తారని చెబుతారు.

ఔషధంగా తులసి:

తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు. తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్‌లాగా, జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి.

పురాణాలలో తులసి:

తులసిని గురించి హిందూమతంలో ఎన్నో కథలు, నమ్మకాలు, ఆచారాలు ఉన్నాయి. తులసి పవిత్రత గురించి బ్రహ్మవైవర్త పురాణంలో తులసి వరింపబడింది. పరశురాముడు తన గురువైన శివుడిని దుర్గాదేవి గణపతిని అన్ని పుష్పములతో అర్చించాడు కాని తులసితో అర్చించక పోయినా గణపతి ఆ పూజలు ఎందువలన స్వీకరించాడు అని నారదుడు నారాయణ మునిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వృత్తాంతాన్ని చెబుతారు. ఒక్కప్పుడు యవ్వనము నందున్న తులసి నారాయణుడిని మనసులో తలచుకొనుచు వెళ్ళుచుండగా గంగానది తీరంలో చందనము రాసుకొని రత్నాలంకారములతో నారాయణుడి గురించి ధ్యానం చేసుకొనుచున్న గణపతి కనిపించెను. ఆయనను చూసి తులసి కామ పీడితురాలై గణపతితో వికారముగా గజముఖమును కలిగి లంబోదరముతో ఏకదంతము కలిగి నువ్వు ధ్యానం వదిలి పెట్టి బాహ్య ప్రపంచములోకి రమ్ము అని అంటుంది. దానికి సమాధానంగా, తల్లి శ్రీకృష్ణ పాదపంకజాలను స్మరిస్తున్న నన్ను ఏలా నా ధ్యానాన్ని భంగము చేయుచున్నావు, నీ తండ్రి ఎవరు, నీకు ఏ విఘ్నాలు కలగకుండ ఉండుగాక నీ విషయాలు తెలుపుము అని అంటాడు. అప్పుడు తులసి తాను ధర్మద్వజుడు కుమార్తెనని భర్త కోసం తపం ఆచరిస్తున్నానని గణపతిని భర్తగా అవ్వమని కోరుకొంటుంది. అప్పుడు గణపతి వివాహానికి నిరాకరించి పెళ్ళి దుఃఖం కలిగించునని శ్రీహరి సాన్నిధ్యము నుండి వేరు చేయునని, మోక్షమార్గానికి కవాతం కాదని వారిస్తాడు. తులసి దానికి కోపించి గణపతిని ఈ విధంగా శపిస్తుంది "నీభార్య అందరివద్ద ఉండుగాక". ఈ శాపవచనమును విన్న గణపతి ప్రతిశాపంగా "నువ్వు రాక్షస జన్మ ఎత్తుతావు, శరీరాన్ని పరిత్యజించిన తరువాత వృక్షానివి అవ్వుతావు" అంటాడు. పుష్పములన్నింటికి ప్రధానదానవు అవుతావు, సమస్త దేవతలకు ప్రత్యేకంగా శ్రీకృష్ణపరమాత్మకు ప్రీతి పాత్రురాలు అవుతావు, నీచేత చేయబడిన పూజ మానవులకు మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పి గణపతి బదరికా వనానికి వెళ్ళి పోతాడు. ఆ తరువాత తులసి శంఖచూడునకు అనే రాక్షసుడికి కుమార్తెగా జన్మిస్తుంది, శంఖచూడుడు శివుని చేత శూలంతో సంహరించబడ్డాక తులసి వృక్షరూపాన్ని పొందుతుంది. అందువల్ల గణపతి ప్రతి నిత్యం తులసితో పూజించరాదు.ఈ విషయాలు ధర్ముడు తనకు చెప్పెనని నారాయణ ముని నారదునితో చెప్పడంతో ఆ వృత్తాంతం ముగుస్తుంది.

ఆచారాలలో తులసి:

తులసి విష్ణువునకు ప్రియమైన భక్తురాలు. విష్ణుపూజలో తులసిని విరివిగా వాడుతారు. తులసి పూజ చేస్తే మాంగల్యం చిరకాలం నిలుస్తుంది. తులసి ఉన్నచోట దుష్ట శక్తులు ప్రవేశించవు. ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి. కార్తీక శుక్ల ఏకాదశి నాటినుండి పౌర్ణమి వరకు తులసీ వివాహం ఉత్సవం జరుగుతుంది.

దేవతగా తులసి:

తులసి ఇంటి ప్రాంగణములో ఉండటం ఆ ఇంట్లో నివసించే హిందూ కుటుంబము యొక్క సాంప్రదాయ నిష్టను సూచిస్తుంది. వైష్ణవం వంటి అనేక సంప్రదాయాలలో తులసి మొక్క ఇంట్లో లేనిదే ఆ ఇళ్ళు అంసపూర్ణమని భావిస్తారు. ఇటువంటి కుటుంబాలలో తులసి ఒక ప్రత్యేకమైన స్థానములో తులసికోట కట్టించి అందులో నాటతారు. తులసికోటకు నలువైపులా దేవతాచిత్రాలు ఉండి నాలుగు వైపులా ప్రమిదలు లేదా దీపం పెట్టడానికి చిన్న గూళ్ళు ఉంటాయి. కొన్ని ఇళ్ళలో వరండాలో ఒక డజను దాకా తులసి మొక్కలు పెంచుతారు. ఒక చిన్నపాటి పొదలాగా పెరిగిన దీన్ని తులసీవనం లేదా తులసీ బృందావనం అని పిలుస్తారు.

తులసి పూజ:

ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి మొక్కకు చెరుకు గడలతో పందిరి వేసి, ఆ పందిరికి మామిడి తోరణాలు కట్టి, తులసి మొక్కను పూలతో అందంగా అలంకరించి పూజ చేసే సంప్రదాయము భారతదేశములో ఉంది. దీపావళి ఉత్సవాలలో లాగే తులసి మొక్కచుట్టూ, ఇంటి చుట్టూ మట్టి ప్రమిదలో దీపాలు పెట్టి అలంకరిస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ సందర్భంగా బాణాసంచా కూడా కాల్చుతారు. ఉత్తర భారతదేశములో, దక్షిణాన గౌడియ వైష్ణవ సముదాయాలలో ఆ రోజును తులసీ వివాహ్ లేదా తులసికి కృష్ణునితో శిలారూపములో వివాహము జరిగిన రోజుగా భావిస్తారు.

తులసితో ఉపయోగాలు:

తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్‌లాగా, జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి.

తులసి ఆకుల్ని పలురకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. జ్వరం మరీ తీవ్రంగా ఉంటే తులసి ఆకులనూ, యాలకుల పొడినీ కలిపి అరలీటరు నీళ్లలో మరిగించి కషాయం తయారు చేయాలి. అందులో చక్కెర, పాలు కలిపి తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది. తులసి ఆకుల్ని మెత్తగా నూరి నీటిలో కలుపుకుని రెండుమూడు గంటలకోసారి తాగొచ్చు.

పలురకాల ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని తప్పకుండా కలుపుతారు. బ్రాంకైటిస్‌, ఆస్థమాల్లో కఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లతో నోటిని పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది. ప్రతిరోజు 5 లేదా 6 ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. నులిపురుగులు నశిస్తాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories