Top
logo

Kotappakonda Temple History: కాకులు వాలని కొండ ఎక్కడుందో తెలుసా

Kotappakonda Temple History: కాకులు వాలని కొండ ఎక్కడుందో తెలుసా
X
కోటప్పకొండ ఆలయం ఫైల్ ఫోటో
Highlights

Kotappakonda Temple History: చాలా మందికి కొత్త కొత్త ప్రదేశాలు చూడాలి, అక్కడి ప్రకృతిని ఆస్వాదించాలి అని...

Kotappakonda Temple History: చాలా మందికి కొత్త కొత్త ప్రదేశాలు చూడాలి, అక్కడి ప్రకృతిని ఆస్వాదించాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఏదైనా కొత్త ప్రదేశం గురించి తెలిసిందటే చాలు అక్కడికి ఒక్కసారైనా వెళ్లాలని అని అనుకుంటారు. ఆ విన్న మాటలు అక్కడికి వెళ్లి చూశాక నిజమే అనిపిస్తే ఆ ఆశ్చర్యానికి అవధులు ఉండవు. అలాంటి ఆశ్చర్యకరమైన ఓ ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉంది.

కాకులు దూరని కారడవి అనే పదం మీరు వినే ఉంటారు. కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు. కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా మనకు కనిపించదు. ఇప్పటి వరకు ఈ కొండపైన కాకులు వచ్చిన దాఖలాలు కూడా లేవు. అసలు ఎక్కడుంది ఆ కొండ ఇప్పుడు తెలుసుకుందాం. గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామ పరిధిలో కోటప్పకొండ త్రికోటేశ్వరుని సన్నిధి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరణాళ్లలో చుట్టుప్రక్కల ఊర్లనుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు.

కోటప్పకొండ స్థలపురాణం

పురాణ కథనాలను అనుసరించి దక్షాయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి, ప్రార్థించి తమకు జ్ఞానభోధ చెయ్యమని కోరాడు. పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా, బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోటనున్న గుడికే పాత కోటప్పగుడి అను పేరు. లోపలి లింగం ఒక అడుగు ఎత్తు కలది. ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరం అనబడుతుంది. విష్ణువు శివుడి కోసం ఇక్కడ తపస్సు చేశాడని నమ్ముతారు. ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం, పాపనాశ తీర్థ అనే పవిత్ర చెరువు ఉన్నాయి. రుద్ర శిఖరంనకు నైఋతి భాగంనున్న శిఖరంనకు బ్రహ్మశిఖరమని పేరు. రుద్రవిష్ణు శిఖరంలపై స్వయంభువులగు జ్యోతిర్లింగంలు వెలయుటయు, ఈ శిఖరంపై ఏమియు లేకపోవుటయుకని చింతిల్లి, బ్రహ్మ శివుని గూర్చి తపము చేసి శివుడిని లింగాన్ని ఆవిర్భవింపజేసెను. ఇదియే బ్రహ్మశిఖరం. త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది.ఇచ్చట తూర్పున గల చిన్నపల్లె మునిమంద, ఎల్లమంద అనిపేరు గలవి. తొలుత బ్రహ్మాది దేవతలు, సకల మునిగణములు శివుని ఇచ్చట పరివేష్టించియుండిరట. కావుననే దీనికాపేరులు వచ్చినవని చెపుతారు.

ఇంకొక కథనం ప్రకారం సుందుడు అనే యాదవుడు, భార్య కుందిరితో కలిసి త్రికుట కొండలకు దక్షిణంగా కొండకావూరులో నివసించేవాడు. వారి మొదటి బిడ్డ ఆనందవల్లి (గొల్లభామ) అనే అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు. నెమ్మదిగా ఆమె శివుని భక్తురాలైంది. రుద్ర కొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయడం ప్రారంభించింది. చివరికి, ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తిని కోల్పోయింది. ఆమె ప్రతిరోజూ రుద్ర కొండను సందర్శించేది. వేసవిలో కూడా తపస్సు చేసేది. ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు జంగమ దేవర లాగా ఆమె ముందు కనిపించి ఆమెకు భౌతిక జీవితంపై ఆశకలిగేటట్లు చేయడానికి, కన్య అయినప్పటికీ గర్భవతి అయ్యేటట్లు ఆశీర్వదిస్తాడు.ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనలను ఎప్పటిలాగే కొనసాగించింది. ఆమె లోతైన భక్తికి అతను మళ్ళీ కనిపించి, పూజలు చేయటానికి కొండ ఎక్కుతూ, దిగుతూ ఇబ్బందులు తీసుకోవలసిన అవసరం లేదని ఆమెకు చెప్పాడు. ఆమె ఇంటికే తాను వస్తానని ఆమెకు వాగ్దానం చేసి, ఆమెను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడవద్దని సలహా ఇచ్చాడు. రుద్ర కొండ నుండి, ఆనందవల్లి తన ఇంటి వైపుకు వెళ్లే మార్గంలో బ్రహ్మ కొండకు చేరుకున్న తరువాత, ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగింది. ఆమె వెనక్కి తిరిగిన క్షణం, ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని వీడి, జంగం దేవర కొండపై ఉన్న ఒక గుహలోకి ప్రవేశించి లింగ రూపుడయ్యాడు. ఈ పవిత్ర స్థలం కొత్త కోటేశ్వర ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది. తనకున్న భక్తిని పరీక్షించడానికి, తన గర్భం అతని సృష్టి అని ఆమె గ్రహించింది. ఆమె దేవునిలో ఐక్యమైంది. ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ గుడి నిర్మించారు. ఈ గుడిని సాలంకయ్య నిర్మించినట్టు స్థల పురాణం చెపుతుంది.

దేవాలయ చరిత్ర

ఈ కొండను ఏ కోణం నుండి చూసినా (త్రికూటాలు) మూడు శిఖరాలు కనపడతాయి. కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలు బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీ.శ 1172 లో నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు, ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేసారు. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్లమార్గాన్ని క్రీ.శ.1761లో నరసరావుపేట జమీందారు శ్రీ రాజా మల్రాజు నరసింహరాయణి నిర్మించాడు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేసారు.

అభివృద్ధి

యాత్రీకులు సాధారణంగా రాజా మల్రాజు నరసింహరాయలు నిర్మించిన మెట్ల మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. వాహనాలలో వెళ్ళడానికి 1999లో కోడెల శివప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో గుడి దాకా చక్కని ఘాట్ రోడ్డు నిర్మించబడింది. ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు ఉన్నాయి. రోడ్డు ఇరువైపులా ఎంతో అందమైన పూలతోటలు, తోవలో మ్యూజియం, జింకల పార్కు, పిల్లల కోసం పార్కు, ఒక సరస్సు, మధ్య చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం, దూరంనుంచే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు (లక్ష్మి, సరస్వతి, పార్వతి) విగ్రహాలు వుంచారు.
Web TitleHistory of kotappakonda Trikutesvaralayam Temple in Guntur Andhra pradesh
Next Story