Sri Lakshmi Narayana Swamy Temple Vepanjeri : శ్రీ లక్ష్మీనారాయణుడికి 'వేం పంచ హరి' అనే నామం ఎందుకొచ్చింది

Sri Lakshmi Narayana Swamy Temple Vepanjeri : శ్రీ లక్ష్మీనారాయణుడికి వేం పంచ హరి అనే నామం ఎందుకొచ్చింది
x
Highlights

Sri Lakshmi Narayana Swamy Temple Vepanjeri : భారత దేశంలో ఎన్నో హిందూ దేవాలయాలు నెలకొని ఉన్నాయి. ఆ దేవాలయాల్లో 'వేం పంచ హరి' శ్రీ లక్ష్మీనారాయణ స్వామి...

Sri Lakshmi Narayana Swamy Temple Vepanjeri : భారత దేశంలో ఎన్నో హిందూ దేవాలయాలు నెలకొని ఉన్నాయి. ఆ దేవాలయాల్లో 'వేం పంచ హరి' శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఈ క్షేత్రం కూడా ఒకటి. ఈ ఆలయంలోని హరి భక్తులు కోరిన కోరికలు తీర్చే హరిగా పిలవబడతాడు. కాలక్రమంలో దీని పేరు వేపంజరిగా ప్రసిద్ధి గాంచింది. ఈ క్షేత్రానికి 'వేం పంచ హరి' అని పేరు అసలు ఎలా వచ్చింది అంటే'వేం' అనగా పాపమని, 'పంచ' అనగా ఐదు, 'హరి' అంటే హరించమనే అర్థం వస్తుంది. అసలు ఈ క్షేత్రం ఎక్కడ ఉంది అంటే ఈ ప్రాంతం తిరుపతికి 85 కిలోమీటర్ల దూరంలోనూ, చిత్తూరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

స్థలపురాణం...

చోళవంశానికి చెందిన మూడవ కుళోత్తుంగ రాజువారి పరిపాలనలో తొండ మండల గ్రామంలో క్రీ.శ. 12వ శతాబ్దంలో శ్రీలక్ష్మీనారాయణ స్వామి స్వయంగా వెలిసాడని చరిత్ర చెపుతుంది. ఓ వైష్ణవ భక్తుని కలలో గోచరించిన శ్రీమన్నారాయణుడు, కుళోత్తుంగ చోళుడు పరిపాలిస్తున్న సమయంలో తాను సమీపంలోని ఒక పుట్టలో ఉన్నట్లుగా తెలిపాడు. అయితే ఆ భక్తుడు వెంటనే తన కలలో కనిపించిన దృశ్యాన్ని రాజుకు వివరించాడు. దీంతో రాజు రాజ్యంలోని ప్రజల సమేతంగా స్వామి ఉన్న పుట్టకోసం వెదకడం ప్రారంభించాడు. అలా వెతకగా వెతకగా ఓ చిట్టడవిలో ఓ పుట్ట కనిపించింది. దాన్ని తొలగించగా, స్వామివారు, అమ్మవారిని తన తొడపై కూర్చోబెట్టుకున్న భంగిమలో శ్రీలక్ష్మీనారాయణుల వారి శిలాప్రతిమ దర్శనమిచ్చింది. వెను వెంటనే ఆ విగ్రహాన్ని ఓ పద్మపీఠంపై ప్రతిష్టింపజేసిన రాజావారు ఓ అద్భుతమైన ఆలయాన్ని కట్టించాడు. ఆ విధంగా మూడవ కుళోత్తుంగ నిర్మించిన ఆలయం నిత్య పూజలతో, ఉత్సవాలతో కళకళలాడింది. ఆ తరువాత ఆలయాన్ని పట్టించుకునే వారే కరువవ్వడంతో శత్రువుల దండయాత్రలకు, ప్రకృతి బీభత్సాలకు ధ్వంసమయ్యే స్థితికి చేరుకుంది. ఆ తరువాత ఆ ప్రాంతంలో వర్షాలు లేక పంటలు లేక అనావృష్టి తాండవించి, కరువు కరాళ నృత్యం చేయసాగింది. ఆ తరువాత గ్రామస్తులంతా తమ ప్రాంతానికే ఎందుకీ దురవస్థ అని ఆలోచించారు. ఆ పరమత్ముడు శ్రీలక్ష్మీనారాయణ స్వామికి నిత్య పూజలు జరుగక పోవడమే క్షామానికి కారణమని గ్రహించారు. అప్పటి నుంచి ఆలయంలో నిత్య పూజలు మొదలయ్యాయి. దాంతో ఆ ప్రాంతమంతా అప్పటి నుంచి పైరులతో కళకళలాడటం ప్రారంభించింది.

ఈ స్వామి వారి విగ్రహం సుమారు క్రీ.శ. 1178-1218 కాలం నాటిది. స్వయంగా స్వామి, అమ్మవారితో కలిసి భక్తుల కోరికలను తీరుస్తూ వుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ మనోహర రూపాన్ని దర్శించుకోడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. వేపంజరి గ్రామంలో ప్రధానమైంది అష్టలక్ష్మీ ఆలయం.

నక్షత్ర వనం

ఈ వనంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు తమ దేవేరులైన సరస్వతి, లక్ష్మి, పార్వతీ సమేతంగా కొలువై వుంటారు. అంతేకాక 27 నక్షత్రాలకు సంకేతంగా 27 వృక్షాలున్నాయి. అంతేకాక పుష్కరిణికి ఉత్తరదిశలో శ్రీవిద్య వినాయక విగ్రహం కూడా వుంది. దీని దగ్గర్లో 18 మెట్లతో అయ్యప్పస్వామి విగ్రహం వుంది. గంగమ్మ, భక్త ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు కూడా వుండటం విశేషం. శబరిమలైని తలపించే విధంగా స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఇంకా ఈ క్షేత్రంలో 33 అడుగుల ఎత్తుతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి వారి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది.

దశవతార పుష్కరిణి

ఈ పుష్కరిణిలో స్వామివారు కృష్ణ లీలలను తెలియజేసే కాళీయమర్దన రూపంలో వుండగా, దశవతార విగ్రహం పలువురిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం స్వామి వారి దశావతారాలు ఒకే విగ్రహంలో ఇమిడి వుండి 21 అడుగుల రూపంలో కనిపిస్తుంది. వక్షస్థల భాగంలో శివుని రూపం కలిగి వుంటారు. స్వామి వారి నాభిభాగంలో బ్రహ్మదేవుడు. ఈ దేవాలయంలో మూలవరులకు అభిషేకం, స్వర్ణపుష్పార్చన, కల్యాణోత్సవం (నిత్యం), దీపకైంకర్యం, పుష్ప కైంకర్యం (నెలకోసారి), నిత్యార్చన, గోసంరక్షణ, అన్నదానం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు, కైంక ర్యాలు, ఉభయం, నిర్వహించబడతాయి.

ఎలా చేరుకోవాలి..

చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకోవాలంటే మన రాష్ట్రం లోని విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాదు, రాజమండ్రి వంటి పలు ప్రాంతాల నుండి బస్సు, రైలు సౌకర్యాల ద్వారా చేరు కోవచ్చు. చెనై్న, బెంగళూరుల నుండి కూడా వేపంజరికి బస్సు సౌకర్యం వుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories