Top
logo

Sri Gattu Narasimhaswamy Temple : దక్షిణాభిముఖ నరసింహస్వామి ఆలయ విశేషాలు

Sri Gattu Narasimhaswamy Temple : దక్షిణాభిముఖ నరసింహస్వామి ఆలయ విశేషాలు
X

గట్టు నరసింహ స్వామి ఆలయం

Highlights

Sri Gattu Narasimhaswamy Temple : భారత దేశంలో ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన హిందూ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఈ...

Sri Gattu Narasimhaswamy Temple : భారత దేశంలో ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన హిందూ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంది. అలా చరిత్ర కలిగిన ఆలయాల్లో తెలంగాణలోని శ్రీ గట్టు నరసింహస్వామి దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయం ఖమ్మం జిల్లా ప్రధానకేంద్రం ఖమ్మం పట్టణం నడిబొడ్డున ఒక ఎత్తయిన గుట్టపై ఉంది. ఈ ఆలయం తెలంగాణలోని ప్రముఖ ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ది చెందింది. ప్రహ్లదుడిని రక్షించేందుకు నరసింహస్వామివారు ఒక స్తంభంలోనుంచి బయటకు వచ్చారని కథనం. అటువంటి స్తంభాన్నికలిగివున్న ప్రాంతం కాబట్టి స్తంభాద్రి, స్తంభశిఖరి, కంభంమెట్టు అనే పేర్లనుంచి కాలక్రమంలో ఖమ్మం అనే పేరు ఏర్పడింది అని చెపుతుంటారు.

శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు ఈ నామాలన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.

ఆలయ చరిత్ర..

శ్రీమహావిష్ణువు నరసింహావతారంలో హిరణ్యకశిపుడనే రాక్షసుడిని సంహరించి ఆయన కుమారుడు ప్రహ్లాదుడిని కాపాడే కథ చాలా ప్రముఖమైనదే. ఆనాడు స్తంభము నుండి ఉద్భవించిన స్వామియే ఈ కొండపై ఉన్న గుహలో వెలిసాడని అందుచేతనే కొండకు స్తంభాద్రి అనే పేరు వచ్చిందని చెపుతారు. అంతేకాక ఈ కొండమొత్తంగా కూడా ఒక స్తంభంఆకారంలో వుంటుంది. కాబట్టి కూడా పట్టణానికి స్తంభాద్రి అనే పేరు వచ్చేందనేది మరొక కథనం. అంతేకాక ఆరోజులనుంచే కంభంమెట్టు అనే పేరు వుందని ఖమ్మంజిల్లా ఆదికవి హరిభట్టు తన వరాహ పురాణములో పేర్కొన్నాడు.

1953వ సంవత్సరంలో ఖమ్మం ప్రత్యేక జిల్లాగా అవతరించిన తర్వాత ఖమ్మం మెట్టును ఖమ్మంగానూ అదేవిధంగా అప్పటివరకూ వరంగల్ జిల్లాలో భాగంగా మాత్రమే వున్న ఖమ్మం జిల్లాను ఒక ప్రత్యేక జిల్లాగానూ గెజిట్ ద్వారా మార్చారు. ఇలా జిల్లా పేరుకు ప్రధాన కారణంగా ఈ ఆలయం కావటం మరింత ప్రత్యేకత.

ఆలయ ప్రత్యేకతలు...

దక్షిణాభిముఖుడు

సాధారణంగా దేవాలయాలు తూర్పులేదా ఉత్తరదిశలకు తిరిగి వుంటాయి కానీ ఇక్కడి నరసింహస్వామి మాత్రం దక్షిణాభిముఖుడుగా వుంటాడు.

స్వయంభూవుగా వెలసిన నారసింహ స్వామి

ఎత్తైన కొండలపై వెలసిన నారసింహమూర్తి శిల్పం సహజంగానే వెలసిందని, శతాబ్ధాల కాలం నుంచి అది అక్కడే వున్నట్లు భావిస్తారు.

అత్యంత ప్రాచీన శిల్పనిర్మాణ శైలి

ఈ ఆలయ స్తంభాలపై కనిపించే స్తంభాల శిల్పనిర్మాణ శైలి కాకతీయుల స్తంభాలను పోలి వున్నప్పటికి అంతటి పూర్తి స్థాయి నగిషీలు లేక చాలా ప్రాథమిక దశలోనే వున్నట్లు కనిపిస్తుంది. అంతేకాక గర్భగుడికి ముందున్న నిర్మాణంలో ముందస్తుగా ఏర్పరచిన స్తంభాలకూ ఆ తర్వాత విస్తరణలో అభివృద్ధి పరచిన స్తంభాలకూ మధ్య భేదాన్ని గమనించ గలుగుతాం.

నలుపలకల ఏకశిలా ధ్వజస్థంభం

ఇక్కడి ధ్వజస్తంభం పూర్తిగా శిలతో నిర్మించినదే, మరి అత్యంత ఎత్తుగా కాక గుడికంటే కొంత ఎత్తుగా మాత్రం వుంటుంది. అంతే కాకుండా ధ్వజస్తంభం గుండ్రని నిర్మాణంతో స్తూపం ఆకారంలో కాక ఇది నలుపలుకలుగా దీర్ఘఘనం ఆకారంలో వుంటుంది.

స్వామి వారి చూపుని అనుసరించి ఐమూలగా ధ్వజస్తంభ నిర్మాణం

సాధారణంగా దేవాలయాలలో గర్భగుడిలోని మూలవిరాట్టుకు కచ్చితంగా ఎదురుగా వుండేలా ధ్వజస్తంభ నిర్మాణం చేస్తారు.కానీ ఇక్కడ మూల విగ్రహానికి ఎడమ వైపు ఐమూలగా కొంత కోణంలో ధ్వజస్తంభం వుంటుంది. ఇలా వుండటానికి కారణం మూలవిరాట్లు ముందుకు లంభంగా కాక కొంత కోణంలో పక్కకు చూస్తున్నట్లుగా వుండటమే అని వంశపారంపర్యంగా ఇక్కడి పూజాదికాలు నిర్వహిస్తున్న అర్చకులు వివరించారు.

రాతి ధ్వజస్తంభంపై అత్యంత ప్రాథమిక రూపంలో గీసిన ఒక పక్షివంటి రూపం ఉంది. అంటే దానిని నరసింహావతారం ప్రాథమిక రూపమైన విష్ణుమూర్తికి వాహనం అయిన గరుత్మంతునిగా భావించి గీచి వుండవచ్చు. అలాగే మరోపక్క ధ్వజస్తంభంపై చేపవంటి ఆకారం కనిపిస్తోంది. బహుశా స్తంభం తొడుగులోపల పరిశీలిస్తే దశావతారాలు పూర్తిగా వుంటాయేమో. ఈ చేప మత్చావతారానికి ప్రతీకగా గీచి వుండవచ్చు.

కొండమీద నీటి కొలను

ఇంత ఎత్తుగా వున్న కొండపై సంవత్సరం పొడవునా నీటినిల్వలు వుంటాయి. కొండను రెండుగా చీల్చినట్లున్న ప్రాంతంలో అంతమైన కొలను కనిపిస్తుంది.

నాభిసూత్ర జలాభిషేకం

ఉగ్రరూపుడైన నరసింహుని శాంతిపజేయటానికా అన్నట్లు కొలను నిండుగా వున్నప్పుడు అక్కడినుండి వున్న నాభివంటి అంతర్గత మార్గాల ద్వారా స్వామివారిని చల్లబరిచే అభిషేకం జరుగుతుందట. కొన్నిసార్లు కేవలం చెమ్మవంటి తడిమాత్రమే కాక ఏకంగా ప్రవాహంలాగా నీరు కొండమీది కొలనునుంచి గర్భగుడిలోని స్వామివారి విగ్రమాన్ని తడుపుతూ నీళ్ళు చేరుటాన్ని ఈ అర్చకులు చాలా సార్లు గమనించారట. దీనిని దేవాలయ మహాత్మ్యానికి విశేష ఉదాహరణగా పేర్కొంటారు.

కోడె స్తంభం

మూలవిరాట్టుకు కొంత కోణంలో రాతి ధ్వజస్తంభం నిర్మిస్తే సరాసరి ఎదురుగా ఒక నిలువెత్తు రాతి స్తంభం భూమిలో పాతి నిలబెట్టి వుంటుంది.దానికి మధ్యలో ఒక గంటుకూడా ఉంది. దీనిని మొక్కుబడులు తీర్చుకునే కోడె స్తంభంగా ఆలయ అర్చకులు పేర్కొన్నారు. మొక్కుబడులను అనుసరించి ఈ స్తంభానికి వారు దారంతో కొంత సమయం మేర కట్టేసుకోవడం ద్వారా మొక్కుబడిని చెల్లించుకుంటారని తెలియజేసారు. బహుశా జంతుబలులకు కట్టుస్తంభంగా కానీ వధ్యశిలగా కానీ ఇది వాడుకుని వుండొచ్చనే విశ్లేషన కూడా ఒకటి ఉంది.

క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి

ఈ నారసింహ క్షేత్రానికి క్షేత్రపాలకుడు హనుమంతుడి, దక్షిణదిశగా తిరిగి వున్న ఈ ఆలయంలో ఆగ్నేయ దిశలో క్షేత్రపాలకుని మందిరం వుంటుంది.

పానకఫు అభిషేకం

చాలా నరసింహ క్షేత్రాలతో స్వామివారికి నైవేద్యపానియంగా పానకాన్ని సమర్పిస్తారు. మంగళగిరి నరసింహస్వామికి ఎన్నిబిందెలు పానకం పోసినా స్వీకరిస్తాడని అయినప్పటికి భక్తులకు ప్రసాదంగా కొంత మిగుల్చుతాడని కథనంగా చెప్పుకుంటారు. ఆవిధంగా మిగిల్చే పద్ధతిలో శిల్పాన్ని నిర్మిస్తూ శిల్పులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇక్కడి ఖమ్మం గట్టు నరసింహస్వామికి పానకంతో అభిషేకం చేయడం ప్రత్యేకత. అత్యంత ఉగ్రరూపుడైన స్వామివారిని శాంతింపజేసేందుకు పానకంతో అభిషేకం చేయడం అనే పద్ధతి పూర్వకాలం నుంచి వస్తోందని తెలియజేసారు.

సర్పశిలలు

సర్పదోష మొక్కుబడులకూ దోష నివారణకూ సర్పశిల లేదా ఇప్పటి రోజుల్లోలాగా లోహసర్పాలనూ పూజలో వుంచి దేవాలయాల వద్దవదిలేసే ఆనవాయితీ ఉంది. దానిని సూచిస్తున్నట్లు ఇక్కడ అనేక రకాలైన అనేక సర్పశిలలు కనిపిస్తాయి.

ఆహ్లాద కరమైన పార్కు

దేవాలయం ఆవరణలో వున్న విశాలమైన పార్కు ప్రధాన ఆకర్షణ. మెట్లదారిలో ఎక్కుతూ రావడానికి కష్టం అయిన వారికి పార్కువైపు నుంచి వాహనాల ద్వారా చేరుకునే ఏర్పాట్లు చేయడం వల్ల భక్తుల రద్దీ మరింత పెరిగింది. భక్తిభావంతోనే కాకుండా ప్రశాంత వాతావరణాన్ని అనుభవించేందుకు కూడా ఈ స్తంభశిఖరి అత్యంత అనుకూలమైన ప్రాంతం

గరుడశిల్పం నిర్మాణ ఏర్పాట్లు

గట్టు నరసింహ స్వామి క్షేత్రం మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు భారీ గరుత్మంతుని శిల్పాన్ని స్తంభాద్రి కొండపై నిలబెట్టేందుకు తగిన సన్నాహాలను చేస్తున్నారు.

Web TitleHistory of Sri Sri Lakshmi Narasimhaswamy Temple Khammam Telangana
Next Story